ఒకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసు హైకోర్టులో ఉంది. ఇటీవలే కేసు దర్యాప్తు సిట్ నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. ఈ నేపథ్యంలో దొంగలు పడిన ఆరు నెలలకు ఇంటి యజమాని నిద్ర లేచినట్లు కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో జరిగిన ఫిరాయింపులపై దృష్టి సారించింది. కాంగ్రెస్ టికెట్ మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. వారిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. 2022 అక్టోబర్ 26వ తేదీన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఇదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌లో విలీనమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై కూడా విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ నేతలు సీబీఐని కోరనున్నారు.
న్యాయనిపుణలు సలహా మేరకు ముందుగా మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన వారిలో పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, కొల్లాపూర్ నుండి బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండుర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు వీరందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్లందరూ కేవలం రాజకీయ, ఆర్థిక ప్రయెజనాలను ఆశించి టీఆర్ఎస్‌లోకి వెళ్లారని టీపీసీసీ ఆరోపిస్తోంది. వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపింది. వారికి వ్యతిరేంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ఎలాగైతే విచారించారో ఈ వ్యవహారంపైనా నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.