అందరికన్నా ముందుగా అభ్యర్ధుల జాబితా ప్రకటించి బి.ఆర్.ఎస్. పార్టీ జోష్ మీద ఉంటే.. ఇపుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తో అదర గొట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణాలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం దళిత , గిరిజన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. బి.ఆర్.ఎస్. అమలు చేస్తోన్న దళిత బంధు పథకంలో పది లక్షల రూపాయలు అందిస్తోంటే అంబేద్కర్ అభయ హస్తం పేరిట తాము 12 లక్షలు అదిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ప్రజాగర్జన పేరిట కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తే ప్రజల ఆకాంక్షలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిందని ఖర్గే గుర్తు చేశారు. అయితే కేసీయార్ మాత్రం తన ఒక్కడి వల్లనే తెలంగాణా వచ్చిందని చెప్పుకుంటున్నారని ఖర్గే దుయ్యబట్టారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీల జీవితాలు మెరుగుపడేలా పలు పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు.
బి.ఆర్.ఎస్.అధినేత కేసీయార్ మానస పుత్రిక లాంటి దళిత బంధు పథకాన్ని పోలిన మరో పథకాన్ని డిక్లరేషన్ లో ప్రకటించారు. ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయ హస్తం పేరిట 12 లక్షలు ఇస్తామన్నారు. ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలను తమవైపు తిప్పుకోవచ్చునని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. దీంతో పాటు ఎస్సీల కోసం రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో కార్పొరేషన్ కూ 750 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీలు ఇళ్లు కట్టుకోడానికి ఆరు లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇచ్చింది.
రాష్ట్రంలో ప్రతీ మండలంలోనూ ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు పదో తరగతి పాస్ అయితే పదివేలు, డిగ్రీ పాస్ అయితే పాతిక వేలు, పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇళ్లులేని ఎస్సీ ఎస్టీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు పనుల్లోనూ ఎస్సీ ఎస్టీలకు వాటాలు వచ్చేలా చేస్తామన్నారు.
అసైన్డ్ భూములపై దళితులకు యాజమాన్య హక్కు ఉండేలా చట్టం తెస్తామని అన్నారు.
కర్నాటకలో ఘన విజయం సాదించినట్లే తెలంగాణాలోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కసిగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే రైతు డిక్లరేషన్ తో పాటు యూత్ డిక్లరేషన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన అయిదు ప్రధాన ఎన్నికల హామీలను తెలంగాణాలోనూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారానికి ముందే ఈ హామీలతో కూడిన ఒక గ్యారంటీ కార్డును ఇంటింటికీ పంపిణీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో కేసీయార్ పార్టీని ప్రజలే ఇంటికి సాగనంపడం ఖాయమని కాంగ్రెస్ నమ్ముతోంది. ఖర్గే కూడా అదే చెప్పారు. తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కేసీయార్ అధికారంలోకి వచ్చాక ప్రజలనూ వంచించారని అన్నారు.
బి.ఆర్.ఎస్. మొదటి జాబితా విడుదల అయిన తర్వాత కొద్ది రోజులు బి.ఆర్.ఎస్. శిబిరంలో ఉత్సాహం ఉరకలు వేసింది. అదే సమయంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేతలు ఎగబడ్డంతో వెయ్యికి పైగా దరఖాస్తులు అందాయి. ఆ దరఖాస్తులను వడపోసి గెలుపు గుర్రాలను అభ్యర్ధులుగా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ లోపు బి.ఆర్.ఎస్. లో టికెట్ రాని అసంతృప్తులను కాంగ్రెస్ లో చేర్పించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేయాలని నిర్ణయించారు.
అన్నీ చేసి బి.ఆర్.ఎస్. ను వచ్చే ఎన్నికల్లో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ హై కమాండ్ చాలా పంతంగా ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…