తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ప్రచారం తారా స్థాయికి చేరింది. సర్వేలు తలో రకమైన నివేదికలిస్తున్నాయి. సగటు ఓటరులో అయోమయం పెరిగిపోయింది. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలన్న ప్రయత్నంలో ఉంది. అధికారపార్టీని దించి తాను గద్దెనెక్కాలన్న తపన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఐనా ఏదో లోపం, ఏదో వెలితి. కాంగ్రెస్ నేతలు పద్దతి ప్రకారం పనిచేయడం లేదన్న అనుమానమూ కలుగుతోంది. పదేళ్ల పాటు ప్రజలను బీఆర్ఎస్ మభ్యపెట్టిన తీరు, చేయని పనులను కూడా చేసినట్లుగా చూపిన వైనాన్ని హస్తం పార్టీ ఎక్స్ పోజ్ చేయలేకపోతోంది. కేసీఆర్ తప్పిదాలను జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేసి లబ్ధి పొందడంలో కాంగ్రెస్ ఘెరంగా విఫలమైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి…
కేసీఆర్ కు ప్రచార పటాటోపం తప్ప ప్రజల నిజమైన బాధలు పట్టవని చాలా సందర్భాల్లో తేలిపోయింది. చేసేది గోరంత పని…ప్రచారం కొండంత స్థాయిలో ఉంటుందని కూడా నిరూపితమైంది. ఐనా సరే ఊకదంపుడు ఉపన్యాసాలతో జనాన్ని మభ్యపెట్టే కార్యాచరణ మాత్రం కేసీఆర్ సమర్థంగా కొనసాగిస్తూ వచ్చారు. కేసీఆర్ మాటలు చెబుతుంటే, పార్టీ నేతలు మాత్రం దోపిడీ రాజ్యానికి తెరతీసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.వాటిని నిలదీసి, జనంలో అవగాహన కల్పించాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి…
మేడిగడ్డ కృంగిందీ కళ్లెదుటే కనిపిస్తున్న నిజం. దీని వల్ల లక్షకోట్లు నీటి పాలైందన్నది వాస్తవం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైందన్నదీ జగమెరిగిన సత్యం. మరికొన్ని ప్రాజెక్టుల పరిస్థితి అదే స్థాయిలో ఉందని ఇంజినీరింగ్ నిపుణులే అంగీకరిస్తున్నారు. ప్రజాధనం ఇలా వృథా అవుతుంటే విపక్షాలు చేస్తున్నదేమిటన్నది మౌలిక ప్రశ్న. పైగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే మేడిగడ్డ వ్యవహారం బయటపడింది. ఒక రేంజ్ లో విరుచుకుపడాల్సిన కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో ప్రయత్న లోపం కనిపిస్తోంది. ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని ఇతర విపక్షాలు ఇంతకాలం ఆరోపిస్తూ వచ్చాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఉదాసీనతకు కారణం ఏమిటో…
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయమే చూస్తే ప్రభుత్వం చెబుతున్న దానికి, వాస్తవ స్థితిగతులకు చాలా తేడా ఉందనే చెప్పాలి. మూడు విడతలుగా జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చివరకు తూ.తూ.మంత్రమే అయ్యింది. సరైన గణాంకాలు లేకుండా, అర్హులైన లబ్ధిదారుల లెక్క తేలకుండా డబుల్ బెడ్ రూముల పథకాన్ని నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. ప్రతీ నియోజకవర్గంలోనూ 25 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకుని వెయిటింగ్ లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ఎక్కడ నుంచో వచ్చిన స్థానికేతరులకు కేటాయింపులు చేసి స్థానికులను పట్టించుకోలేదు. ఈ క్రమంలో లంచాలు చేతులు మారి మహబూబ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో అవినీతిపరుల అరెస్టుకు కూడా జరిగాయి. ఇంత జరుగుతున్నా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీసినంతగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదన్న వాదన వినిపిస్తోంది. హస్తం పార్టీలో ఉదాసీనత పెరిగిందన్న అనుమానాలకు తావిస్తోంది.
రైతు బంధు, దళిత బంధు విషయంలో కూడా కాంగ్రెస్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిజానికి రైతు బంధు మంచి పథకమే అయినా అదీ కౌలు రైతులకు పెద్దగా ఉపయోగపడలేదు. పాతిక ఎకరాలు పొలమున్న రైతులకు ప్రయోజనం కలిగించినంతగా ఎకరం, రెండెకరాల పేద రైతులకు ప్రయోజనం కలిగించడం లేదనే చెప్పాలి. ఇప్పుడు వ్యవసాయదారుల్లో మరో ప్రశ్న తలెత్తుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందంచడం లేదు. రైతు బంధు ఇచ్చాం దానితో సరిపెట్టుకోవాలన్నట్లుగా సంకేతాలిస్తోంది. ఇక దళిత బంధు కొందరికే అందుతుంటే అందులోనూ ఎమ్మెల్యేలు కమిషన్లు దండుకున్నారు. కమిషన్లు తీసుకుంటే సహించేది లేదని స్వయంగా కేసీఆర్ హెచ్చరించారే తప్ప..కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలదీసిన దాఖలాలు లేవు..
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ లో అవకతవకలతో రైతులు ఇబ్బంది పడుతున్నా.. విపక్షాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. తమకు తెలియకుండానే ప్రాపర్టీ ట్రాన్స్ ఫర్ జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నా చెవికి ఎక్కించుకోలేదు. ధరణి పోర్టలే వేస్ట్ అన్న నిర్థారణ జరిగిన తర్వాత ఇప్పుడు మాత్రమే మేల్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ఎదురుదాడికి ఎదురొడ్డి నిలబడిన వాళ్లూ లేరు. ఎన్నికల వేళ మాత్రమే కాంగ్రెస్ పార్టీ కాస్త స్పీడ్ పెంచింది. అధికారానికి రాగానే ధరణి కంటే మంచి వెబ్ సైట్ తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నారు..
గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను కాలుష్యం కోరల నుంచి కాపాడే 111 జీవో రద్దు నిర్ణయాన్ని తెలంగాణ సమాజం వ్యతిరేకించింది. ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా, శాస్త్రీయతకు అవకాశం ఇవ్వకుండా 111 జీవో రద్దు ద్వారా ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలకు అవకాశం ఇచ్చారని పౌర సమాజం కోడై కూసింది. స్థానిక ప్రజలను భాగస్వాములను చేయకుండా, వారి భవిష్యత్తుపై ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రజా సంఘాలు నిరసన తెలియజేసినా ఉద్యమించడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందు వెనుక ఆలోచించింది. 84 గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినా ఆ స్థాయిలో స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి.
కమీషన్ల రాజ్యంలో కాంగ్రెస్ బాధ్యత నెరవేర్చలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేద అల్పాదాయ కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఉపయోగపడే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ నిధుల విడుదలకు అధికారపార్టీ వారు 10 నుంచి 20 శాతం కమీషన్లు దండుకుంటున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానాలు కలుగుతున్నాయని కొందరంటున్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ కమిషన్లతో బీఆర్ఎస్ వారి జేబులు నిండిన మాట వాస్తవం..
ప్రభుత్వం లేని గొప్పలు చెప్పుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. వాస్తవంగా చూస్తే ఆ విషయంలో దేశంలోనే తెలంగాణ పదో స్థానంలో ఉందని చెప్పక తప్పదు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఐనా ప్రభుత్వ వాదనను ఎండగట్టి వాస్తవాలను జనం ముందు ఉంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నించ లేదు. పారిశ్రామిక ప్రగతి విషయంలోనూ అదే పరిస్థితి కనిపించింది. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని చెప్పేందుకు బీఆర్ఎస్ సర్కారు వెనుకాడలేదు. హైదారాబాద్ అభివృద్ధిని రాష్ట్రం మొత్తానికి లెక్కకట్టేందుకు ప్రయత్నించారు. ఇదంతా నిజం కాదని తెలిసినా విపక్షం మౌనంగా ఉంది. ఆ దిశగా చూస్తే కోదండరామ్ పార్టీతో పాటు బీఎస్పీ, కమ్యూనిస్టులే నయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…