రెడ్డి కాంగ్రెస్

By KTV Telugu On 19 April, 2024
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీకి గెలుపు నెత్తికెక్కింది. అధికారం అందిందని  ఒక్క వర్గమే అంతా అనుభవించాలన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  మొత్తం ఒక కులం గుప్పిట్లోకి కాంగ్రెస్ చేరిపోతోంది. దానికి లోక్‌సభ టిక్కెట్లే పెద్ద ఉాదహరణ.  మొత్తం సీట్లలో బీసీలకు ఒకటి రెండు పడేసి మిగతా మొత్తం రెడ్లకు ప్రకటించారు. రిజర్వుడు సీట్లలోనూ  ఒక వర్గానికి పూర్తి స్థాయిలో అన్యాయం చేశారు.  ఇప్పుడు ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలకం. అందరికీ న్యాయం చేసినట్లు ఉండాలి. అలా కాదు ఒక్క వర్గానికే టిక్కెట్లు ఇస్తామంటే  మిగతా అందరూ వ్యతిరేకమవుతారు. ఇప్పుడుకాంగ్రెస్ పూర్తిగా ఒక్క వర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది.  తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇందులో మూడు ఎస్సీ రిజర్వుడు, రెండు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. మిగతా పన్నెండు జనరల్ నియోజకవర్గాలు. ఈ పన్నెండింటిలో ఒకటి హైదరాబాద్. దాన్ని పక్కన పెడితే పదొకండు. ఈ పదకొండు నియోజకవర్గాల్లో ఏడు చోట్ల రెడ్డి అభ్యర్థులకు చాన్సిచ్చారు.

ఇప్పటి వరకూ జనరల్ నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థుల్లో మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, భువననగిరి నుంచి సామ కిరణ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డికి టిక్కెట్లు ప్రకటించారు. ఇంకా  మూడు స్థానాలు పెండిగ్ లో ఉన్నాయి. అంటే పన్నెండు స్థానాల్లో మూడు మాత్రమే ఇతురలకు ఇచ్చి ఆరింటిలో రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులను పెట్టారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మెదక్ నుంచి నీలం మధు, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ మాత్రమే ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు. పెండింగ్ లో ఉన్న మూడు స్థానాల్లో ఖమ్మం స్థానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌కు వెలమ వర్గ అభ్యర్థి.. హైదరాబాద్ సీటుకు ముస్లిం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. అంటే జనరల్ కోటా పన్నెండు సీట్లలో ఏడు రెడ్డి వర్గానికి మూడు బీసీలకు కేటాయిస్తున్నారు. ఒకటి వెలమ, ఒకటి ముస్లింలకు కేటాయిస్తున్నారు.

బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వర్గాలకు న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఖమ్మం నియోజకవర్గం సంప్రదాయంగా కమ్మ సామాజికవర్గానికి కేటాయిస్తారు. అయితే ఈ సారి అక్కడ రెడ్డి వర్గానికి ఇస్తున్నారు.  గత ఎన్నికల్లో  ఆ సామాజికర్గం కూడా కాంగ్రెస్ అండగా నిలబడింది. మరో వైపు బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆ వర్గం అంతా ఆయనకు పని చేస్తే.. ఖమ్మంలో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఎస్సీ రిజర్వుడు స్థానాల్లోనూ అదే పరిస్థితి.  మూడు స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఈ మూడింటిలోనూ రెండు మాల వర్గానికి ఒకటి బైండ్ల వర్గానికి కేటాయించారు. మాదిగలకు ఒక్క సీటు కేటాయించలేదని కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.   వరంగల్‌ను కడియం కావ్యను ఖరారు చేశారు. ఆమె తండ్రి కడియం శ్రీహరి మాదిగ ఉపకులం అయిన బైండ్ల వర్గానికి చెందిన వారు. కావ్య ఓ ముస్లింను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె మాదిగవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారని ఆ వర్గం వారు కూడా అనుకోవడం లేదు. ఫలితంగా మాదిగ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది.  ఓట్ల శాతంలో అధికంగా ఉన్నా, జనాభా ప్రాతిపదికగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించక పోవడంతో కాంగ్రెస్ పార్టీలోని మాదిగ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు    మాదిగలకు జరిగిన అన్యాయంతో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఎస్పీ పార్టీలో చేరి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.  మోత్కుపల్లి నరసింహులు గురువారం దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇతర పార్టీలు సామాజిక సమతూకం పాటించే విషయంలో ఒక్కో వర్గానికి కాస్త ప్రాధాన్యమిచ్చినా ఇతర వర్గాలను పూర్తిగా దూరం పెట్టలేదు. కానీ కాంగ్రెస్ లెక్క మాత్రం తప్పింది. దీని ఫలితం ఎలా ఉంటుందో లోక్ సభ ఎన్నికల ఫలితాల ద్వారా తేలే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి