రేవంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసిన సీనియర్లు !

By KTV Telugu On 19 December, 2022
image

టీ. పీసీసీ కమిటీల నియమాకంపై అలిగిన కాంగ్రెస్  సీనియర్ల తొమ్మిది మంది రేవంత్ ను పదవి నుంచి లేపేద్దామనుకుంటే పార్టీలో వారి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఆ తొమ్మిది మంది సీనియర్లు ఇంతకాలం పదవులను అనుభవించి ఇప్పుడు మాత్రం రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న వాదన కొద్ది గంటల్లోనే వ్యాపించడంతో వారికి దిక్కుతోచడం లేదు. అధికార బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు సహకరించాల్సిన తరుణంలో సీనియర్లు తప్పటడుగులు వేసి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చారని అధిష్టానం భావిస్తోంది. సీనియర్లను దెబ్బకొట్టేందుకే వ్యూహాత్మకంగా తొమ్మిది మందితో రాజీనామా చేయించినా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు వచ్చేందుకు వారికి మొహం చెల్లలేదు.చాలా లేటుగా పార్టీలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పాలిటిక్స్ ను  బాగా అర్థం చేసుకున్న రేవంత్ వారి ఆటకట్టించారని  చెబుతున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నేతల తీరుపై టీ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారు. రేవంత్ రాకముందు పీసీసీ అధ్యక్షుడిగా అధికారం అనుభవించిన ఉత్తమ్ ఇష్టానుసారం  వ్యవహరించారని అప్పట్లో టీడీపీకి సన్నిహితంగా ఉంటూ సొంత పార్టీని దెబ్బకొట్టారని వారు ఆరోపణసు సంధిస్తుంటే సీనియర్లు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా ఉపందుకుంది. పైగా వారు మీటింగులు పెట్టుకుంటున్న తరుణంలోనే రెబెల్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించడం కూడా అనుమానాలకు దారితీసింది. బీజేపీ సందేశాన్ని కోమటిరెడ్డి వారికి వినిపించారన్న  ప్రచారం జరుగుతోంది.

నిజానికి రేవంత్  పాదయాత్ర చేస్తే తర్వాతి కాలంలో ఆయన పార్టీలో పవర్ ఫుల్ లీడర్ అవుతారని సీనియర్లు భయపడ్డారు. దాన్ని అడ్డుకునేందుకు కమిటీల ప్రస్తావన తెస్తూ అలిగినట్లు నాటకమాడారు. పైగా ముందే ఆయనపై చేసిన ఫిర్యాదులు తోడై అధిష్టానం రేవంత్ పవర్ ను కట్ చేస్తుందనుకున్నారు. వీలైతే  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ను తొలగించి గిడుగు రుద్రరాజును నియమించినట్లుగా తెలంగాణలో కూడా మార్పులు ఉంటాయని ఎదురుచూశారు. తమలో ఒకరికి పీసీసీ పీఠం దక్కుతుందనుకున్నారు. తీరా చూస్తే సీన్ సితారైంది. సీనియర్లను అధిష్టానం ఒక తన్ను తన్నింది. రేవంత్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సంగతిని ఆదివారం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగు తర్వాత రేవంత్ స్వయంగా మీడియాకు వివరించారు. త్వరలోనే పాదయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే జనవరి 26న ఇంద్రవెల్లిలో పాదయాత్ర ప్రారంభమై ఐదు నెలల పాటు సాగుతుందని ఖమ్మంలో ముగుస్తుందని రేవంత్ సన్నిహితులు లీకులు ఇస్తున్నారు.  తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సక్సెస్ కావడంతో రేవంత్ జోష్ మీదున్నారు. తనకు రాహుల్ ఆశీస్సులు కూడా ఉన్నాయని రేవంత్ చెప్పుకోవడంతో సీనియర్లకు పుండు మీద కారం చల్లినట్లైంది. పైగా రేవంత్ పాదయాత్రకు ప్రియాంకాగాంధీ కూడా వస్తారని వార్తలు రావడంతో సీనియర్లు అయోమయస్థితిలోకి నెట్టబడ్డారు.

జాతీయ స్థాయిలో జీ – 23 నేతలు తిరుగుబాటు చేశారు. వారిని సోనియా పెద్దగా పట్టించుకోలేదు. అందులో కశ్మీర్ నేత గులాంనబీ ఆజాద్ సొంత పార్టీ కూడా పెట్టారు. ఇప్పుడాయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు తెలంగాణలో జీ-9 నేతల పరిస్థితి కూడా అంతే అవుతుందని చెబుతున్నారు. మౌనంగా వచ్చి పార్టీ స్రవంతిలో కలవకపోతే పుట్టగతులుండవని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరాలనుకున్నా వారందరినీ ఒకే సారి చేర్చుకునే అవకాశాలు లేవు. పైగా బీజేపీలోకి వెళితే బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నేతల కింద పనిచేయాలి. అక్కడకు వెళ్లిన తర్వాత వారిద్దరూ చెప్పినట్లుగా వినడం మినహా సాధించేదేమీ లేదు. దానితో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు చేసిన తిరుగుబాటు వారి మనుగడకే ముప్పు తెచ్చింది. పైగా రేవంత్ నాయకత్వాన్నీ వారే బలోపేతం చేసినట్లైంది. ఎందుకంటే పార్టీలోనే చాపకింద నీరులా అసమ్మతి రాజకీయాలు చేసి ఉంటే రేవంత్ భయపడేవారు. ఇప్పుడు సీనియర్ల తీరును అధిష్టానం పట్టించుకోకపోవడంతో రేవంత్ నాయకత్వానికి ఏఐసీసీ మద్దతిచ్చినట్లయ్యింది. సీనియర్లను పక్కనపెట్టాలని చెప్పకనే చెప్పినట్లయ్యింది. అదీ రేవంత్ కు కూడా సంతోషమే కదా.