లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లపై కాంగ్రెస్ ధీమా

By KTV Telugu On 19 May, 2024
image

KTV TELUGU :-

లోక్ సభ ఎన్నికల పోలింగ్‌పై తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్‌మార్టం పూర్తయింది. మెజారిటీ స్థానాల్లో గెలుస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ..నేతల్లో పైకి తెలియని కంగారు కనిపిస్తోంది. ఇంతకీ టీ కాంగ్రెస్ పోస్ట్‌మార్టంలో ఏం తేలింది. కాంగ్రెస్ ఏయే స్థానాలు గెలుస్తామనుకుంటోంది? నాయకుల్లో కంగారుకు కారణం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పోలింగ్‌ ఘట్టం ముగిసింది. మెజారిటీ సీట్లు సాధిస్తామని మూడు ప్రధాన పార్టీలు చెబుతున్నాయి. కాని పైకి ఎంతో ధీమాగా కనిపిస్తున్నా..ఆయా పార్టీల నేతల్లో లోలోన కంగారు కనిపిస్తోంది. పైకి చెబుతున్నన్ని సీట్లు తమకు వస్తాయా అనే అనుమానాలు తొంగి చూస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు పోలింగ్‌ సరళిపై పోస్ట్‌మార్టం పూర్తి చేశారు.

అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సవివరంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అధికారం తెచ్చుకున్న తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ హవా కొనసాగిందని..అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నాలుగు నుంచి ఐదు శాతం ఓటింగ్‌ కచ్చితంగా పెరుగుతుందని నాయకులు అంచనా వేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాహుల్ గాంధీ ఇమేజ్ తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ముస్లిం మైనారిటీలు నూరు శాతం కాంగ్రెస్ కే మద్దతు పలికారని.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉన్నందున ఈ ఓట్లన్నీ తమ ఖాతాలోనే పడుతాయని హస్తం పార్టీ గట్టిగా నమ్ముతోంది. 17 పార్లమెంట్ స్థానాల్లో 13 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని పీసీసీ పెద్దలు భావిస్తున్నారు. మిగిలిన నాలుగు స్థానాలైన ఆదిలాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి సీట్లలో గట్టి పోటీ ఇచ్చినా ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని పీసీసీ నేతలు చెప్తున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ బాగా వీక్ అయిపోయిందని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. గులాబీ పార్టీ బలహీనపడటంతో..బీజేపీ బలం పుంజుకున్నా..ఎంపీ సీట్లు గెలిచేంతగా పెరగలేదని అంటున్నారు. బీఆర్ఎస్ బలహీన పడడంతో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి బదిలీ అయిందని, ఈ రెండు పార్టీలు ఓట్లు చీల్చుకోవడం వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఏది ఏమైనా కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ సీట్లు రావడం పక్కా అని..అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ కే మెజారిటీ స్థానాలు అని రిపోర్ట్ ఇస్తున్నాయని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే పెరిగిన ఓటింగ్ శాతంతో పాటు షిఫ్ట్ అయిన బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి అనుకూలంగా మారిందని, దీనికి తోడు అయోధ్య అక్షింతలు తమకు నష్టం చేసాయని కాంగ్రెస్ పోస్ట్‌మార్టంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

కాషాయపార్టీకి గట్టి పోటీ ఇచ్చి..పోల్‌ మేనేజ్‌మెంట్‌ సమర్థవంతంగా చేయగలిగినప్పటికీ..యూత్, హిందూ ఓట్‌ బ్యాంక్‌లో మెజారిటీ ఓటర్లు కమలం గుర్తుకే ఓటేశారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ ఓట్‌ బ్యాంక్‌ వారికే పడిందా..ఇతర పార్టీలకు బదిలీ అయిందా అనే దాన్ని బట్టే తమకు వచ్చే స్థానాలు ఆధారపడి ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే మెజారిటీ సీట్లు వస్తాయని పైకి చెబుతున్నా..నాయకుల్లో ఆందోళన అయితే కనిపిస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి