ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాల్‌గా మారింది. రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండటం ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లను తలపిస్తోంది. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా ఏడుగురు ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు పార్టీ ముఖ్య నేతలు, అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ముగ్గురు మంత్రులు సైతం తమ కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తుండటం అధిష్టానికి తలనొప్పిగా మారింది.
తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం టికెట్ రేసులో భారీగా ఆశావహులు ఉండటంతో.. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. అటు అభ్యర్థుల లిస్టు చాంతాడంత ఉండటం… మరోవైపు నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చికెట్ చిక్కుముడి వీడటం లేదు.
ఖమ్మం లోక్‌సభ టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనయుడు యుగంధర్ పోటీ పడుతున్నారు. మరోవైపు.. వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ నేతలు జెట్టి కుసుమకుమార్, రాయల నాగేశ్వర్ రావు, వీ.హనుమంతరావు సైతం తమ ప్రయత్నాల్లో ఉన్నారు. టికెట్ కోసం ఎవరికి వారు కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. బీసీలకు పెద్ద పీట వేయాలంటోన్న విహెచ్ తనకు ఖమ్మం సీటు ఇవ్వాల్సిందే అంటున్నారు.
ఈ క్రమంలోనే మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మలతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ పలుమార్లు సమావేశమయ్యారు. అయినా ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ పంచాయితీ కాస్తా హస్తినకు చేరుకుంది. ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మాత్రం ముగ్గురు, నలుగురి పేర్లను మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డిలో ఎవరో ఒకరికి టికెట్ దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రెండ్రోజుల్లో అభ్యర్థిని ప్రకటించి అదే రోజు నుంచి ప్రచారం ప్రారంభించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరిని బరిలో దింపితే గెలుపు సునాయాసం అవుతుందనే అంశంపై పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవడంతోపాటు.. టికెట్ ఆశించిన మిగతా నేతలను బుజ్జగించడం కాంగ్రెస్‌కు పెద్ద టాస్కే అవుతుందంటున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం లోక్‌సభ టికెట్ కేటాయింపు కాంగ్రెస్‌కు పెద్ద సవాల్‌గా మారింది. అభ్యర్థి ప్రకటనకు ముందే ఖమ్మం కాంగ్రెస్‌లో ఇంత పొలిటికల్ హీట్ ఉంటే.. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా నడుస్తోంది.టికెట్ కోసం ఆశావహులు చాలా మంది ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరికే టికెట్ దక్కుతుంది కాబట్టి టికెట్ రాని వారంతా ఒక్కటై సొంత పార్టీ అభ్యర్ధినే ఓడించేందుకు ప్రయత్నించే ప్రమాదమూ లేకపోఎలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…