తెలంగాణా వేదికపై కాంగ్రెస్ విజయభేరి అదిరింది. ఎన్నికలు తరుముకు వస్తోన్న నేపథ్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్సే అని ధీమా వ్యక్తం చేసిన సోనియా గాంధీ తెలంగాణా ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటించారు. తెలంగాణాలో తాము కేవలం బి.ఆర్.ఎస్.తో మాత్రమే పోరాట్టం లేదన్నారు రాహుల్ గాంధీ. బిజెపి-మజ్లిస్ పార్టీలతోనూ పోరాడుతున్నామని ఆ మూడు పార్టీలూ ఒక్కటేనని ఆయన అన్నారు. తెలంగాణాలో అధికారంలోకి రావాలంటే ప్రతీ కార్యకర్తా విరామం లేకుండా పార్టీ కోసం శ్రమించి పనిచేయాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు నిచ్చారు.
తెలంగాణాలో రెండురోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించింది పార్టీ నాయకత్వం. దేశం నలుమూలల నుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణా ఎన్నికలతో పాటు రాజస్థాన్,మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న అభివృద్ది, సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్చే అన్నారు. దానికి హిమాచల ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో పార్టీ ఘన విజయాలే నిదర్శనమన్నారు ఖర్గే.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల అనంతరం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన విజయభేరి సభలో పాల్గొన్నారు నేతలంతా. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ తెలంగాణా ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఎకరానికి ఏటా 15 వేల చొప్పున ఇస్తామన్నారు. అదే కౌలు రైతులకు 12 వేల చొప్పున ఇస్తామన్నారు. వరికి గిట్టుబాటు ధరతో పాటు మరో 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు.మహిళా శక్తి పథకం కింద మహిళలకు నెల నెలా 2,500 రూపాయలు అందిస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. గ్యాస్ సిలెండర్ ను 500 రూపాయలకే అందిస్తామని భరోసా ఇచ్చారు.
కర్నాటక ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైన హామీలను తెలంగాణాలోనూ అమలు చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఆ పథకాలను ప్రకటించగానే ప్రజల నుండి మంచి స్పందన లభించింది. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్న సోనియా గాంధీ తెలంగాణా ప్రజలు ఈ సారి కాంగ్రెస్ కే పట్టం కడతారన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణా ప్రజలకోసం తాము ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీయార్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా తొమ్మిదేళ్ల పాలన సాగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సోనియా గాంధీ భరోసా ఇచ్చారు.
మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బి.ఆర్.ఎస్, బిజెపి., మజ్లిస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలూ పైకి వేర్వేరుగా కనిపిస్తాయి కానీ వాస్తవానికి అవి మూడూ ఒక్కటే అన్నారు రాహుల్ గాంధీ. బి.ఆర్.ఎస్, మజ్లిస్ పార్టీలు బిజెపికి బీ టీమ్స్ అన్నారాయన. సోనియా గాంధీ ప్రజలకు ఒక మాట ఇస్తే దాన్ని కచ్చితంగా నెరవేరుస్తారని రాహుల్ అన్నారు. తెలంగాణా ఇస్తానన్న సోనియా ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఇపుడు ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలోనూ సోనియా మాట ఇచ్చిన ప్రకారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ప్రజల జీవితాలు మెరుగయ్యేలా నిర్ణయాలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
విజయభేరి సభతో తెలంగాణా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. కాంగ్రెస్ వైపు చూస్తోన్న ఇతర పార్టీల నేతల్లోనూ ఒక విధమైన ధైర్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరితే విజయం ఖాయమన్న నమ్మకం కలిగిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే పార్టీలో భిన్న ధృవాలుగా ఉన్న నేతలంతా కలసి కట్టుగా పనిచేస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు.ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని.. ఆ విజయాన్ని అందుకోడానికి నేతలు కూడా సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…