తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారో.. భారత రాష్ట్ర సమితిని బలహీనం చేయాలనుకుంటున్నారో కానీ పీసీసీ చీఫ్ కమ్ సీఎం రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వెళ్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు సైలెంట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇది కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. ఇది ఏ స్థాయికి వెళ్తుందో అంచనా వేయడం కష్టంగా మారింది. పాలనలోనూ ఆయన దూకుడు కాంగ్రెస్ కు నష్టం చేస్తోంది.
టీ పీసీసీ చీఫ్, సీఎంగా రెండు రోల్స్ పోషిస్తున్న రేవంత్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతోంది. రెండు రోల్స్ లోనూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఏ పార్టీ అయినా, లేదా పొలిటికల్ లీడర్ అయినా దూకుడుగా ప్రభుత్వం మీదకి వెళ్లడం వల్లే ప్రజల్లో ఓ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. కాని అధికారం పక్షంలో ఉన్న వారికి మాత్రం చట్టం, నిబంధనలు, ప్రజల మూడ్ వంటివి ఆ దూకుడుకు ప్రతిబంధకాలు. ఆచి తూచి నిర్లయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అధికారంలో ఉన్న వారిది. అయితే ప్రతిపక్షంలో చేసినట్లే ఇప్పుడు పాలనాపరంగాను, రాజకీయంగాను చేస్తే మాత్రం ఎదురు దెబ్బలు తప్పవు. ప్రతిపక్షంలో ఉన్న దూకుడు స్వభావమే ఇప్పుడు రేవంత్ చూపిస్తూండటంతో ప్రభుత్వానికి, పార్టీకి కూడా సమస్యలు వస్తున్నాయి.
పార్టీలో చేరికలు కాంగ్రెస్ సమస్యగా మారాయి. ఇప్పటి వరకూ తాము ఎవరిపై పోరాడామో వారిని తీసుకొచ్చి రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ నేతలుగా మార్చేస్తే.. తామేం చేయాలని ఆయా నియోజకవర్గాల క్యాడర్లు మథనపడుతున్నారు. పదేళ్లుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పోరాడానని తనకు తెలియకుండా ఆయనను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని తాటిపర్తి జీవన్ రెడ్డి ఫీలయ్యారు. నిజానికి ఆయన లాంటి సీనియర్ ఉన్న నియోజకవర్గంలో ఎవరినైనా చేర్చుకునేటప్పుడు రాష్ట్ర పార్టీ నాయకత్వం ముందుగా ఆయనకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆయనకు కనీస సమాచారం లేకుండా.. మీడియాలో వచ్చిన తర్వాతే ఆయన తెలుసుకోవాల్సి వచ్చింది. సహజంగానే ఇది ఆయనను అవమానించినట్లు అవుతుంది. నిజానికి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతు దారు. పీసీసీ చీఫ్ ఎంపిక సమయంలో సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధి బృందానికి చాలా మంది రేవంత్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా జీవన్ రెడ్డి మత్రం మద్దతుగా మాట్లాడారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇస్తే పార్టీ బలపడుతుందని చెప్పారు. తన సీనియార్టీని గుర్తించి ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుకున్నారు. ఎంపీగా పోటీ చేయమన్నా చేశారు. అయితే ఇప్పుడు హటాత్తుగా ఆయనకే ఎర్త్ పెట్టారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పలువురు బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేవారంతా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నించిన వారే. ఇప్పుడు వారిని చేర్చుకుని కాంగ్రె్స గెలుపు కోసం పని చేసిన వారిని తక్కువ చేయడం ఎందుకన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం దూకుడుగా ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తు్న్నారు. పాలనా పరంగా కూడా రేవంత్ రెడ్డి సమస్యలు సృష్టించుకుంటున్నారు. కాంగ్రెస్ కు యఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేపట్టాలని రేవంత్ రెడ్డి తీసుకున్న దూకుడు నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ వంటివి తొలగించేందుకు ప్రయత్నించారు. ప్రజల్లో భావోద్వేగం బయపడింది. దీంతో సర్దుకున్న సీఎం రేవంత్ రెడ్డి దీనిపై శాసన సభలో అన్ని పార్టీలతో చర్చించి ఓ నిర్ణయానకి వస్తానని చెప్పి రాష్ట్ర చిహ్నం మార్పును పక్కన పెట్టారు
రేవంత్ దూకుడు నిర్ణయాలు టీ కప్పులో తుపానుగా కనిపిస్తున్నా రానున్న రోజుల్లో ప్రభావం ఎక్కువగానే కనిపించనుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ లోచాలా మంది సీఎం సీటు ఆశించిన వారే. ఈ తరహా దూకుడు అలాంటి కొంత మంది అసంతృప్త నేతలకు అస్త్రంగా మారే ప్రమాదం లేకపోలేదు. సీఎం సీటుకు తనతో పాటు పోటీ పడిన నేతలతో పోల్చితే.. రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించారనడంలో సందేహం లేదు. ఇప్పుడు అదే దూకుడు తనకు మేలు చేస్తుందా.. లేదా రాజకీయంగా కీడు చేసే అవకాశం కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డిల తాను జాతీయ పార్టీలో ఉన్నానని గుర్తించలేకపోతున్నారు. పార్టీకి నష్టం జరుగుతుందంటే హైకమాండ్ వెంటనే.. ఆయన పవర్స్ కట్ చేస్తుంది. అదే జరిగితే ఆయన ప్రత్యర్థులు బలం పుంజుకుంటారు. దీనికి కారణం స్వయం కృతమే అవుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…