వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధర్మపురి శ్రీనివాస్ ను కలిపి సూపర్ హిట్ కాంబినేషన్ అనేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేతి నుంచి 2004లో అధికారాన్ని లాగేసుకోవడం వెనుక వారిద్దరి కృషి మాత్రమే ఉందని అనేవారు. రాజన్న, శీనన్న కలిసి అద్భుతాలు సృష్టించారనే వారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ నేత డీ. శ్రీనివాస్ కు తిరుగులేదనే వారు. ఇప్పుడు మాత్రం మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ నేతలే ఆయనకు మోకాలడ్డుతున్నట్లు చెబుతున్నారు.
వాస్తవానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా కంచుకోట. కానీ ఇప్పుడు ఆ పార్టీ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఉన్న నేతల మధ్య కనీస సమన్వయం కరువైంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేసే దిశగా అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఆ క్రమంలోనే డీఎస్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చే బాధ్యతను ముఖ్య నేతలు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డికి అప్పగించింది. ఇటీవలే ఆ ఇద్దరు నేతలు హైదరాబాద్‌లోని డీఎస్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయినా డిఎస్ తిరిగి సొంత గూటికి వెళ్లాలనే ఆలోచన కార్యరూపం దాల్చడంలేదు. కాంగ్రెస్‌లో చేరే వ్యవహారం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ తహతహ లాడుతోంది.
డీఎస్ ఎంట్రీకి సోనియాగాంధీ గతంలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అప్పట్లోనే డీఎస్ ఢిల్లీలో అరగంట పాటు సోనియాతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ను వీడడానికి దారి తీసిన పరిస్థితులను ఆమెకు వివరించారు. దీంతో సానుకూలత చూపిన సోనియా ఆయన్ను పార్టీలోకి తెచ్చే కార్యం కేసీ వేణుగోపాల్‌కు అప్పగించారు. మరుసటి రోజే ఆయన ఢిల్లీలో డీఎస్‌తో భేటీ అయ్యారు. తనయుడు సంజయ్‌తోపాటు తెలంగాణ సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతానని స్పష్టం చేశారు. ఆ మేరకు పలువురు సీనియర్లతోనూ డీఎస్ చర్చించారు. ఢిల్లీలోనే ఎంట్రీ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు. కానీ సడెన్‌గా వాయిదా పడిపోయింది.
డీఎస్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్న సమయంలోనే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అయిన ఆయన కుమారుడు అర్వింద్‌ను కేంద్ర క్యాబినెట్లో తీసుకుంటారంటూ ప్రచారం మొదలయింది. దాంతో కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా అర్వింద్ డీఎస్‌ను ఒత్తిడి చేశారనే ప్రచారం జరిగింది. మరో పక్క డీఎస్ ఎంట్రీపై కాంగ్రెస్‌లోనే వ్యతిరేకత వ్యక్తమైంది. కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్లిన డీఎస్‌ను మళ్ళీ పార్టీలోకి తీసుకోవద్దంటూ నిజామాబాద్ జిల్లా నేతలు మధుయాష్కీ మహేష్‌గౌడ్ లాంటి వారు ఢిల్లీ పెద్దలతో మొరపెట్టుకున్నారు. అనేక లిఖిత పూర్వక ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఫలితంగా అధిష్టానం పునరాలోచనలో పడింది. ఆ లోపు డీఎస్ అనారోగ్యానికి గురికావడంతో కాంగ్రెస్ ఎంట్రీకి గ్యాప్ వచ్చింది.
వాస్తవానికి సోనియాగాంధీతో భేటీ తరవాత వెంటనే జాయిన్ అయ్యుంటే కాంగ్రెస్ నేతలెవరరూ నోరు మెదిపేవారు కాదు. కానీ కొద్దిరోజులు గ్యాప్ రావడంతో అనేక పరిణామాలు డీఎస్ ఎంట్రీకి ఆటంకం కల్గించాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలవ్వడంతో మరోసారి డీఎస్ ఎంట్రీ తెరమీదకి వచ్చింది. ఈ సారి జిల్లాకు చెందిన మరో అగ్రనేత సుదర్శన్‌రెడ్డి సైతం డీఎస్ ఎంట్రీకి ఆసక్తి చూపడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు కొత్తగా డీఎస్ కాంగ్రెస్‌లోకి వెళ్లే విషయంలో తనయుడు సంజయ్ ఒత్తిడి కూడా తోడవుతుంది. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్ సీనియారిటీ ఆయన రాజకీయ వ్యూహరచనలు పార్టీకి అనుకూలిస్తాయనేది రేవంత్ ఆలోచన. కానీ పార్టీలో చేరే విషయంలో డీఎస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.