చిన్న పిల్లల నీతి కథల్లో ఓ అరబ్, ఓ ఒంటె గురించిన స్టోరీ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. టెంటులో ఉండే అరబ్ .. బయట చలికి వణుకుతోందని.. తలను మాత్రమే తన టెంటులో పెట్టుకునే చాన్సిస్తాడు. దానికే అరబ్బును దేవుడిగా పొగిడే ఒంటే.. మెల్లగా.. ఆయనను బయటకు గెంటేసి తానే టెంటులో సర్దుకుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. టెంట్ మొత్తాన్ని రేవంత్ రెడ్డి ఆక్రమించుకుంటూంటే… సీనియర్లు మాత్రం గజ గజ వణికిపోతూ బయట నిల్చుంటున్నారు. మూడు నెలల్లోనే వారికి రేవంత్ విశ్వరూపం చూపిస్తున్నారు.
ముఖ్యమంత్రిని నేనే కానీ భట్టి అన్న దగ్గరే చెక్ పవర్ ఉంటుందని .. ఆదిలాబాద్ కు వెళ్లినప్పుడు బహిరంగసభా వేదిక మీద రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఆయన తన కంటే పవర్ ఫుల్ అన్నట్లుగా గౌరవం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన భట్టి విక్రమార్కకు… ఆ స్థాయి గౌరవం మొదటి నుంచి లభించింది. పత్రికల్లో .. కూడా రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క ఫోటో కనిపించేది. ప్రతీ కార్యక్రమంలోనూ భట్టి విక్రమార్క కనిపించేవారు. అయితే ఈ ప్రాధాన్యత రెండున్నర నెలలే. ఇప్పుడు భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన పెద్దగా కనిపించడం లేదు. అంతకు మించి ప్రభుత్వ పరమైన ప్రకటనల్లోనూ ఆయన ఫోటో కనిపించడం మానేసింది. దీంతో కాంగ్రెస్‌లోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పది సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ భట్టి విక్రమార్క సహా.. ఇతర నేతలు ఆ పార్టీలోనే పుట్టి పెరిగారు.. వారికి మరో పార్టీ తెలియదు.కానీ రేవంత్ కే సీఎం చాన్స్ లభించింది. ఆయన మాస్ లీడర్ అన్న అభిప్రాయం.. హైకమాండ్ ను గట్టిగా నమ్మించడంతో ఈ అవకాశం వచ్చింది. పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారికి అవకాశం కల్పించాలని సీనియర్లు కూడా పోటీ పడ్డారు. కారణం ఏదైనా హైకమాండ్ రేవంత్ రెడ్డికి చాన్స్ ఇచ్చింది. అందరూ సైలెంట్ అయిపోయి ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సీనియర్ల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు రేవంత్ రెడ్డి రాజకీయం ప్రారంభించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి సారి సీఎం అయినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది సీనియర్లు ఉండేవారు. వారందర్నీ క్రమంగా నిర్వీర్యం చేసి.. తన పదవికి ఎవరూ అడ్డు రాకుండా చేసుకున్నారు. ఎంతటి సీనియర్లకు అయినా ఆయన అదే గతి పట్టించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్ లో ఉన్నట్లుగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్లు ఆనుమానిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో రేవంత్ జై ఉత్తమ్ కుమార్ అని నివాదాలు చేశారు. కానీ ఇప్పుడు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వంలో కనీస ప్రాధాన్యత దక్కుతుందన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కీలకమైన ఇరిగేషన్ శాఖ ఇచ్చినా ఉత్తమ్ పాత్ర నామ మాత్రంగా కనిపిస్తోది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. రేవంత్ తో విబేధిస్తే ఉన్న పదవి తీసేసినా ఆశ్చర్యపోేవారు ఉండరని.. వీలైనంత పొలైట్ గా ఉంటున్నారు. తన పనులు తాను చేసుకుని వెళ్లిపోయేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రతీ జిల్లాలోనూ ఇప్పుడు తన వర్గాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీలోని ఇతర సీనియర్లను లెక్కలోకి తీసుకోవడం లేదు. లోక్‌సభ ఎంపీ సీట్ల విషయంలోనూ ఆయన ఏకపక్షంగా వెళ్తున్నారు. సీనియర్ల అభిప్రాయాలను తీసుకోవడం లేదు. అభ్యర్థులు ఎవరన్నదానిపై హైకమాండ్ తకు పూర్తి స్వేచ్చనిచ్చిందని చెప్పుకుంటున్న ఆయన… మహబూబ్ నగర్ సీటుకు వంశీచంద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇతర చోట్లకు వలస వచ్చిన నేతల్ని ఖరారు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు హైకమాండ్ వద్దకు వెళ్లి చెప్పుకునేందుకు కూడా సీనియర్లు చాన్స్ లేకుండా చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందరూ కలిసి.. తిరుగుబాటు చేసే వరకూ రేవంత్ ఇలానే చేస్తారన్న ఆగ్రహం.. సీనియర్ నేతల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…