బి.ఆర్.ఎస్.తో పొత్తుకు కామ్రేడ్ల తహ తహ

By KTV Telugu On 16 February, 2023
image

చాలా కాలంగా చట్ట సభలో సరియైన ప్రాతినిథ్యం లేకుండా చాలా బోరుగా ఫీలవుతోన్న కామ్రేడ్లు ఎన్నికలు తరుముకు వస్తోన్న తెలంగాణాలో అప్రమత్తం అయిపోయారు. పాలక పక్షమైన బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకుని కాసిని సీట్లు సంపాదించి పూర్వ వైభవం పొందాలని కామ్రేడ్లు చాలా కసిగా ఉన్నారు. అయితే ఉమ్మడి ఏపీలో కమ్యూనిస్టు పార్టీలకున్న ప్రాభవం ఇపుడు అంతగా లేదు కాబట్టి వారిని శాసన మండలికి పంపిస్తే సరిపోతుందని బి.ఆర్.ఎస్. అధినేత భావిస్తున్నారట. తెలంగాణాలో ఎన్నికల వాతావరణం వేడెక్కి చాలా కాలమైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేసి అందుకు అనుగుణంగా రాజకీయాలు చేసేస్తున్నాయి కూడా. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని కేసీయార్ నాయకత్వంలోని బి.ఆర్.ఎస్. పట్టుదలగా ఉంది.

తెలంగాణా ఇచ్చిన పార్టీగా ఈ సారి అయినా తెలంగాణాలో అధికారంలోకి వచ్చి బోణీ కొట్టాలని కాంగ్రెస్ పంతంగా ఉంది.
కాంగ్రెస్, బి.ఆర్.ఎస్.లకు ఝలక్ ఇచ్చి తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.
ఎవరి ఆశలు వారివి. ఎవరి లెక్కలు ఎవరి అంచనాలు వారివి. ఈ క్రమంలో ఈ సారి ఎన్నికల్లో పాలక పక్షమైన భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్, టిడిపిలతో కలిసి మహాకూటమిగా అవతరించాయి. అయితే ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు చెప్పుకోదగ్గ విజయాలేవీ దక్కలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో అయినా తెలంగాణాలో పరువు దక్కించుకోవాలని కామ్రేడ్లు ఆశపడుతున్నారు.

ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికలో బి.ఆర్.ఎస్. కు మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులు వచ్చే ఎన్నికల్లో అదే బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. అయితే పొత్తులో భాగంగా చెరో పదిహేను స్థానాలు కూటాయించాలని సీపీఐ, సీపీఎంలు అడగాలని నిశ్చయించినట్లు సమాచారం. ఇటు బి.ఆర్.ఎస్. నేతల సమావేశంలో గులాబీ నేతలు కమ్యూనిస్టులు కొన్ని సీట్లు ఆశిస్తున్నారని కేసీయార్ కు చెప్పారట. దానికి కేసీయార్ స్పందిస్తూ మారిన రాజకీయ సమీకరణల్లో కమ్యూనిస్టు పార్టీలు అసెంబ్లీ బరిలో పోటీ చేయడం కష్టమే అన్నారట. వారికి శాసన మండలిలోనే కొన్ని స్థానాలు కల్పిద్దాం అని కేసీయార్ ముక్తాయించినట్లు తెలుస్తోంది. అయితే తమకు సీట్లు కేటాయిస్తేనే పొత్తులు పెట్టుకుంటామని కమ్యూనిస్టులు ఖరాకండీగా ఉన్నారని అంటున్నారు. ఒక వేళ బి.ఆర్.ఎస్. తమకి అసెంబ్లీ స్థానాలు కేటాయించకపోతే కాంగ్రెస్ తో పొత్తుకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని రెండు కమ్యూనిస్టు పార్టీలూ భావిస్తున్నాయట.

కాంగ్రెస్ సరేనంటే బి.ఆర్.ఎస్. కు ప్రతిపాదించినట్లే చెరో పదిహేను స్థానాలు అడగాలని అవి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కమ్యూనిస్టు పార్టీలకు అన్నేసి స్థానాలు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉండకపోవచ్చునని వార్తలు వినపడుతున్నాయి. ఉమ్మడి ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు గరిష్టంగా 34 స్థానాల్లో గెలిచాయి. అపుడు ఎన్టీయార్ ప్రభంజనంలో టిడిపితో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టు పార్టీలు 37 స్థానాల్లో పోటీ చేసి కేవలం మూడు చోట్లే ఓటమి చెందాయి. రాష్ట్ర శాసన సభలో ఉభయ కమ్యూనిస్టుల చివరి ఘన వైభవం అదే. ఆ తర్వాత 1999లో రెండు పార్టీలూ కలిసి ఆరు చోట్లే గెలిచాయి. 2004 ఎన్నికల్లో సిపిఐ 12 చోట్ల పోటీ చేసి ఆరు చోట్ల గెలిచింది. సీపీఎం 14 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలు సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు వై.ఎస్.ఆర్. ప్రభంజనంలోని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. 2009 ఎన్నికల్లో టి.ఆర్.ఎస్, టిడిపి, కమ్యూనిస్టులు కలిసి మహాకూటమి కట్టారు.

ఈ ఎన్నికల్లో సిపిఐ నాలుగు చోట్ల సిపిఎం ఒక్క చోట గెలిచాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం చెరో సీటుతో సరిపుచ్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే కమ్యూనిస్టులు అసలు బోణీ కొట్టలేకపోయారు. 2018లో తెలంగాణాకు జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. ఆ తర్వాత 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కామ్రేడ్లు అడ్రస్ గల్లంతు చేసుకున్నారు. అందుకే వచ్చే తెలంగాణా ఎన్నికల్లో ఎలాగోలాగ తమ సీట్లసంఖ్య పెంచుకోవాలని కమ్యూనిస్టులు పంతంగా ఉన్నారు. అయితే కమ్యూనిస్టులతో పొత్తులకు ఎవరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బి.ఆర్.ఎస్. పొత్తుకు సై అన్నా సీట్ల విషయంలో కేసీయార్ కు వేరే ఆలోచనలు ఉన్నాయంటున్నారు. అయితే మునుగోడు బంధాన్ని కొనసాగించాలని కేసీయార్ భావిస్తే మాత్రం కమ్యూనిస్టులు కోరినట్లు 15 స్థానాల చొప్పున కాకపోయినా ఎన్నో కొన్ని సీట్లు విదిల్చే అవకాశాలు ఉండచ్చంటున్నారు.