ఆ ఇద్దరు మంత్రులు డౌటేనా

By KTV Telugu On 25 May, 2023
image

వేసలి కాలం ముగిసిపోయింది. వచ్చేది ఎన్నికల కాలం. డిసెంబరు చలిలో ఎన్నికలు జరిగినా ఎన్నికల వేడి మాత్రం తారా స్థాయిలో ఉండటం ఖాయం. ఆ వేడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. కొందరు నేతలకు బాగా చురుకు ముడుతోంది. పార్టీలో పరిస్థితులు వారి జిల్లాలు నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలతో నేతలు పునరాలోచనలో పడుతున్నారు. ఒకరిద్దరు నేతలైతే వాళ్లు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు. ఢిల్లీలో ఉన్నారా గల్లీలో ఉన్నారా మధ్యలో హైదరాబాద్ లో తిరుగుతున్నారా అర్థం కాని పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఇంతకాలం ప్రచారమైన నేతలు కూడా ఇప్పుడు లూప్ లైన్లోకి వెళ్లిపోయే సీన్ కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అంతకు మించిన విశ్వాసపాత్రుడు. కెసిఆర్ అంతరంగికుల్లో ఒకరనే ముద్ర కూడా వుంది. ఈ అర్హతల వల్లే ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. సాక్షాత్తు సీఎం రివ్యూల్లో పక్కనే వుంటారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా మారారు. చివరికి ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు సైతం ఆయనే పర్యవేక్షణలోనే జరిగాయి.

ప్రశాంత్ రెడ్డి అందరు మంత్రుల్లా కాదు కెసిఆర్ ఆంతర్యం ఎరిగిన ఏకైక అంతరంగికుడు అని మిగతా నేతలు చెవులు కొరుక్కొంటారు. అలాంటి మంత్రి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం బాల్కొండ నియోజకవర్గానికే పరిమితం అయి పోయారు. ఉమ్మడి జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న ఆయన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అభివృద్ధి పనులు, పాలనా వ్యవహారాలను పర్యవేక్షించవలసి ఉంది. అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. క్రమం తప్పకుండ సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించాలి. విపత్తులు తలెత్తినప్పుడు స్వయంగా వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వాలి. కానీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాత్రం బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి, పాలన, సంక్షేమం, పార్టీ క్యాడర్ లాంటి విషయాల్లో మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. అప్పుడప్పుడు తన సొంత గ్రామమైన వేల్పూర్ కు మాత్రమే వెళ్తున్నారు. పక్క నియోజకవర్గమైన ఆర్మూర్ లోకి అడుగు పెట్టలేక పోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ కు చెందినవారే. అయినా ఎవ్వరూ మంత్రిని తమ నియోజకవర్గంలోకి ఆహ్వానించడం లేదు. వారు పిలవనిదే మంత్రి స్వతహాగా వెళ్లలేని పరిస్థితి వుంది. కోట్లాది రూపాయలతో జరుగుతున్న పనులకు సైతం మంత్రిని పిలవడం లేదు. ఆయనతో రిబ్బన్ కట్ చేయించడానికి ఆసక్తి చూపడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను కనీసం రివ్యూ కూడా చేయడంలేదు. నిజానికి జిల్లా మంత్రి ఇలాంటి రివ్యూలు చేయడానికే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా చాంబర్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ చాంబర్లలో ఇంత వరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఒకటి, రెండు సార్లకు మించి ఎంట్రీ ఇవ్వలేదు. ప్రగతి భవన్ కొటేరీలో కొందరు ఇప్పుడు ప్రశాంత్ రెడ్డిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పనులకు, రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇస్తే కేసీఆర్ దృష్టికి వెళ్లిపోతుందని భావిస్తూ సీఎంకు తెలియకుండా బిజినెస్ సాగాలంటే ప్రశాంత్ రెడ్డిని దూరం ఉంచాలని కొందరు సూచించారు. అలా చెప్పిన వాళ్లు పవర్ ఫుల్ నేతలు కావడంతో ప్రశాంత్ రెడ్డి కూడా సైడైపోయారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నాటికి కేసీఆర్ తనకు టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ప్రశాంత్ రెడ్డి పనిచేస్తున్నారు. కాకపోతే అప్పుడు జరగబోయేదేమిటో ఇప్పుడే చెప్పలేం కదా.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గంలో పరిస్థితి మరోలా ఉంది. బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి త్వరలో హస్తం గూటికి చేరుతారని బీజేపీ ప్రచారం చేస్తోంది అందుకు కారణాలు లేకపోలేదు. నియోజకవర్గంలో మంత్రిని వ్యతిరేకించే సీనియర్ నేత శ్రీహరి రావుకు బీఆర్ఎస్ టికెట్ ఖాయమైందని అధికార పార్టీ వర్గాలే ప్రచారం చేయడంతో బీజేపీకి ఉప్పందినట్లైంది.

కర్ణాటకలో గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు జరపాలని అనుకుంటోంది. సీనియర్ న్యాయవాది మల్లారెడ్డి తో పాటు బీ ఆర్ ఎస్ జెడ్పిటిసి రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుంది. మరింత మందిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంద్రకరణ్ కూడా బీఆర్ఎస్లో కొంత అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు దొరకలేదని ఆయన ఆందోళన చెందుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కష్టమని కాంగ్రెస్ కే విజయావకాశాలున్నాయని ప్రచారం ప్రారంభం కావడంతో ఆయన పునరాలోచనలో పడిపోయినట్లు చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీతో గతంలోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వాటిని వాడుకుంటూ రాణించడం కష్టమేమీ కాదని ఇంద్రకరణ్ అనుచురులు అంటున్నారు.