ఉచితాలకు డేంజర్ బెల్స్ – Danger Bells For Freebies – Congress

By KTV Telugu On 11 March, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యారెంటీలకు ఎక్సపైరీ డేట్ దగ్గర పడిందన్న అనుమానాలు వస్తున్నాయి. ఏదోక  టైమ్ లో గుట్టు చప్పుడు కాకుండా వాటిని ఆపేస్తారన్న చర్చ జరుగుతోంది. నిధులు లేక చేతులెత్తే పరిస్థితి రావచన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిధులను ఎలా మేనేజ్ చేస్తారో ప్రకటించకపోవడమే ఇందుకు కారణమని చెప్పక  తప్పదు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా  ఎగ్గొట్టిన బాపతే కాబట్టి తెలంగాణలో కూడా అదే జరుగుతుందని చెప్పుకునే పరిస్తితి వచ్చింది..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజల కోసం ఆరు  గ్యారెంటీలను ప్రకటించింది. ప్రజలు  తమను గెలిపించాలని తీర్మానించుకున్నట్లు, గెలిచిన వెంటనే  ఆరు గ్యారెంటీలను అమలు చేసి పేద, అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చబోతున్నట్లు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. పైగా ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో విశ్వాసం కలిగేందుకు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గేలను రాష్ట్రానికి రప్పించి వారితో చెప్పించారు. ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత వంద రోజుల్లో అమలు చేస్తామన్న వాటిలో నాలుగు ఇప్పటికే పట్టాలెక్కాయి. ఆరు గ్యారెంటీలు ఒక సారి చూస్తే మొదటి గ్యారెంటీ  మహాలక్ష్మి స్కీమ్ దాని కింద ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పంపిణీ  చేయాలి. రాష్ట్రమంతా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి. రెండో గ్యారెంటీ అయిన రైతు భరోసా కింద కౌలు రైతులతో కలిపి ఎకరానికి ఏటా 15 వేల పెట్టుబడి సాయం అందించాలి. వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలి. వరి పంటకు అదనంగా 500 రూపాయల బోనస్ అందించాలి. మూడో గ్యారెంటీ అయిన గృహజ్యోతి పథకం కింద ఇళ్లలో వాడే విద్యుత్ లో 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించాలి. అంటే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు కట్టాల్సిన పనిలేదు. ఇక నాలుగో గ్యారెంటీ కింద ఇందిరమ్మ ఇళ్లు ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలి. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అందించాలి. ఐదో గ్యారెంటీ అయిన యువవికాసం కింద రెండు అంశాలున్నాయి. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు 5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు , స్కిల్ డెవల‌ప్‌మెంట్‌ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సాయం.ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు చేయాలి.  ఇక ఆరో గ్యారెంటీ అయిన పింఛనుదారులకు నెలకు 4 వేల రూపాయలు పింఛను ఇస్తామన్నారు. ఆరోగ్య శ్రీ కింద బీమా సదుపాయాన్ని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల వరకు పెంచుతామన్నారు..

పేరుకు ఆరు  గ్యారెంటీలే అయినా  వాటికి కరెక్టుగా లెక్కేస్తే 13 హామీలు ఉంటాయి. వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన నీధులు సరిపోవన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్ని గ్యారెంటీలు అమలైతే ఏటాదికి కనిష్టంగా లక్ష కోట్లు కావాలని ఆర్థికరంగ  నిపుణులు చెబుతున్నారు. దానితో ఇప్పుడు  రేవంత్ ప్రభుత్వం కొంతైనా టైమ్ పాస్ చేసి, డైవర్షన్ తో మరి కొంత జాప్యం చేసే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….

ప్రస్తుతానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ, గ్యాస్ సిలెండర్ సబ్సిడీ, ఉచిత  కరెంట్ అమలుకు వచ్చాయి. మరో వారంలో వంద రోజుల పాలన దాటుతున్నందున వాయు వేగంతో ఒకటి రెండు అమలు చేస్తారేమో చూడాలి. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో గ్యారెంటీల అమలుకు 53 వేల 193 కోట్లు కేటాయించారు. అది కేటాయింపు మాత్రమే, అందులో మొత్తం ఖర్చు చేయాలని కూడా లేదు.. ఇక ఆరు గ్యారెంటీల్లోని 13 అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే లక్ష కోట్లు కావాలని, అంతకంటే ఎక్కువ ఖర్చయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అర్హులను ఎంపిక చేసి మాత్రమే సాయం అందిస్తేనే లక్ష కోట్లు దాటుతుండగా, ఎలాంటి లెక్క చూసుకోకుండా అందరికీ ఇస్తే ఇంకా ఎంత అవుతుందోనన్న భయమూ నెలకొంది. కొంతలో కొంత రేవంత్ రెడ్డి సర్కారు  తెలివిగానే ముందుగా దరఖాస్తులు స్వీకరించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికారానికి వచ్చిన 90 రోజుల్లోనే ఇసుక ఆదాయం, మద్యం ఆదాయం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే వాటిని గ్యారెంటీలకు మళ్లిస్తారా అన్నది మాత్రం చెప్పలేం ఎందుకంటే సీఎం రేవంత్ ఇప్పుడు శంకుస్థాపనల బిజీలో ఉన్నారు. ఎలివేటెడ్ కారిడార్లు, డబుల్ డెక్కర్ కారిడార్లు, పాతబస్తీకి మెట్రో విస్తరణ లాంటి పథకాలతో పాటు.. కాళేశ్వరం కొత్త బడ్జెట్ ను అడ్జెస్ట్ చేయాల్సి ఉంది. దానితో నిధులు ఎక్కడ నుంచి తెస్తారన్న ప్రశ్నల నడుమ… ప్రధాని  మోదీ చేసిన ఒక పని ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. కేంద్రం ఇచ్చే గ్యాస్ సబ్సిడీ ఒకప్పుడు 150 నుంచి 300 రూపాయల వరకు ఉండేది. సిలెండర్ బుక్ చేసి డబ్బులు చెల్లించి డెలీవరీ అయిన వారం రోజులకు బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ జమ అయ్యేది. ఆ సబ్సిడీ క్రమంలో 40 రూపాయలకు దిగివచ్చింది. 2020 నుంచి ఉజ్వల లబ్ధిదారులకు మినహా మిగతావారికి గ్యాస్ సబ్సిడీని గుట్టుచప్పుకు కాకుండా ఆపేశారు. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ లేదు. అదేమని అడిగితే ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకే నిధులన్నీ ఖర్చు అవుతున్నాయని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి రావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కీలక హామీలు అమలు చేయాల్సి ఉంది.ప్రతి మహిళ ఖాతాలో 2,500 రూపాయలు జమ చేయాలంటే ఎంత ఖర్చవుతుందో ఇంకా లెక్క తేల్చలేదు. ఆ ఖర్చు తడిసి మోపెడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే క్రమంగా  ఉచితాలను  ప్రభుత్వం  కోల్డ్ స్టోరేజీలో పెడుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు కూలీలకు ఏడాదికేడాది డబ్బులు వేయడ మామూలు విషయం కాదు. అందుకే అన్ని హామీలు అమలు చేయడం ప్రభుత్వానికి కుదరని పనేనని చెబుతున్నారు….

కేంద్రం మరో రకంగా రేవంత్ ప్రభుత్వాన్ని  ఇరకాటంలో పెట్టింది. ఎన్నికల వేళ గ్యాస్ సిలెండర్ ధరను వంద రూపాయలు తగ్గించింది. దానితో తెలంగాణ ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.  తెలంగాణ ప్రభుత్వం సిలెండర్ ను  500 రూపాయలకు ఇస్తూ మిగతా సొమ్మును తన సబ్సిడీగా పరిగణిస్తోంది. ఇప్పుడు వంద తగ్గితే ప్రభుత్వం చేసే వ్యయంలో వంద రూపాయలు తక్కువవుతుందన్నమాట. మరి   తెలంగాణ గ్యాస్ సిలెండర్ రేటును రేవంత్ ప్రభుత్వం 500 నుంచి 400 కు తగ్గిస్తుందా  లేదా.. అన్నది చూడాలి..ఏదేమైనా ఉచితాలతో ఆర్థిక భారం ఏటికాయేడు  పెరగడం మాత్రం ఖాయం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి