కేసీఆర్ జాతీయపార్టీ పెడుతున్నారని కుట్రపూరితంగా కవితను ఇరికిస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్‌స్కామ్ జరిగితే తెలంగాణలో కేసీఆర్ బిడ్డకి ఏమిటి సంబంధం దర్యాప్తుసంస్థల దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. ఇలాంటి ఖండనలు, వివరణలు ఎన్ని చెప్పినా చట్టం తనపని తాను చేసుకుపోతోంది. నిప్పులేందే పొగరాదనేది ఎంత నిజమో ఎంతోకొంత ప్రమేయం లేకుండా కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోలేదన్నదీ అంతే నిజం. ఎందుకంటే తెలంగాణలో కవితనుంచి ఢిల్లీలో కేజ్రీవాల్‌దాకా ఎక్కడెక్కడ ఏయే లింకులున్నాయో అన్ని తీగలూ లాగి డొంక కదిపింది దర్యాప్తుసంస్థ.
కేవలం సాక్షిగానే తనను విచారించారని కల్వకుంట్ల కవిత మొదట చెప్పుకున్నారు. తర్వాత సాక్షికాదు నిందితురాలని దర్యాప్తుసంస్థ తేల్చేసింది. ఇప్పుడామె పేరు ఏకంగా చార్జిషీట్‌కి ఎక్కటంతో ఊహాగానాల వాదన వీగిపోయింది. సౌత్‌గ్రూప్‌నుంచి రూ.100 కోట్ల ముడుపులు అందుకున్నవారిలో ఆప్ నేతలతో పాటు కవిత పేరుని కూడా ఈడీ చేర్చింది.
ఆమెతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కొడుకు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డిలను కూడా లిక్కర్‌స్కామ్‌లో నిందితులుగా ఈడీ పేర్కొంది. సౌత్‌గ్రూప్‌నుంచి అందుకున్న వందకోట్ల ముడుపులను ఆమ్‌ఆద్మీపార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన విషయాన్ని కూడా చార్జిషీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. ఈడీ చార్జిషీట్‌లో కూతురి పేరెక్కడం కేసీఆర్‌ని ఆత్మరక్షణలో పడేసింది. జాతీయపార్టీగా అందరినీ ఏకం చేద్దామనుకుంటుంటే కూతురు కేసులో ఇరుక్కోవడం ఆయన నైతికతకు పెద్ద పరీక్ష. ఆధారాలు మాయం చేశారని దర్యాప్తుసంస్థ ఆరోపించినప్పుడు గాల్లో బాణాలు వేస్తున్నారని అనుకున్నారు. కానీ ఈడీ దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయన్న విషయం ఈ చార్జిషీట్‌తో తేటతెల్లమైంది. లిక్కర్‌స్కామ్ కేసులో నిందితులంతా అరెస్టయ్యారు ఒక్క కవిత తప్ప. చార్జిషీట్ దాఖలుతో విచారణ ఆమె అరెస్ట్‌దాకా వస్తే కేసీఆర్‌కి ఇది మాయనిమచ్చే. మొన్నటిదాకా కేసీఆర్, ఆయన కొడుకే టార్గెట్. ఇప్పుడు కూతురు కూడా విపక్షాల విమర్శలకు కేంద్రబిందువవుతున్నారు.