ఎమ్మెల్సీ కవితను వెంటాడుతున్న ఈడీ

By KTV Telugu On 21 December, 2022
image

ఢిల్లీ లిక్కర్ స్కాం బీఆర్‌ఎస్‌ మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి తెరపైకి రావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. సౌత్‌ గ్రూప్‌కు కవిత నేతృత్వం వహించినట్లు, 10 ఫోన్లను ధ్వసం చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు ఈడీ అధికారులు. దీని ఆధారంగా కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐదుగురు అధికారులతో కూడిన సీబీఐ బృందం దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించింది
మరోసారి విచారణకు అందుబాటులో ఉండాలంటూ నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. తాజాగా ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జిషీట్‌లోనూ కూడా కవిత పేరు ఉండటం సంచలనంగా మారింది. ఇప్పటికే అరెస్ట్ అయిన విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్, బినయ్ బాబు, సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈడీ తాజా ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

ఇందులో కవిత పేరు తో పాటు వైసీపీ ఎంపీ మాంగుట శ్రీనివాసులురెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌రెడ్డి, ముత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు కవితకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను కూడా ఈడీ అందులో ప్రస్తావించింది. సమీర్ మహేంద్రు కంపెనీలో కవిత 32 శాతం వాటా కలిగి ఉన్నట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఒబెరాయ్ హోటల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి మీటింగ్ ఏర్పాటు చేయగా ఈ మీటింగ్‌లో కవిత, అరుణ్ పిళ్లై, అమిత్ అరోరా పాల్గొన్నట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్‌లో ఎల్1 కింద ఇచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. కవిత మార్చిన 10 ఫోన్ల వివరాలను కూడా ఇందులో ఈడీ పొందుపర్చింది. సౌత్ గ్రూప్, ఆప్ నేతల మధ్య జరిగిన డీల్‌తో పాటు కవిత, రాఘవ్ రెడ్డి అసలు భాగస్వాములుగా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థ వ్యవహారాలను ఈ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈడీ దాఖలు చేసిన ఆ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దాంతో ముందు ముందు ఏం జరుగుతుందోనని బీఆర్ఎస్‌ లో టెన్షన్‌ మొదలైంది.