పరిపాలనా సౌలభ్యం కోసం ప్రారంభించిన ధరణి పోర్టల్ సామాన్యుల పాలిట శాపమైందా ? ఆ పోర్టల్ ను నమ్ముకుని మోసపోయిన గ్రామీణులను కేసీయార్ సర్కారు ఆదుకోవడం లేదా ? అసలు ధరణితో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్నింటినీ పరిష్కరిస్తామని ఆర్థికమంత్రి హరీష్ రావు హామీ ఇచ్చి ఆరునెలలైనా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉందా.
రైతులకు శాపంగా మారిన ధరణి పోర్టల్
భూముల క్రయ విక్రయాల్లో గందరగోళం
ధరణి నిర్వాహణలో దళారుల చేతివాటం
నకిలీ పత్రాలు సృష్టిస్తున్న కొందరు దొంగలు
ఎప్పుడో జరిగి పోయిన తప్పులకు సైతం రైతులకు వెతలు
పని సులభతరం చేయాల్సిన తరుణంలో మరింత సంక్లిష్టం
పనిచేయని పరిపాలనా సౌలభ్య నినాదం
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ సమస్యల నిలయంగా మారింది. భూముల క్రయవిక్రయాలను సరళతరం చేసే దిశగానూ, భూరికార్డులను పక్కాగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనూ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అసలు సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ధరణి పోర్టల్ పై అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలకు ప్రస్తుతం కొనసాగుతున్న విధానానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్నా తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పడం లేదు. తమ భూమిపై ఎలాంటి వివాదాలు లేవని దాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరినా అధికారులు పట్టించుకోకపోగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. పైగా ఖాస్రా పహాణీల నుంచి ప్రస్తుత ఏడాది వరకు పహాణీలపై ఆధారాలు సమర్పించాలని అధికారులు కోరడంతో భూమి ఉన్న రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.
నిజానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకే కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకే సారి జరిగిపోతే పని తగ్గుతుందని భావించింది. దీన్నే దళారులు, అక్రమార్కులు ఆసరాగా తీసుకున్న తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. భూ యజమాని ఆధార్ కార్డు, పాస్ పోర్టు ఫోటో, సంతకం, సెల్ ఫోన్ ఓటీపీ ఉంటే ధరణి పోర్టల్ లో సలువుగా భూ యజమాన్య హక్కుల మార్పిడి సాధ్యమవుతుంది. వీటినే ఆయుధాలుగా వాడుకుంటూ రెవెన్యూ సిబ్బంది సహకారంతో యజమానికి తెలియకుండానే బదలాయించేస్తున్నారు. అధికారుల పేరాశకు రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. కేసులున్న సంగతే తెలియదు ముర్రో అని రైతులు గగ్గోలు పెడుతుంటే ఎందుకు కేసులు నమోదు చేశారు? ఎవరు కేసువేశారు? ఇప్పుడు కేసు ఏ స్టేజీలో ఉంది ? లాంటి వివరాలు తీసుకురావాలని రైతులను వెనక్కి పంపుతున్నారు. కలెక్టర్ లాగిన్ నుంచి తహశీల్దార్ వరకు రావడానికి పైరవీలు చేయడంతో పాటు పైసలు సమర్పించుకోవాల్సి వస్తోంది. అప్లికేషన్లు చూసి తహశీల్దారు రిపోర్టు పంపినా వాటిని పరిశీంచకపోగా సంతకాలు చేసిన ఫైళ్లు తీసుకురావాలని చెబుతూ ఖాస్రా పహాణీ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం ఆన్ లైన్ అని చెబుతున్నా ఫిజికల్ డాక్యుమెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ధరణి పోర్టల్ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది క్రయ విక్రయాలు, భూరికార్డుల నమోదుకు సంబంధించి పది లక్షలకు పైగా ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయి. తమ వ్యవసాయ భూములను అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ రోజు వందల మంది తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాటిని పరిష్కరించేందుకు సిబ్బంది లేక తంటాలు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం విఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. దానితో ల్యాండ్ రికార్డ్స్ పరిశీలన కష్టమవుతోంది కొన్ని రోజులు వీఆర్ఏలు సమ్మె చేశారు. దానితో దరఖాస్తులు పేరుకుపోయాయి. అదే అదునుగా చూసుకుని అధికారులు బేరసారాలు సాగించారు. పైసామే పరమాత్మా అనేశారు. ప్రతీ దానికి కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగడం అసాధ్యమైంది. ఈ ఏడాది జులైలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ధరణి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కోర్టు కేసులు వ్యక్తిగత సమస్యలు లేని ప్రతీ భూసమస్యను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. అంత చెప్పినా జరిగిందీ శూన్యమని తేలిపోయింది.
ధరణి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఉద్యమించింది. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించింది, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి. ఎవరేమి చేసినా ఒకటి మాత్రం నిజం. ధరణి పోర్టల్ ఏర్పాటు చేయడం, భూబదలాయింపులను సులభతరం చేయాలని ప్రయత్నించడంలో తప్పులేదు. అమలు తీరే పెద్ద సమస్యగా మారింది. పోర్టల్ నిర్వహణలో లోపాలున్నాయి. లేనిపోని రూల్స్ పెట్టి అధికారులు తిప్పుకోవడంతో రైతులకు సమస్యలు తలెత్తుతున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించేందుకు పైస్థాయి దాకా వెళ్లకుండా గ్రామ స్తాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. కలెక్టర్లు, తహశీల్దార్లు గ్రామాలకు రావడం కుదరని రోజుల్లో కింది స్తాయిలోనే పరిష్కరించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో టైమ్ పాస్ చేయడం మినహా జరిగేదేమీ ఉండదు. రైతుల సమస్యలూ పరిష్కారం కావు.