రాములమ్మకు అంత సీన్ ఉందా ?

By KTV Telugu On 20 November, 2023
image

KTV TELUGU :-

ఆమె నిత్య అసంతృప్తివాది. ఏ పార్టీలో ఉన్నా ఆమె తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. పార్టీ క్రమశిక్షణ అంటే ఏమిటో ఆమెకు తెలుసు అని ఎవరూ అనుకోరు. తరచూ పార్టీ మారతారు. వెళ్లిన పార్టీలకే మళ్లీ వెళ్తుంటారు. ఐనా సరే పార్టీల తలుపులు ఆమె కోసం తెరిచే ఉంటాయి. అది ఆమె అదృష్టం అనుకోవాలో, సినీ గ్రామర్ కు పార్టీలు ఇచ్చే గౌరవం అనుకోవాలో చెప్పలేని పరిస్తితి ఉంది. ఏదైనా సరే విజయశాంతి నిత్యం లైమ్ లైట్లో ఉంటారు. ఆమె ఎక్కడున్నారు. ఏమి చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు. ఏం ట్వీట్ చేస్తున్నారంటూ మీడియా నిత్యం వెదుకుతూనే ఉంటుంది. తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా పక్షం రోజుల కూడా లేకుండా ఆమె బీజేపీ టూ కాంగ్రెస్ జంప్ జిలానీ అయిపోయారు. ముందు రోజు వరకు కూడా బీజేపీలో ఉంటాననే ప్రకటించి మరీ  పార్టీ మారారు.  వెళ్లిందే తడవుగా కమలం పార్టీపై పది లీటర్ల బురద జల్లేసారు.

నిజానికి ఆమె ఒక అట్రాక్షన్. లేడీ అమితాబ్ పేరు వింటేనే జనంలో ఏదో తెలియని అనుభూతి. జనం కూడా ఆమె పట్ల సానుకూలంగానే ఉంటారు. కాకపోతే నోటి దురుసుతనం, నిలకడలేమితో ఆమె ఎదగాల్సినంత ఎత్తుకు చేరుకోలేకపోతున్నారు. కాంగ్రెస్లో చేరిన వెంటనే ఆమెకు కీలక పదవి దక్కింది. పార్టీ ప్రచార, ప్లానింగ్  కమిటీ చీఫ్ కో-ఆర్డినేటర్ గా ఆమెను నియమించారు. 24 గంటల్లోనే అలాంటి పదవి దక్కడం మామూలు విషయం కాదని  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముందు నుంచి ఉన్న నేతలకు ఆమె కంటే తక్కువ స్థాయి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ  విజయశాంతికి పెద్ద పీట వేసింది. సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు లాంటి వారు విజయశాంతికి వెనకనే ఉంటారు. అలాగని వచ్చిన  అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటారని కూడా చెప్పలేము. కాంగ్రెస్లోకి వచ్చిన విజయశాంతి ఆ పార్టీ గురించి ఆలోచించకుండా తాను వదిలేసిన బీజేపీపై ఆరోపణలు సంధించేందుకు ఎక్కువ సమయం  కేటాయిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాటిన ఒక మొక్క బీజేపీని నాశనం చేసిందని  విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ని ఉద్దేశించి ఆమె హాట్‌ కామెంట్స్‌ చేసినట్లుగా భావిస్తున్నారు. ఈటలపై కేసీఆర్‌ పెట్టిన కేసులు ఏమయ్యాయి? అని కూడా ప్రశ్నించారు. బీజేపీ దానికదే నాశనం అయిందని విజయశాంతి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయ్యింది. తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం కూడా విజయశాంతికి మొదటి నుంచి అలవాటే. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడం వల్లే తెలంగాణలో బీజేపీ దెబ్బతిన్నదని ఆమె విశ్లేషించారు.ఆయన్ను తీసేయ్యొద్దని చెప్పానని, తన మాట  అధిష్టానం వినక పోవడం వల్లే పార్టీకి ఇప్పుడీ దుస్థితి వచ్చిందని  విజయశాంతి ఆరోపించారు. పైగా కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చినందునే ఆ పార్టీలో చేరానని చెప్పుకున్నారు. నెలలు,సంవత్సరాలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోనందునే బీజేపీని వదిలేసి  వచ్చామని చెప్పారు. బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తారని, చర్యలు మాత్రం తీసుకోరని ఎద్దేవా చేస్తూ అలాంటి విషయాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సిద్ధహస్తులని విశ్లేషించేశారు.  విజయశాంతి అంతటితో ఆగలేదు. బీజేపీ, బీఆర్ఎస్  కలిసి తనపై మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని  ఆరోపించారు.

అన్ని సార్లు పార్టీలు మారినప్పటికీ విజయశాంతి రాజకీయాల్లో పరిణితి  సాధించలేదన్న వాదన కూడా ఉంది. ఎక్కడ, ఎప్పుడు ఏమీ మాట్లాడాలో ఆమెకు తెలియదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇవ్వాళ తిట్టిన పార్టీలోనే  రేపు చేరతానని తెలిసి కూడా అవసరాన్ని మించి మాట్లాడుతున్నారు.కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత ఇంతవరకు ఆమె ఏ ఎన్నికలోనూ  గెలవలేదు. ఈ సారి మెదక్ లోక్ సభ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి 2024లో గెలిచేంత వరకైనా ఆమె సంయమనంగా ఉంటారో.. ఇదే పంథా కొనసాగిస్తారో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి