జూపల్లి -పొంగులేటికి కష్టకాలమేనా !

By KTV Telugu On 9 September, 2023
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్లు ఎవరైనా రావచ్చన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. వచ్చిన తర్వాతే అసలు గేమ్ మొదలవుతుంది. కొత్త వాళ్లకు ఎక్కడ ప్రాతినిధ్యం పెరుగుతుందోనన్న భయంతో పాత గ్రూపులు అడ్డు తగులుతాయి. ముందు తమ సంగతి తేల్చాలంటూ అసమ్మతి రాజకీయాలకు తీస్తాయి. అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలవుతాయి. ఇప్పుడు టీ.కాంగ్రెస్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది.

వాళ్లిద్దరూ ఎన్నో ఆశలతో కాంగ్రెస్ లో చేరారు. పార్టీ గెలిస్తే తమ వల్లే గెలవాలన్నంతగా పనిచేయాలకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడొచ్చిన వాళ్లకు పెత్తనమేంటన్న పాతనేతలు పేచీలకు దిగుతున్నారు. పొంగులేటి మమ్మల్ని ఏం చేయగలరు.. జూపల్లి అంటే మాకు ఏమన్నా భయమా అన్న ప్రశ్నలతో ఉదరగొట్టేస్తున్నారు. టికెట్ల విషయంలో పెద్ద గందరగోళం తప్పేలా లేదు. పైగా పొంగులేటి డిమాండ్లు కూడా కాంగ్రెస్ కు ఇబ్బందిగా ఉన్నాయని చెబుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడల వల్ల ప్రయోజనం పెద్దగానే ఉంటుందని భావిస్తున్నా..ఘర్‌ వాపసీ పేరుతో వచ్చి చేరుతున్న లీడర్లకు మాత్రం పాత క్యాడర్ నుంచి భారీగా వ్యతిరేకత వ్యక్తమౌతుంది.వస్తే వచ్చారు కానీ..టికెట్‌..పోటీ అనకుండా..తమ వెనకాలే ఉండాలన్న డిమాండ్ అధికమౌతుంది.ఇది మామూలు స్థాయి నేత కావచ్చు..మాజీ మంత్రి కావచ్చు అదేరీతిలో ఉంది.ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే బడాలీడర్‌గా పేరున్న జూపల్లి కృష్ణారావుకు కూడా ఇది తప్పేట్టులేదు. కనీసం ముగ్గురు నలుగురు ఆశావహులు ఇప్పుడు జూపల్లికి అడ్డు తగిలే ప్రయత్నంలో ఉన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు, రెండు నుంచి ఐదేళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వాళ్లు ఇప్పుడు జూపల్లికి టికెట్ దక్కకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారు. దీనితో కొల్లాపూర్ టికెట్ హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఉంచుతూ..తామెంతో కష్టనష్టాలకు ఓర్చుకున్నామని..ఇపుడు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో..దుస్తులు మార్చినట్లు పార్టీలు మార్చి..కాంగ్రెస్ పార్టీలోకి వస్తే..వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. అలాంటి వారిలో ఇంఛార్జ్ జగదీశ్వరరావు, బీసీ సామాజికవర్గానికి చెందిన తిరుపతమ్మ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఖమ్మం స్ట్రాంగ్ మేన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కూడా జూపల్లిలాంటిదేనని చెప్పాలి. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఆ తర్వాత పెద్దగా పబ్లిసిటీ కనిపించడం లేదు. ఏదో ఆశించి పొంగులేటి వచ్చినా.. కాంగ్రెస్ గ్రూపులు ఆయన ఆశలపై నీళ్లు చల్లె పరిస్థితి వచ్చింది. పొంగులేటి పోటీ చేస్తారో లేదో ఇంతవరకు క్లారిటీ రాకపోయినా ఆయన ముందరి కాళ్లకు బంధం వేసే దిశగా కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నుంచి ఐదు స్థానాలు పొంగులేటి తన అనుచరులకు అడుగుతుండగా.. ఒక్కటి కూడా ఇవ్వడానికి వీలులేదని ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు లాబీయింగ్ మొదలు పెట్టారు. పొంగులేటితో గానీ ఆయన అనుచరులతో గానీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారే మినహా, స్థానిక నేతలెవ్వరూ పెద్దగా టచ్ లోకి వెళ్లలేదు. ముందు తమ సంగతి తేల్చి… తర్వాత పొంగులేటి వ్యవహారం చూడాలని కొందరు నేతలు టీపీసీసీ పెద్దల వద్ద ప్రస్తావిస్తున్నారట. త్వరగా తేల్చకపోతే కొంతమంది నేతలు పక్క చూపులు చూసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. బీజేపీలో తమకు ఆపర్లున్నాయని కొందరు నేతలు బహిరంగంగానే ప్రచారం చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ అంటేనే గ్రూప్ పాలిటిక్స్ అని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఎక్కువ మంది బలమైన నేతలు ఉంటే… అంత స్ట్రాంగ్ గ్రూపులు అక్కడ పనిచేస్తుంటాయి. ఇప్పుడు టీకాంగ్రెస్ పరిస్థితి కూడా అలాంటిదే. కొల్లాపుర్, ఖమ్మం పరిస్థితులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే కారణమని నమ్ముతున్న నేతలు ఇప్పుడు పార్టీలో ఆయన వ్యతిరేకులతో టచ్ లోకి వెళ్లిపోయారు. ఖమ్మం నేతలంతా మల్లు భట్టి విక్రమార్కను సంప్రదిస్తున్నారని సమాచారం. రేవంత్ కు వ్యతిరేకంగా గ్రూపు కట్టిన భట్టి.. ఇప్పుడు తను బలంగా కనిపించేందుకు సంప్రదించిన వారందరినీ రమ్మంటున్నారట. ఇక పాలమూరులో మల్లు రవితో టచ్ లోకి వెళ్లాలని ప్రయత్నించినా ఆయన రేవంత్ గ్రూపు అని అర్థం చేసుకుని… వేరే వారిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. నల్గొండ నేతలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో వాళ్లు టచ్ లో ఉన్నారు. ఎన్నికల నాటికి రేవంత్ గ్రూపు వీక్ అయిపోతే పొంగులేటి, జూపల్లి ఆటలు సాగకుండా చూసుకోవచ్చని వారు లెక్కలేసుకుంటున్నారు. వాళ్లిద్దరికి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ప్రజామద్దతుతో గెలిపించుకుంటామని ప్రచారం చేస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి