కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు దిగ్విజయ్ సింగ్ ను సలహాదారుగా పంపింది. ఆయన వచ్చారు గాంధీభవన్‌లో హోటల్‌లో ఎక్కడ సమయం దొరికితే అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అందరూ చెప్పింది విన్నారు. కానీ చివరిగా వెళ్లేటప్పుడు మాత్రం తాను చెప్పాలనుకున్నది చెప్పారు. పార్టీలో జూనియర్లు , సీనియర్లు అంటూ ఎవరూ ఉండరని తేల్చేశారు. అందరూ కలిసి కట్టుగా పని చేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇంకా చాలా చెప్పారు కానీ జూనియర్లు , సీనియర్లు అనే ప్రత్యేకమైన కేటగిరి ఉండదని తేల్చేయడం పార్టీలో పుట్టి పెరిగామని తమకే ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబట్టి కూర్చున్న సీనియర్ అసమ్మతి వాదులకు మైండ్ బ్లాంక్ చేసినట్లయింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ ను తొలగించాలని లేకపోతే కనీసం ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ నైనా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను సర్దుబాటు చేసేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ తో భేటీ సమయంలో ఇంచార్జ్ ఠాగూర్ ను తొలగిస్తారని సీనియర్ల క్యాంప్ ప్రచారం చేసింది. కానీ దిగ్విజయ్ హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు అంతా సాల్వ్ అయిందని ఎవరైనా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తే చర్యలు ఉంటాయని చెప్పి వెళ్లారు.అంటే రేవంత్ ను కానీ ఠాగూర్ ను కానీ మార్చే ఆలోచనే లేదని స్పష్టమవుతోంది. హైకమాండ్ తమను ఏదో విధంగా సంతృప్తి పరుస్తుందని తమకు కొంత బలం చేకూరురుస్తుందని సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు పట్టించుకోలేదని అనుకుంటారేమోనని హైకమాండ్ దిగ్విజయ్ ను పంపింది. ఆయన మాట్లాడారు. పరిష్కారానికి ఎలాంటి సూచనలు చేయలేదు. అంటే సీనియర్లు ఇక ఓవరాక్షన్ చేయవద్దని నేరుగా చెప్పినట్లయింది.
దిగ్విజయ్ సింగ్ చెప్పిందే కాంగ్రెస్ హైకమండ్ మాట. అందులో మాట చాయిస్ ఉండే చాన్స్ లేదు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు బాగా తెలుసు. మరి ఇప్పుడు వారేం చేయబోతున్నారు ? పీసీసీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో వారు పాల్గొనరు. రేవంత్ నేతృత్వంలో పీసీసీ తన పని తాను చేసుకుపోతోంది. పాదయాత్ర కూడా ప్రకటించింది. దిగ్విజయ్ వచ్చి వెళ్లిన తర్వాత రేవంత్ వర్గం మరింత బలం పుంజుకున్నట్లయింది. ఎందుకంటే దిగ్విజయ్ ఉండగానే గాంధీ భవన్‌లో ఎన్ఎస్యూఐ పేరుతో కొంత మంది గాంధీ భవన్‌లో సీనియర్లకు మద్దతుగా రగడ సృష్టించారు. ఇది దిగ్విజయ్ ను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఖచ్చితంగా ఆయన ఈ అంశంపై హైకమాండ్ కు నివేదిక సమర్పించే చాన్స్ ఉంది. ఈ ఘటన సీనియర్లకు నెగెటివ్ గా వెళ్తుంది కానీ పాజిటివ్ గా వెళ్లే చాన్స్ లేదు.
రేవంత్ రెడ్డిని ఎలాగైనా నియంత్రించాలన్న ఉద్దేశంలో ఆవేశపడి సీనియర్ నేతలు పార్టీకి దూరం అయ్యారు. రేవంత్ ఆధ్వర్యంలో తాము పని చేయలేమన్నట్లుగా ప్రకటనలు చేశారు. ఢిల్లీకెళ్లి తేల్చుకుంటామన్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన దూత మాత్రం కనీస ఓదార్పు కూడా ఇవ్వలేదు. దీంతో తమంతట తాము తగ్గితే ఇప్పుడు పార్టీలోనే చులకన అయిపోతారు. హైకమాండ్ రేవంత్ పై కానీ రేవంత్ వర్గంపై కానీ వ్యతిరేకంగా మాట్లాడకుండా చిన్న చర్య తీసుకోకుండా సీనియర్లు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే వారు రాజీపడిపోయినట్లుగా బావిస్తారు. అప్పుడు రేవంత్ వర్గం మరింతగా అవమానిస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పార్టీలోనే ఉన్నా వారికి ఆదరణ ఉండదు. రేవంత్ తో పూర్తి స్థాయిలో విబేధాలను తొలగించుకుని పార్టీలో సర్దుబాటు చేసుకుని రేవంత్ నాయకత్వంలో నడవాల్సి ఉంటుంది. లేకపోతే ఓ అసమ్మతి వర్గంగా దూరంగా ఉండిపోవాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లో చేరితే భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. భారతీయ జనతా పార్టీ ఈ సీనియర్లకు ఆహ్వానం పలకడానిక రెడీగా ఉంది. కానీ కాంగ్రెస్ లో ఉన్నంత సీనియార్టీ అక్కడ ఉండదు. కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్చ అక్కడ ఉండదు. అక్కడ ఇప్పటికే చాలా మంది సీనియర్లు ఉన్నారు. వీరి మాట చెల్లదు. కొత్త పార్టీలో చేరినట్లుగా అణిగిమణిగి ఉండాలి. కోరుకున్నది దొరుకుతుందేమో అని ఎదురు చూడాల్సిందే కానీ ఇవ్వకపోతే ఎదురుదాడి చేసే పరిస్థితి ఉండదు. టీఆర్ఎస్ వైపు చూసినా అంతే. అందుకే ఇప్పుడు సీనియర్లు అటూ ఇటూ కాకుండా అయిపోయారన్న వాదన వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు మౌనం పాటించి ఆ తర్వాత ఏం చేయాలన్నది సీనియర్లు నిర్ణయించుకునే అవకాశం ఉంది.