> బిజెపి సంస్థాగత మార్పులపై పార్టీలో భిన్నాభిప్రాయాలు
> తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై పార్టీలో అసంతృప్తి
> పార్టీకి మంచి ఊపు తెచ్చిన సంజయ్ ని ఎన్నికల ముందు తప్పించడంపై ఆక్రోశం
> కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా నియమించిన నాయకత్వం
> ఏపీలో పురంధేశ్వరికి సవాళ్లు తప్పని పరిస్థితి
KTV Telugu. బిజెపి జాతీయ నాయకత్వంలో అంతర్మథనం మొదలైందని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి తెలంగాణా బిజెపి విషయంలో జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలపై పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తడంతో తప్పు చేశామా అన్న భావన వారిలో కలుగుతోందని అంటున్నారు. చేసిన తప్పును సరిదిద్దుకునే పరిస్థితి ఎలాగూ లేదు కాబట్టి వీలైనంతలో పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీని దూకుడుగా ముందకు తీసుకెళ్లడం ఎలా? అన్న అంశంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి నాయకత్వం వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు చేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలతో పాటు దానికి ముందు అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రాతిపదికగా తీసుకునే ఈ మార్పులు చేశారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలంగాణా రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేస్తామని మొన్నటి వరకు కమలనాథులు ధీమాగా ఉన్నారు. అయితే కాలం గడిచే కొద్ది వారి అంచనాలు తల్లకిందులైపోతున్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్థితిలేదని వారి సొంత సర్వేలే తేల్చి చెప్పడంతో తలలు పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతీ రాష్ట్రంలోనూ పార్టీకి కొత్త రూపు తీసుకు రావాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షులను మార్చడం ద్వారా కొత్త ఊపునూ తీసుకురావచ్చునని భావించారు. దానికి అనుగుణంగానే పార్టీ అధ్యక్షులను మార్చారు. ఈక్రమంలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ లో సోము వీర్రాజుకు సెలవిచ్చి దగ్గుబాటి పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించారు. తెలంగాణాలో బండి సంజయ్ ని మార్చి కేంద్ర మంత్రి మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డకి కిరీటం తొడిగారు. ఈ రెండు మార్పుల వెనుక పార్టీ అగ్రనేతలు భిన్న కోణాల్లో సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతనే ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నిర్ణయంపైనే ఇపుడు పార్టీలోనే అసంతృప్తి రాజుకుంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రత్యేకించి తెలంగాణా బిజెపికి మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని ఎన్నికలకు ముందు మార్చడం ఏ మాత్రం మంచి నిర్ణయం కాదని తెలంగాణా లో చర్చ నడుస్తోంది. పార్టీ శ్రేణుల్లోనూ బండి సంజయ్ పట్ల సానుభూతి పెరుగుతోంది. ఒక వేళ బండి సంజయ్ కి ఏ కేంద్ర మంత్రి పదవో..జాతీయ కార్యవర్గంలో కీలక పదవో అప్పగిస్తే సంజయ్ లో అసంతృప్తి తగ్గచ్చు కానీ పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తి ఓ పట్టాన తగ్గకపోవచ్చు.అన్నింటినీ మించి నిన్నటిదాకా దూకుడు మీద ఉన్న పార్టీ కాస్తా ఇపుడు ఒక్కసారిగా స్తబ్ధుగా మారిపోయిందని అంటున్నారు.
బండి సంజయ్ పని తీరు బులెట్ దూసుకుపోయినట్లు ఆయన చేసే మాటల దాడి.. తిరుగులేని ప్రసంగాలు.. పార్టీ కార్యకర్తల్లో ఊపును తెచ్చేవి. ఆయన స్థానంలో అధ్యక్షుడైన కిషన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడే కానీ గొప్ప వక్త కాదు. అలాగే దూకుడు ఉండదు. సౌమ్యుడు. ఈ లక్షణాలు యూత్ ని ఆకట్టుకోడానికి పనిచేయవంటున్నారు యువనేతలు. బండి సంజయ్ లా అగ్గి రాజేసేలా వ్యవహారాలు నడిపే వారితోనే పార్టీకి విజయాలు వచ్చి చేరతాయని వారంటున్నారు. ఇప్పుడిక బండి సంజయ్ ని తిరిగి అధ్యక్ష పీఠం పై కూర్చోబెట్టడం సాధ్యం కాదు కాబట్టి కిషన్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీకి ఊపు తీసుకురాడానికి ఏం చేయాలన్న అంశంపై దృష్టి సారిస్తున్నారు.
కిషన్ రెడ్డి ఆందోళనలతో బిజీగా ఉంటే ఇక ఈటల రాజేందర్ పార్టీలో చేరికలను వేగవంతం చేసేలా వ్యూహరచన చేస్తారని అంటున్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణా కాంగ్రెస్ ఉద్దేశ పూర్వకంగా బిజెపిపై విషం చిమ్మిందని అందుకే పార్టీలో చేరికలు తాత్కాలికంగా ఆగాయని భావిస్తున్నారు. గతంలో బిజెపిలో చేరడానికి ఆసక్తి చూపి ఆతర్వాత మౌనంగా ఉండిపోయిన వారిని ఈటల కలవనున్నారు. అలాగే కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను కలిసి వారికి బిజెపిలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పించడం ద్వారా పార్టీలోకి కొత్త నేతలను ఆకర్షించాలని భావిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి