అసలే కర్నాటక లో ఓటమితో దాని ప్రభావం తెలంగాణాపై ఎలా ఉంటుందో అని ఇక్కడి బిజెపి నేతలు కంగారు పడుతోంటే గోరు చుట్టు పై రోకలి పోటులా తయారైంది తెలంగాణ బిజపిలో అసమ్మతి పోటు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పార్టీలోని కీలక నేతలెవరకీ కూడా పడ్డం లేదు. ఈ విషయంలో బండి సంజయ్ దే తప్పంతా అంటున్నారు సీనియర్లు. ఎవ్వరినీ కలుపుకుపోకుండా బండి సంజయ్ ఒంటెత్తు పోకడలు పోవడమే సమస్యకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అసమ్మతిని దారికి తీసుకురాకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు. కర్నాటక ఎన్నికలకు రెండు మూడు నెలల క్రితం వరకు కూడా తెలంగాణాలో బిజెపి చాలా దూకుడుగా ఉండేది. బి.ఆర్.ఎస్.కు తామే ప్రత్యామ్నాయమని ధీమాగా ఉండేది. తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది కూడా బిజెపీయేనని కమలనాథులు ఆత్మవిశ్వాసంతో కనిపించేవారు. దానికి కారణాలు లేకపోలేదు. తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకీ పెరిగిపోవడం ఆ పార్టీకి చెందిన నేతలు కూడా బిజెపిలో చేరడంతో ఇక రాబోయేది తమ రాజ్యమే అన్నట్లు ఉండేది. అంతకు ముందు జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో బి.ఆర్.ఎస్.కు సవాల్ విసిరేది బిజెపియే అని ఆ పార్టీ చాటి చెప్పుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. హుజూర్ నగర్ లో ఈటల రాజేందర్ ను గెలిపించుకుని బి.ఆర్.ఎస్. వెన్నులో చలి పుట్టించింది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో సంచలన విజయాలు సాధించి బి.ఆర్.ఎస్.కు మొదటిసారి భయం అంటే ఏంటో రుచి చూపించింది బిజెపి. ఈ విజయాలన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటిగా రావడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం రోజు రోజుకీ రెట్టింపు అవుతూ వచ్చింది. ఇలాగే దూసుకుపోతే తమని ఆపడం ఎవరి తరమూ కాదని అనుకున్నారు. దీనికి తగ్గట్లే కాంగ్రెస్ సీనియర్లు కూడా బిజెపి వైపే చూశారు. మర్రిశశిథర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి బిజెపిలో ఎంట్రీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవలేకపోయినా బి.ఆర్.ఎస్.కు ప్రత్యామ్నాయం బిజెపియేనని చాటి చెప్పుకున్నారు. ఈ అన్ని విజయాలకూ ఒక విధంగా కారణం పార్టీ అధ్యక్షుడు బండి సంజయే అంటారు ఆయన అనుచరులు.
పార్టీకి కొత్త ఊపు రూపు తీసుకురావడంలో బండి సంజయ్ విజయవంతమయ్యారనడంలో ఎవరికీ అనుమానాలు కూడా లేవు. ఎవరో ఎందుకు పార్టీ అధ్యక్షుడు నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీయే బండి సంజయ్ నాయకత్వ లక్షణాలను మెచ్చుకున్నారు. భుజం తట్టి మరీ కితాబు నిచ్చారు. దాంతో బండి సంజయ్ కి పార్టీలో స్టార్ డమ్ వచ్చేసింది. ఆయన అనుచరులు అయితే తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రి బండి సంజయే అని ప్రచారం చేసేసుకుంటున్నారు కూడా. ఇక బండి సంజయ్ పలు దశల్లో నిర్వహించిన పాదయాత్ర కూడా హిట్ అయ్యింది. ఎక్కువ కాలం జనంలోనే ఉండడం వల్ల పార్టీకి మంచి మైలేజే వచ్చింది. అంతా బానే ఉందని హుషారుగా ఉన్న వేళ కర్నాటకలో బిజెపి ఘోర పరాజయం తెలంగాణా బిజెపిలో గాలి తీసేసినట్లయ్యింది. దాని ప్రభావం తెలంగాణాపై కూడా ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కర్నాటక విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగిపోయింది. బిజెపిలో చేరతారని అనుకున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇది బిజెపిని డిఫెన్స్ లో పడేస్తోంది. సరిగ్గా ఈ తరుణంలోనే పార్టీలో అసమ్మతి నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. బీజేపీ తెలంగాణా రాష్ట్ర రథసారథిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక పార్టీ పరుగులు తీసిన తీరుతో రాష్ట్ర, జాతీయ నాయకులంతా ఆయన్ను ప్రశంసించారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నా తనతో పాటు పదిమంది కలిసి నడిచేలా చేయడంలో బండి సంజయ్ విఫలమవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇదే అంశాన్ని పార్టీలోని ముఖ్యనేతలు అధిష్ఠానం ముందు మొర పెట్టుకున్నారని అందరికీ కలుపుకుని పోలేకపోతున్న బండి సంజయ్ పదవిని కొనసాగించాలా ఇంతటితో ముగించి మరొకరికి రాష్ట్ర పగ్గాలు అందించాలా అనే ఆలోచనతో హైకమాండ్ ఉందని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలో చేరమని ఆహ్వానించేందుకు ఈటల రాజేందర్ వెళ్ళినపుడు ఆ అంశం గురించి మీడియా అడిగితే ఆ విషయం తనకు తెలియదంటూ బండి సంజయ్ చేసిన కామెంట్ ఇద్దరి మధ్యా ఉన్న దూరాన్ని చెప్పకనే చెప్పారు. మరోవైపు తన జిల్లాకే చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డితో కూడా బండికి గతం నుంచీ పొసగదు. గుజ్జుల ఈ మధ్య బండిపై బాహాటంగానే విమర్శలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు సుగుణాకర్ రావుతోగానీ మరో జాతీయ నాయకుడైన మురళీధర్ రావుతోగానీ బండి సంజయ్ కు పొసగదనే విషయం బహిరంగ రహస్యం. అంతేకాదు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు ముఖ్య నేతల మధ్య దూరాన్ని మరింత పెంచాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావుతోనూ అంటీముట్టనట్టుండే బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీతోనూ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ తోనూ దూరందూరంగానే ఉంటారని టాక్. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేత ఆ స్థాయిలో వ్యవహరించడం లేదని ఏదో ఒక జిల్లా నేతగానే ఇప్పటికీ ఆయన వ్యవహార శైలి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడయ్యాక ఆయన దూకుడు వల్లే రాష్ట్రంలో కాషాయ పార్టీ పరుగులు తీసిందని కాషాయ సేనలో అందరూ అంగీకరిస్తారు. కాని అంతా తానొక్కడే అన్నట్లుగా ఉండటం ఎవరినీ కలుపుకునిపోకుండా వ్యవహరించడం ఆయనకు నెగిటివ్గా మారినట్లు సమాచారం. సీనియర్లనూ కేర్ చేయకపోవడం వంటి చాలా అంశాలు బండి సంజయ్ నాయకత్వపై నిరసనలకు కారణమవుతున్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండినే కొనసాగిస్తారా మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ కమలం పార్టీలో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే తెలంగాణాకే చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా తెలంగాణా బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయే కొనసాగుతారని ఆయన్ను మార్చే ప్రసక్తి లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక పార్టీ హై కమాండ్ ఆదేశాలు ఉండి ఉండచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ కి సాక్షాత్తూ నరేంద్ర మోదీ కోటరీలోనే తిరుగులేని పేరు ఉంది. బండి సంజయ్ జోలికి ఎవరు వచ్చినా పార్టీ నాయకత్వమే సహించే పరిస్థితి ఉండదని హస్తిన వర్గాలు అంటున్నాయి. ఎవరైనా అపోహలు సృష్టించినా వాతావరణం పాడు చేసినా క్రమశిక్షణా చర్యలు తప్పవంటున్నారు కమలనాథులు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న తరహాలో బిజెపికి కార్యకర్తలు లేరు. ప్రత్యేకించి చాలా గ్రామాల్లో బిజెపికి బలమే లేదు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం మారుమూల గ్రామాల్లో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. ప్రజల్లోనూ కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉంది. తెలంగాణా ఇచ్చిన పార్టీగానూ కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంది. అంచేత వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అంటున్నారు హస్తం పార్టీ నేతలు. బిజెపి లక్ష్యం తక్షణ అధికారం కాదని తెలంగాణాలో మరింతగా బలోపేతం అవ్వడమేనని వ్యూహకర్తలు అంటున్నారు. ఆ దిశగా తెలంగాణా బిజెపి సానుకూలంగానే అడుగులు వేస్తోందని వారు చెబుతున్నారు. అధ్యక్ష పదవిని ఆశించే వారు ఎక్కువగా ఉన్నారంటేనే బిజెపి తెలంగాణాలో ఓ స్థాయికి ఎదిగిందని ఒప్పుకోవాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.