ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సహజంగా ఎన్నికలపుడే ఆ సెంటిమెంట్ల గురించి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం గురించి ఓ ప్రచారం మొదలైంది. అక్కడి అభ్యర్థుల గెలుపోటముల గురించి ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. డోర్నకల్‌లో కొన్ని ఎన్నికల నుంచి వస్తున్న ఆనవాయితీ గురించే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ ఆనవాయితీ ఏంటి? దాంతో వచ్చే లాభ నష్టాలేంటి? వాచ్ దిస్ స్టోరీ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో షెడ్యూల్డ్ తెగల రిజర్వుడు స్థానం డోర్నకల్ రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే అక్కడ ఎమ్మెల్యేగా గెలువడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సీరియస్‌గా సాగుతోంది. ఆనవాయితీగా వస్తున్న సెంటిమెంట్‌తో స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు రాజకీయంగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజా ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహా మొత్తం 14 మంది పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ బిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి డాక్టర్ రాంచంద్ర నాయక్, బిజేపి నుంచి నర్సింహులపేట జడ్పీటిసి భూక్య సంగీత పోటీ చేస్తున్నారు. నర్సింహులపేట నుంచి 2019లో బిఆర్ఎస్ నుంచి జడ్పీటిసిగా గెలిచిన సంగీత ఎన్నికల ముందు కారుదిగి బిజేపిలో చేరారు. సంగీత డోర్నకల్ బిజేపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో 2009 ఎన్నికల్లో అప్పటి జడ్పీటిసిగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ టిడిపి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
2006లో నర్సింహులు పేట జడ్‌పీటీసీగా గెలిచిన సత్యవతిరాథోడ్…2009 అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్యానాయక్ పై సత్యవతి టీడీపీ టిక్కెట్‌పై గెలిచారు. ఖాళీ అయిన జడ్పీటిసి స్థానానికి జరిగిన ఉపఎన్నికలో భూక్య సంగీత పోటీ చేసి గెలిచారు. నాడు సత్యవతి రాథోడ్ కు నేడు సంగీతకు రాజకీయ ప్రత్యర్థిగా రెడ్యానాయక్ ఉండడం రాజకీయంగా చర్చనీయాంగా మారింది. కాంగ్రెస్‌లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యా నాయక్ ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ బరిలో దిగారు.
సత్యవతి రాథోడ్ జడ్పీటిసి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో..ఇప్పుడు కూడా జడ్పీటిసిగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సంగీత తప్పకుండా విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కొనసాగుతున్న సత్యవతి రాథోడ్ స్థానికసంస్థల ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాతే 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత రెండు ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. గులాబీ పార్టీలో చేరాక ఆమెకు మండలి సభ్యత్వం ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ 2014లో కాంగ్రెస్ తరపున గెలిచి తర్వాత పరిణామాల్లో గులాబీ గూటికి చేరారు. గత ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు.
ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్ ఏడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో భూక్యా సంగీతకు ఆ అదృష్టం వరించేనా అనే ప్రశ్నలు జనం నుంచి వినిపిస్తున్నాయి. డోర్నకల్ అసెంబ్లీ సీటుకు పోటీలో 14 మంది ఉన్నప్పటికి మూడు ప్రధానపార్టీల మధ్యనే పోటీ సీరియస్‌గా ఉంటుంది. మూడు పార్టీల అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి స్థాయి నుంచి చట్టసభకు ఎన్నిక అవుతారనే సెంటిమెంట్ ఏవిధంగా వర్కవుట్ అవుతుందా అనే చర్చ అయితే డోర్నకల్ నియోజకవర్గంలో జరుగుతోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…