ఫైర్ బ్రాండ్ ఆధిపత్య ప్రయత్నాలు

By KTV Telugu On 9 October, 2023
image

KTV TELUGU :-

రేణుకా చౌదరి ఫుల్ యాక్టివ్ అయిపోయారా. కాంగ్రెస్ లో ఉప కూటమి ఏర్పాటు  చేసేందుకు ప్రయత్నిస్తున్నారా. ఢిల్లీ టూ హైదరాబాద్ టు ఖమ్మం షటిల్ సర్వీస్ ప్రారంభించి రేవంత్ రెడ్డిని  టెన్షన్ పెట్టాలని చూస్తున్నారా.ఇప్పటికే రేవంత్ వ్యతిరేక గ్రూపులు పెరిగిపోవడంతో పార్టీ అధిష్టానానికి తిప్పలు తప్పడం లేదా…

రేణుక  ఎప్పుడూ ఫైర్  బ్రాండే, టీడీపీలో ఉన్నా… కాంగ్రెస్ కి వచ్చేసినా ఆమె  దూకుడుగానే ఉంటారు.  ఛాన్స్ వస్తే తానే తెలంగాణ సీఎం అభ్యర్థినని చెప్పేస్తారామె. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఆమె కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం పెత్తనం ఆయనదేనా, ఆయన కంటే ముందు నుంచి ఉన్న తమ సంగతేమిటని  రేణుకా చౌదరి ప్రశ్నిస్తున్నారట. రేవంత్  ను కొట్టేందుకు రేణుక ఇప్పుడు సామాజిక వర్గం గేమ్ ఆడుతున్నారు.తెలంగాణలో తమ కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ఆమె  కొత్త గేమ్ ప్లాన్ ను తెరమీదకు తెచ్చారు.

కాంగ్రెస్ లో ఇంతకాలం రేవంత్ కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి సహా పలువురు  పనిచేస్తున్నారు.  మల్లు రవి లాంటి వాళ్లు రేవంత్ కు  అనుకూలంగా ఉన్నప్పటికీ మొదటి  నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిలో రేవంత్ వ్యతిరేకులే ఎక్కువని చెప్పాలి. ఇప్పుడు వారి జాబితాలో మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా చేరారు. తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో కనీసం ఎనిమిది కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలంటూ ఆమె  కొత్త క్యాంపైన్ మొదలుపెట్టారు. తెలంగాణ జాబితాపై ఢిల్లీ అధిష్టానం ఫైనల్ టచ్చెస్ ఇస్తున్న తరుణంలోనే రేణుక ఒక బృందాన్ని   తీసుకెళ్లారు. పైగా నోటిఫికేషన్ కు కూడా ఎక్కువ సమయం లేనందున కమ్మ సామాజిక వర్గానికి టికెట్ల సంగతి తేల్చాలని రేణుక కోరారు. బీఆర్ఎస్ పార్టీ  కమ్మ వారికి ఐదు సీట్లు కేటాయించిందని జాబితాను కూడా అమె ఢిల్లీ తీసుకెళ్లారు.

హైదరాబద్ పరిసరాల్లో కమ్మ సెటిలర్స్ ఎక్కవుగా ఉన్నారని అక్కడ  విజయావకాశాలను  నిర్దేశించేదీ వారేనని రేణుక అధిష్టానంతో చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్  ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంఛార్జ్ మణిక్ రావు ఠాక్రేతో విడివిడిగా సమావేశమై ఆమె  కమ్మ సామాజిక వర్గం డిమాండ్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాము కోరిన  ఎనిమిది స్థానాల్లో  ఐదు హైదరాబాద్  పరిసరాల్లో కేటాయిస్తే అక్కడ వంద శాతం ఫలితాలు వస్తాయని ఆమె వివరించారు. మిగతా మూడు స్థానాలు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఇవ్వాలని ఆమె  సూచించినట్లు సమాచారం. కమ్మవారికి ఆంధ్రప్రదేశ్ మూలాలున్నప్పటికీ.. తెలంగాణలో సెటిలైన వెంటనే ఇక్కడే ఓటు హక్కు పొందారని ఆమె గుర్తుచేశారు. కమ్మవారిలో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని తగిన ప్రాధాన్యమిస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకులంగా మారతారని రేణుక వాదించారు.

రెడ్డి సామాజిక వర్గానికి బీఆర్ఎస్ 40 స్థానాలు కేటాయించింది. కాంగ్రెస్ లో కూడా ఈ సారి 25 నుంచి  30 స్తానాల  వరకు వారికి ఇచ్చే అవకాశం ఉంది. దానితో తమకు కూడా సరైన ప్రాతినిధ్యం కావాలని రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మ సామాజిక వర్గం కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ మాట ఎలా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్  కు తాము పట్టుకొమ్మలుగా ఉంటామని చెబుతోంది అంతకు మించి రేణుకా చౌదరి కోరిక మరోటి ఉంది.  కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఆధిపత్యానికి బ్రేకులు వేయాలన్న కోరిక ఆమెలో కనిపిస్తోంది. సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి