రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎందుకీ అనుమానాలు..

By KTV Telugu On 23 June, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొద్ది కాలంలోనే ఎదురుగాలి మొదలైనట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి. శకునం బాగోలేదని, కాలం కలిసి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. పైగా ప్రజల్లో అనుకున్నంతగా స్పందన కరువైందని విశ్లేషణలు  వినిపిస్తున్నాయి. నెల రోజులుగా రేవంత్ రెడ్డిలో కూడా దూకుడు తగ్గిందని ఆయనకు తెలిసిన  వాళ్లే అంటున్నారు. అందుకు కాంగ్రెస్ టైప్ పాలిటిక్స్ ఒక కారణమైతే… జనంలో  రేవంత్ రెడ్డిపై విశ్వాసం కలగకపోవడం రెండోదని చెప్పుకోవాలి. జనంలో మంచి పేరు తెచ్చుకునేందుకు ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ చాలదని, ఏదోకటి చేసి చూపించాల్సి ఉంటుందని కూడా తాజా పరిణామాలు చెబుతున్నాయి….

రేవంత్ నేతృత్వ కాంగ్రెస్  ప్రభుత్వం అధికారానికి వచ్చి ఆరు నెలలు దాటుతోంది. బొటాబొటీ మెజార్టీతో రేవంత్ రెడ్డి సీఎం  అయ్యారు. తొలి నాళ్లలో దూకుడుగా ప్రవర్తించారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వెనక్కి తప్పి తంతానని కూడా హెచ్చరించారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటి రెండు అమలు చేశారు. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెద్ద ట్రంపు కార్డుగా  భావించారు. ఇంకేముందు మహిళా  శిరోమణులంతా  తమవైపుకు  వస్తారని, తాను తిరుగులేని  నాయకుడిని అవుతానని రేవంత్ రెడ్డి ఎదురు చూశారు. పరిస్తితి మాత్రం అందుకు భిన్నంగా తయారైంది. తొలినాళ్లలో మహిళలు  ఉచిత ప్రయాణాన్ని తెగ ఎంజాయ్ చేసినా.. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఉచిత ప్రయాణంతో చిన్న ప్రైవేటు ఆపరేటర్లు దెబ్బతినడం మినహా సాధించిందేమీ లేదు.  వాళ్లంతా రేవంత్ రెడ్డికి  వ్యతిరేకమయ్యారు. కాలేజీ అమ్మాయిలకు ముందు నుంచే సబ్సిడీ ప్రయాణం ఉన్నప్పుడు  ఇక ఉచిత బస్సు ఎందుకని ప్రశ్నించే వారు ఎక్కువయ్యారు. ఇతర  గ్యారెంటీల విషయంలో రేవంత్  నిదాన వైఖరి పాటిస్తున్నారని జనం  అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాం  నుంచి ఉచితాలకు అలవాటు పడిన జనం… ఏమాత్రం ఓర్పుగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఆగస్టు 15  కల్లా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినప్పటికీ విశ్వసించేందుకు జనం సిద్ధపడటం లేదు. అంత ఆలస్యం ఎందుకంటూ అన్నదాతల్లో ఆగ్రహం పెరిగిపోయింది.  రాత్రికి రాత్రి పని జరిగిపోవాలని జనం ఎదురు చూస్తున్నారు.  పైగా ఇల్లు కట్టుకునేందుకు ఉచితంగా స్థలమూ, ఐదు లక్షల సాయం సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. మహిళల ఖాతాలో ప్రతీ నెల జమ చేస్తామన్న 2  వేల 500  రూపాయలు ఏమైందని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డిని  సమస్యలు చుట్టుముడుతున్నాయి. రుణమాఫీకి 30 వేల కోట్లు, ఇతర స్కీములన్నీ  కలిపి  అంత కన్నా సొమ్ము ఎక్కడ నుంచి తీసుకురావాలని  రేవంత్ మథనపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక  పరిస్థితి చూసుకుని ముందుకు నడవలేని స్థితిలో రేవంత్ ఉన్నారనేందుకు సందేహించకూడదు…

లోక్ సభ ఎన్నికలు కూడా ఒక రకంగా రేవంత్ కు కలిసి రాలేదు. ఇంటా బయిటా ప్రత్యర్థులు ఒకటై తనను దెబ్బతీస్తున్నారని రేవంత్ కు తెలియనిది కాదు. నిధుల విషయంలో కేంద్రం నుంచి తనకు సహకారం అందడం లేదని కూడా రేవంత్ గుర్తించారు. మౌలిక వసతులు ఇతర అంశాల్లో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా వెనుకబడిపోయిందని తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏమి చేయకుండా కోటలో పాగా వేశారని ఆగ్రహం చెందుతున్నారు….

సీఎం అయిన తర్వాత రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సొంత  ప్రాంతం మహబూబ్  నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచింది. లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 16 వస్థాయనుకుంటే కేవలం ఎనిమిది సీట్లతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రేవంత్ ను దెబ్బకొట్టేందుకే బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నాయని వార్తలు కూడా వచ్చాయి. ప్రతికూల ఫలితాలు  రేవంత్ నాయకత్వానికి మాయని మచ్చగా మారాయి. పైగా ఆయన సొంత ప్రాంతంలోనూ, గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి లోక్ సభలోనూ కాంగ్రెస్ ఓడిపోయి, బీజేపీ గెలవడం ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో పరువు పోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో రేవంత్  సక్సెస్ కాలేదన్న చర్చ మొదలైంది. ఇందులో కొంత భాగం కాంగ్రెస్ పార్టీలోని  ప్రత్యర్థులు చేస్తున్నది కూడా ఉంది. మరి కొంతేమో జనంలో పెరిగిపోతున్న అసంతృప్తి కూడా కారణమవుతోంది. రేవంత్ రెడ్డికి మిత్రుల కంటే ప్రత్యర్థులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆయన్ను దించేస్తే తాము సీఎం అవుదామని ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజనర్సింహ ఇంకొంతమంది ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఫల్యాలను గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూ తమ వాదనను  వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వెన్నుపోటు రాజకీయం కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పైగా  బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగుదామని రేవంత్ రెడ్డి చూస్తుంటే.. దానికి అడ్డు పడేందుకు పరోక్షంగా  బీజేపీ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని రేవంత్ సంకల్పిస్తే.. బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని బీజేపీలో కలిపేసుకోవాలని ఢిల్లీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ దాడులకు ఉపక్రమిస్తూ వారిని కదలకుండా చేస్తున్నారు. ఏదోక రోజున వాళ్లే బీజేపీ వైపుకు  వస్తారన్న నమ్మకంతో పాచికలు వేస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా చీల్చేందుకు వెనుకాడకూడదని బీజేపీ భావిస్తోంది. దానితో ఇప్పుడు  బీఆర్ఎస్ వారిని తెచ్చుకునేకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం రేవంత్ రెడ్డికి కత్తి మీదసాములా  తయారైంది.మరో పక్క ప్రజా సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి బాగా వెనుకబడిపోయారు. కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రేవంత్ సర్కారు కనీసం రిపేర్లు అయినా చేస్తుందని ఎదురు  చూశారు. ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. పైగా   పనులు చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చి వదిలేశారని కూడా జనంలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం కల్పించారే తప్ప కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. దానితో బస్సుల ఫ్రీక్వెన్సీ బాగా తగ్గి, రద్దీ పెరుగుతోందని జనం వాపోతున్నారు. ప్రజావైద్యం  కూడా వత్తిడిని ఎదుర్కొంటోంది. ఆస్పత్రుల్లో సదుపాయాలు బాగా  తగ్గిపోయాయి.  దానితో పేద ప్రజలకు సర్కారు  దవాఖానాలను నమ్ముకోలేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. జూనియర్ డాక్టర్లకు మూడు  నెలలుగా స్టైఫండ్ చెల్లించలేదు. వారు సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారికి చెల్లించాల్సినది వంద కోట్ల లోపే ఉంటుంది. అదే సమకూర్చలేని ప్రభుత్వం 30 వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తుందని జనం ప్రశ్నిస్తున్నారు…

బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ ను లిల్లీపుట్ ప్రభుత్వం అంటున్నారు. అంటే మరగుజ్జు అని అర్థం. రేవంత్  రెడ్డి ఏడాది కంటే ఎక్కువ రోజులు పాలించలేరని సవాలు చేస్తున్నారు.ఆయన మాటల్లో పరమార్థాలు చాలానే ఉన్నాయి. కేంద్రం మద్దతు లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల  నుంచి బయట పడేయ్యడం అంత సులభం కాదన్నది ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర సంకీర్ణంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రానికి మేలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఆ అవకాశం లేదు. అందుకే అన్ని కోణాల్లో ఆయన ప్రభుత్వ  మనుగడపై అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి