ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీ, కాంగ్రెస్ రెడీనా

By KTV Telugu On 10 February, 2023
image

తెలంగాణలో ముందస్తు ఎన్నికల చర్చ చాలా కాలంగా జరుగుతోంది. గత ఏడాది నుంచి పరిణామాలు చూస్తే కసీఆర్ ఈ సారి కూడా ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని అందరికీ అర్థమైపోతుంది. ఇప్పటికి ఆ సమయం దగ్గరకు వచ్చింది. కేసీఆర్ ప్రిపరేషన్స్ ప్రభుత్వ పరంగా పూర్తయ్యే దశలో ఉన్నాయి. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, పథకాలు మళ్లీ గెలిస్తే చేయబోయే స్కీమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. పార్టీ పరంగా కూడా అంతర్గతంగా కసరత్తు పూర్తి చేసుకున్నారు. ఈవిషయాలను బయటకు రానివ్వలేదు. అసెంబ్లీని రద్దు చేయదల్చుకుంటే చేసిన రోజునే గతంలోలా అభ్యర్థుల్ని ప్రకటించేస్తారు. మరి కాంగ్రెస్, బీజేపీ సంగతేంటి ఆ పార్టీలు రెడీగా ఉన్నాయా.

ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటిస్తారు కానీ మాటల్లో చెప్పినంత సులువు కాదు ఎన్నికలకు సిద్ధం కావడం. కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలు వచ్చినా సమయానికే ఎన్నికలు జరిగినా సిద్దమవడం అనే కసరత్తే ఉండదు. ఎన్నికల తేదీలు వచ్చాక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా అబ్యర్థుల కసరత్తు జరుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకూ ఈ పంచాయతీ జరుగుతుంది. ఇలాంటి రాజకీయ కసరత్తు ఉండే కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా పెద్దగా మార్పేమీ ఉండవు. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ఆయన చెబుతున్నారు. కానీ సీనియర్ల సహాయ నిరాకరణతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతూనే ఉన్నారు. ఆయన ఇటీవల పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే రేవంత్ కిందా మీదా పడాల్సిందే. ఎలాంటి ఉత్పాతం వచ్చినా ఆయన భరించాల్సిందే. ఎవరూ ముందుకు రారు. అధికారం దగ్గరకు వచ్చే సరికి అన్నింటికీ తామే అంటారు. అదే కాంగ్రెస్ స్పెషాలిటీ.

అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో తప్ప ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. చేరికల కోసం వేసిన మాస్టర్ ప్లాన్స్ అన్నీ విపలమయ్యాయి. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిక్కెట్లు రాని నేతలకు బీ ఫారాలు ఇచ్చి పోటీ చేయించడం మినహా ఆ పార్టీకి మరో దారి ఉండదన్న వాదన ఉంది. ఎన్నికలకు సిద్ధమని ఆ పార్టీ నేతలు భీకరమైన ప్రకటనలు చేస్తూంటారు. ఇప్పటి వరకూ ఎన్నికల దిశగా కనీస కసరత్తు జరగలేదు. ఆ పార్టీలో పాత, కొత్త నేతల పంచాయతీ తీవ్రంగా ఉంది. చివరికి టిక్కెట్ల ఖరారులోనూ కాంగ్రెస్ తరహాలో కుస్తీలు పట్టాల్సిందే. నాయకులు వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది కేసీఆర్ నిర్ణయం. అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఎలా చూసినా బీఆర్ఎస్ కేసీఆర్ గుప్పిట ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం ఆయనే. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న రెండు పార్టీలు జాతీయ పార్టీలే. వాటి నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఢిల్లీ నుంచే తీసుకోవాలి. అందుకే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తీసుకున్నంత వేగంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఇంకా చెప్పాలంటే ముందస్తుగా కసరత్తు కూడా చేసుకోలేరు. అందుకే రెండు విపక్ష పార్టీల్లోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఎన్నికల ప్రిపరేషన్స్ ప్రారంభించలేని నిస్సహాయత కనిపిస్తోంది. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని ప్రకటనలు చేస్తూ ఉంటాయి. కానీ అసలు గ్రౌండ్‌లో మాత్రం అలా ఉండదు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే సన్నాహాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే.