టీఆర్‌ఎస్‌లోకి ఈటల రాజేందర్‌ ?

By KTV Telugu On 17 November, 2022
image

ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ అంటూ ప్రచారం
ఘర్‌ వాపసీపై ఆంగ్ల పత్రికల్లో కథనాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీకి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వబోతున్నారా ? ఘర్‌ వాపసీతో కమళనాధులపై కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారా? ఈ అంశంపై డెక్కన్ క్రానికల్‌ లో వచ్చిన ఒక కథనం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ టీఆర్‌ఎస్‌ నువ్వా నేనా అన్న రేంజ్‌లో తలపడ్డాయి. పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున జరిగాయి. బీజేపీలో ఉన్న స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌లు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలో తమ పార్టీలో చేరతారని బీజేపీ కూడా ప్రకటించింది. చివరకు మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఊపులోనే బీజేపీని మరింత దెబ్బ కొట్టాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారట. టీఆర్‌ఎస్‌ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలిచారు. అప్పటినుంచి కేసీఆర్‌పై ఈటల తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు అదే ఈటల రాజేందర్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆ కథనం సారాంశం. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కూడా కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారట. ఈ విషయంపై ఈటల సన్నిహితులతో చర్చలు కూడా జరుగుతున్నాయట. అయితే ఇది నిజం కాదని ఈటలపై బీజేపీ అధిష్టానంకు అనుమానాలు కలిగేలా టీఆర్‌ఎస్‌ కావాలనే ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తోందని ఒక వాదన ఉంది. బీజేపీలో ఉన్న ముఠాతగాదాల కారణంగా ఈటలను ఎదగకుండా చేయడానికి ఆయన ప్రత్యర్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మరి కొందరి వాదన. అయితే బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఈటల కూడా అసంతృప్తిగా ఉన్నారని అందువల్ల కేసీఆర్‌ నుంచి పిలుపు వస్తే వెళ్లడానికి ఏమాత్రం సంకోచించరనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మరోవైపు సోమవారం ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కి బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో వారిద్దరూ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటలకు కేసీఆర్‌ ఆఫర్ అనే వార్తలు రావడం విశేషం. అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరూ చెప్పలేరు అనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.