కాంగ్రెస్ ను గెలిపించినా రేవంత్ సిఎం కారు

By KTV Telugu On 9 September, 2023
image

KTV TELUGU :-

మ్యాచ్ గెలిపించిన వారికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. bఒక్కో సారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎంపికలో ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సరిగ్గా ఈ సూత్రమే కాంగ్రెస్ పార్టీలోనూ తరచుగా వర్కవుట్ అవుతూ ఉంటుంది. ఎన్నికల్లో పార్టీని గెలిపించేది ఒక నేతే అయినా ముఖ్యమంత్రి పదవిని భర్తీ చేసేటపుడు మాత్రం ఈ నేతను పక్కన పెట్టి వేరే వారిని తీసుకు వచ్చి అందలం ఎక్కిస్తూ ఉంటారు. సీనియారిటీ ముసుగులో కాంగ్రెస్ నాయకత్వం అమలు చేసే ఈ సంప్రదాయం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం తెచ్చి పెట్టింది.

ప్రత్యేక తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వరుసగ రెండు ఎన్నికల్లోనూ అధికారంలోకి రాలేకపోయింది. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది.2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం అయ్యే సరికి పార్టీ శ్రేణుల్లో నీరసం వచ్చేసింది. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది బి.ఆర్.ఎస్. లో చేరిపోయారు. పార్టీ కకావికలమైపోయి ఉన్న తరుణంలో టిడిపికి చెందిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు కాల క్రమంలో పిసిసి అధ్యక్షుడు కూడా అయిపోయారు. దీంతో పార్టీలోని సీనియర్లు అలిగారు కూడా.

తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా మాణిక్ రావ్ ఠాక్రేని నియమించిన తర్వాత పార్టీలో గొడవలు సద్దుమణిగాయి. దానికి తోడు కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తెలంగాణా కాంగ్రెస్ లో హుషారు పెంచింది. క్యాడర్ లో ఉత్సాహం వచ్చింది. మొత్తానికి పార్టీ దారిలో పడింది. రోజులు గడిచే కొద్దీ తెలంగాణా కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది. దాంతో పాటే పార్టీ విజయావకాశాలు పెరుగుతోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వాటికి అనుగుణంగానే కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పెరిగింది. పాలక బి.ఆర్.ఎస్. నుంచే కాకుండా బిజెపి నుంచి కూడా నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కు నెమ్మది నెమ్మదిగా పూర్వపు వైభవం వస్తోన్నట్లే కనపడుతోంది.

కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ నాయకురాలు వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ హై కమాండ్ తో టచ్ లో ఉన్నారు. బి.ఆర్.ఎస్. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం కాబట్టే ఇలా నేతలు వలస వస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే ఒక వేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాబోయేది ఎవరన్న చర్చ మొదలైంది. పార్టీ ఘన విజయం సాధించినా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఉండవంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డికి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ పదవి దక్కుతుందే తప్ప ముఖ్యమంత్రి పదవి ఇవ్వరంటున్నారు. పార్టీలో మొదట్నుంచీ ఉన్న సీనియర్ నేతకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని వారంటున్నారు. మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ లలో ఇపుడు రేవంత్ రెడ్డి లాగే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్. అయితే ఆ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక సింధియా, పైలట్ లను కాదని కమలనాథ్, అశోక్ గెహ్లాట్ లను సిఎంలుగా చేసింది కాంగ్రెస్ హై కమాండ్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇదే రూల్ ను అమలు చేసింది కాంగ్రెస్ హై కమాండ్. 2009లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. అకాల మరణం చెందినపుడు పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో వై.ఎస్.ఆర్. తనయుడు జగన్ మోహన్ రెడ్డిని సిఎంని చేయాలని అధిష్ఠానానికి లేఖ రాసి అందరూ సంతకాలు చేశారు. అయితే సోనియా గాంధీ మాత్రం జగన్ మోహన్ రెడ్డిని కాదని సీనియర్ అయిన కొణిజేటి రోశయ్యను సిఎంని చేశారు. 2004లో యూపీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్ధితి వచ్చినపుడు కూడా రాహుల్ గాంధీని కాదని సీనియర్ అయిన మన్మోహన్ సింగ్ ను ప్రధాని పీఠం పై కూర్చోబెట్టారు సోనియా గాంధీ. ఆ సంప్రదాయాన్నే తెలంగాణాలోనూ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి