బీజేపీలోకి పీజేఆర్‌ వారసుడు ?

By KTV Telugu On 30 December, 2022
image

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ నేతలు దూకుడు పెంచేశారు. పార్టీని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఏడాది పాటు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టాలని బీజేపీ అధిష్ఠానం ఇదివరకే నిర్ణయించింది. మిషన్ 90 తెలంగాణ 2023 పేరుతో కార్యాచరణ మొదలు పెట్టింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 90 స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ మిషన్ లక్ష్యం. పార్టీ బలహీనంగా ఉన్న 45 స్థానాల్లో బలమైన నాయకులను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు పి. జనార్దన్‌రెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దర్ రెడ్డితో బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇటీవల పి. జనార్ధన్‌రెడ్డి వర్ధంతి రోజున నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్‌ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపి మధుయాష్కీ మాత్రమే వెళ్లారు. బీజేపీ నుంచి నిజామాబాద్‌ ఎంపి ధర్మపురి అరవింద్‌, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి హాజరు కావడం చర్చనీయాంశమైంది. డి.కె. అరుణకు కూడా ఆహ్వానం అందినా శిక్షణా తరగతుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు. ఇటీవల కాంగ్రెస్‌ నేతలపై కన్నేసిన కమలనాథులు ఇప్పటికే విన్ణువర్ధన్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో బీజేపీలో చేరడానికి ఆయన సిద్ధమయినట్లు సమాచారం. కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విష్ణు కొత్త సంవత్సరంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అని భావిస్తున్నారు. ఇటీవల ఆయన సోదరి విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు.