కాంగ్రెస్ వైపు పొంగులేటి.. రాహుల్ ఓపెన్ ఆఫర్

By KTV Telugu On 18 April, 2023
image

కర్నాటక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణాపై దృష్టి సారించనున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. కర్నాటకలో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఈ ఏడాది చివర్లో తెలంగాణాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మకంగా ఉంది. ఈ క్రమంలోనే తెలంగానాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గాంధీలు భావిస్తున్నట్లు సమాచారం. కర్నాటక ఎన్నికల ప్రచారంలో వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో టి. కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణా రాజకీయాల గురించి ఆరా తీసిన రాహుల్ గాంధీ బిఆర్ఎస్ తో మనకి ఏ విధమైన పొత్తూ ఉండే ప్రసక్తే లేదన్న సంకేతాలు జనంలోకి బాగా వెళ్లాలని ఆదేశించారు. కర్నాటక ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత తెలంగాణాపైనే ఎక్కువగా దృష్టి సారిస్తామని రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చెప్పారు. వచ్చే మే నెలలో తెలంగాణా వస్తానని వారితో అన్నారు. రాహుల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో సంతోషం పెల్లుబికింది.

రాహుల్ గాంధీ కర్నాటక ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతోన్న సమయంలో ఆయన కనుసన్నల్లో పనిచేసే బృందాలు మాత్రం తమకి అప్పగించిన పనులను చేసుకుపోతున్నాయి. అందులో ఒక టీం తెలంగాణాలో ఓ బృహత్ కార్యక్రమాన్ని నెరవేర్చేసింది కూడా. ఖమ్మం జిల్లా వెళ్లిన రాహుల్ టీం అక్కడ ఇటీవల బి.ఆర్.ఎస్. నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా మిమ్మల్ని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మీరు తప్పకుండా రావాలి అని పిలిచారట. పొంగులేటి తమతో ఉంటే ఖమ్మం జిల్లాను పూర్తిగా క్లీన్ స్వీప్ చేయచ్చని కాంగ్రెస్ నాయకత్వం నమ్ముతోంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటికి ఉన్న గ్లామర్ ఆయనకున్న ఆర్ధిక బలం సామాజిక బలం అన్నీ కూడా కాంగ్రెస్ కు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా పొంగులేటి ఏ పార్టీకి వెళ్తారోనన్న చర్చ జరుగుతోంది. ఆయన బిజెపిలోకి వెళ్తారని ఓ ప్రచారం ఉంది. ఎందులోకి వెళ్లాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని తమ అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి అన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు మంచి బలమైన క్యాడర్ ఉందంటున్నారు రాజకీయ పండితులు. బిజెపికి అక్కడ చెప్పుకోదగ్గ కార్యకర్తలే లేరన్నది వారి వాదన. ఇక బి.ఆర్.ఎస్. కూడా ఇంత వరకు ఖమ్మంలో పుంజుకోలేదంటున్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుండి కాంగ్రెస్ తరపున గెలిచి బి.ఆర్.ఎస్.లో చేరారు కొందరు ఎమ్మెల్యేలు.

అయితే క్యాడర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని వారు కాంగ్రెస్ జెండానే మోస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తనను బి.ఆర్.ఎస్. నాయకత్వం సస్పెండ్ చేసిన సమయంలో వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలోని మొత్తం 10 స్థానాల్లో ఏ ఒక్కదాంట్లోనూ బి.ఆర్.ఎస్. అభ్యర్ధి గెలిచే ప్రసక్తే లేదని పొంగులేటి సవాల్ విసిరారు. ఒక్కరంటే ఒక్క బి.ఆర్.ఎస్. అభ్యర్ధి కూడా ఖమ్మం నుండి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి బలం తెలుసు కాబట్టే రాహుల్ గాంధీ టీం ఆయన్ను బిజెపి తన్నుకుపోకుండా ముందస్తుగా జాగ్రత్త పడింది. ఖమ్మం జిల్లా మొదట్నుంచీ కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలకు కోటలా ఉంటోంది. ఇక్కడ ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. ఇక్కడ బి.ఆర్.ఎస్. కు పూర్తి బలం లేదు కాబట్టే కమ్యూనిస్టు పార్టీలు బి.ఆర్.ఎస్.తో పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ మాత్రం కమ్యూనిస్టు పార్టీలకు అసెంబ్లీలో స్థానాలు ఇచ్చినా వారు పోటీ చేయలేరు కాబట్టి కామ్రేడ్లు బేషరతుగా బి.ఆర్.ఎస్.కు మద్దతు ఇస్తే అధికారంలోకి వచ్చాక ఓ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇద్దాంలే అని పార్టీ సీనియర్ నేతలతో చర్చల సందర్భంగా అన్నారని సమాచారం.

బి.ఆర్.ఎస్. పొత్తుకు నై అంటే కాంగ్రెస్ తో పొత్తుకు కూడా కమ్యూనిస్టులు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం నుండి భట్టి విక్రమార్క భద్రాచలం నుండి సొదెం వీరయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే సిటింగ్ స్థానాలైన మధిర భద్రాచలం మినహా మిగతా 8 నియోజకవర్గాల్లో పొంగులేటి చెప్పిన వారికే టికెట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అటు పొంగులేటి అనుచరులు కూడా కాంగ్రెస్ తో పోతేనే మనకి మంచిదని అంటున్నారట. బిజెపికి బలం లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లడం కన్నా కాంగ్రెస్ లో చేరితేనే బెటరని పొంగులేటి శ్రేయోభిలాషులు కూడా సూచిస్తున్నారట. ఇక పొంగులేటి తనంతట తానుగా ఈ విషయంపై ప్రకటన చేయడమే తరువాయి. ఈ విషయంలో ఎక్కువ ఆలస్యం చేయడానికి కూడా సమయం లేదు. ఎందుకంటే ఏప్రిల్ లో సగం నెల అయిపోయింది. అక్టోబరు లో ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లోపునే ఎందులో చేరేదీ స్పష్టం చేసేస్తే ఆ నియోజకవర్గాలన్నింటా ప్రచారం చేసుకోవలసి ఉంటుంది.

ఖమ్మం జిల్లా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోన్న పొంగులేటి ఖమ్మంలో సత్తా చాటగలిగితే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇంకో అనుకూల అంశం ఏంటంటే ఖమ్మంలో పొంగులేటి రాకను వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు కూడా ఎవరూ లేరు. అది అసలు సిసలు అడ్వాంటేజ్. ఒక వేళ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోతే పొంగులేటి ద్వారానే మరో బి.ఆర్.ఎస్. బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావును కూడా కాంగ్రెస్ లో చేర్పించాలన్నది హస్తం నేతల వ్యూహంగా చెబుతున్నారు. ఆయనకు కూడా బిజెపి కన్నా కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుందని అంటున్నారు. మే నెలలో రాహుల్ గాంధీ తెలంగాణా రానున్నారు. బహుశా అప్పుడే ఈ ఇద్దరు నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరచ్చని అంటున్నారు.