నోటి దూలకు సారీతో సరిపెట్టుకుంటున్నారు. రాజకీయ నాయకులంటేనే ఇష్టానుసారం మాట్లాడతారని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థులపై ఆరోపణలు అనే బండ రాళ్లు విసిరేందుకు వాళ్లు ఎలాంటి డైలాగులకైనా వెనుకాడరు. పైగా మంచి చెడూ రీజనింగ్ లేకుండా మాట్లాడేస్తుంటారు. అంతగా రివర్స్ అయితే ఒక సారితో అన్ని సరిపెట్టేస్తారు. ఎందుకంటే సమాజం వీక్ నెస్ వాళ్లకు తెలుసు. సారీతో జనం కరిగిపోతారని రాజకీయకులు ఎప్పుడో గుర్తించారనేందుకు తాజాగా రెండు ఉదంతాలే ఉదాహరణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…మంచి స్పీకర్ అని అందరికీ తెలుసు. పైగా ఆవేశంగా మాట్లాడే తెలంగాణ నాయకుల్లో ఆయన కూడా ఒక్కరూ. ఎవరినీ ఎంత మాట అయినా ఆయన అనగలరు. రోజుకు మూడు పూటలా కాంగ్రెస్ పై విరుచుకుపడే నాయకుల్లో కేటీఆర్ నెంబర్ వన్ అని చెప్పాలి. కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న వేళ… కేటీఆర్ అన్నీ తానై నడిపిస్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ పవర్ ఫుల్ స్పీచులు ఇస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న కేటీఆర్.. ఈ క్రమంలో నాలుగు మాటలు కూడా జారుతున్నారు. మహిళలకు ఉచిత బస్సుల వ్యవహారాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. బ్రేకు డ్యాన్సులు వేసుకోమనండి మాంకేంటి కష్టం అన్న డైలాగ్ వదలడంతో కాంగ్రెస్ మహిళలు గట్టిగా పట్టుకున్నారు. కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. మీడియా ముఖంగా ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ మహిళా కమిషన్ ఆయన్ను పిలిపించి నిలదీసింది. అక్కడ కూడా ఆయన విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైచేయిగా నిలిచినప్పటికీ సకాలంలో సారీ చెప్పడంతో కేటీఆర్ పెద్దగా పోగొట్టుకున్నదేమీ లేదన్నది బీఆర్ఎస్ వర్గాల వాదన. ఈ లోపు కవిత బెయిల్ వ్యవహారం డామినేట్ చేయడంతో కేటీఆర్ కామెంట్స్ వివాదం పక్కకెళ్లిపోయింది…
తెలంగాణలో ఏడాది కాలంగా రాజకీయ పార్టీల మధ్య యుద్ధం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలతో యుద్ధం ఆగుతుందని అంతా భావించారు. కానీ, ఎన్నికల తర్వాత మరింత పెరిగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎక్కడా తగ్గడం లేదు. నువ్వు ఒకటి అంటే.. నేను నాలుగు అంటా అన్నట్లు మాటల తూటాలు పేలుస్తున్నారు. కొద్ది రోజులుగా వివిధ అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయాలు తిరుగుతున్నాయి. కవిత బెయిల్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వదిలిన ఒక డైలాగ్ పెద్ద దుమారమే రేపింది. సుప్రీం కోర్టు కూడా దానిపై సీరియస్ అయ్యిందంటే అది ఎంత పవర్ ఫుల్ డైలాగో అర్థం చేసుకోవచ్చు…
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – బీఆర్ఎస్ మధ్య అంతరంగిక ఒప్పందం కుదిరిందంటూ లిక్కర్ స్కామ్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్ ఆ విషయంలో సక్సెస్ అయింది.హస్తం పార్టీ ఎనిమిది లోక్ సభా స్థానాలను దక్కించుకుంది. తాజాగా కవిత బెయిల్‌కు బీజేపీ సహకారం అందించిందని అంటూ దీనిని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలనుకుంటోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని.. కానీ కవితకు కేవలం ఐదు నెలల్లోనే బెయిల్ ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓటు షేరింగ్ చేసినందుకు ప్రతిఫలంగానే కవితకు బెయిల్ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగని తానేమీ కవితకు బెయిల్ రావడాన్ని తప్పుబట్టడంలేదంటూనే.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సుప్రీం కోర్టును తప్పుపట్టేలా ఉండటంతో న్యాయమూర్తులు సీరియస్ అయ్యారు. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బెయిల్ ఇస్తామా అంటూ.. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులను జస్టిస్ గవాయి తిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి.. సుప్రీం కోర్టు పట్ల గౌరవంగా ఉండాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రమూ సరికాదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది . దీనితో దిగివచ్చిన రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పుకున్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రతపై తనకు పూర్తి గౌరవం, విశ్వాసం ఉందన్నారు. రాజ్యాంగం, దాని విలువలను తాను నిత్యం గౌరవిస్తానని, ఎన్నటికీ న్యాయ వ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు…
నిజానికి ఏదోటి మాట్లాడటం, తర్వాత తప్పని సరి పరిస్థితుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సారీ చెప్పడం మన నేతలకు అలవాటుగా మారంది. ఇలాంటి పద్ధతులకు స్వస్థి చెప్పి.. ఎప్పుడు గౌరవప్రదంగా వ్యవహరిస్తారో చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…