తెలంగాణ ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లో అంటే చివరి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా వద్ద బాండ్లు వేలం వేసి రూ. 6572 కోట్లను రుణాలను సేకరించబోతోంది. ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతి లభించిది. అంటే దాదాపుగా ప్రతీ నెలా రూ. 2200 కోట్లు అనుకోవచ్చు. ఓ వైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను అమ్ముతోంది. మరో వైపు అప్పులు చేస్తోంది. కానీ ఆర్థిక సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. సమయానికి జీతాలివ్వలేని పరిస్థితి ఉందని స్వయంగా ఆర్థిక మంత్రి హరీష్ రావే ప్రకటించారు. ఎందుకీ పరిస్థితి? సంక్షేమం హద్దులు దాటిపోతోందా? ఓటు బ్యాంక్ లెక్కలతో నేల విడిచి సాము చేస్తున్నారా? సరిదిద్దాల్సిన అధికార యంత్రాంగం కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటోంది.
తెలంగాణ ప్రభుత్వ ఆదాయం అంచనాలకు మించి పెరుగుతోంది. తెలంగాణకు కల్పతరువు హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం. హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయంతో తెలంగాణ సంపన్న రాష్ట్రంగా ఉంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డుల బద్దలు కొడుతోంది. కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్ లో మద్యం అమ్మకాలు వేల కోట్లకు చేరిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కన ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల ఆదాయం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భూములు అమ్మడం ద్వారా రూ. వెయ్యి కోట్లకుపైగా ఆదాయాన్ని సంపాదించుకున్నారు. ఓ రకంగా ఇంత ఆదాయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ తెలంగాణ ప్రభుత్వం అప్పులపై నియంత్రణ విధించడం వల్లనే సమస్యలు వచ్చాయని వాదిస్తోంది.
ముఖేష్ అంబానీ అయినా తన ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చు పెట్టకపోతే అప్పుల పాలవుతాడు. అంటే ఆర్థిక సమస్యలు రావడానికి ధనవంతుడు అనే ట్యాగ్ ఆటంకం కాదు. ఎంత ధనం ఉంటే అంత లోపే ఖర్చు పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు రావు. అంత కంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటేనే వస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సర్కార్ ది అదే పరిస్థితి . తమది సంపన్న రాష్ట్రమని తెలంగాణ సర్కార్ ఎంత చెబుతున్నా ఆదాయానికి మించి అప్పులు చేసి ఖర్చు చేయడం వల్ల సమస్య వస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల కోసం అలవిమాలిన విధంగా ఖర్చు పెట్టడం వల్లనే ఈ సమస్య వస్తోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రజలకు రూ. లక్షల్లో పంచాలనుకుంటోంది. అలాంటి పథకాల వల్లనే ప్రస్తుతం తెలంగాణ అప్పల పాలవుతోందని అనుకోవచ్చు.
రూపాయికి ఒకటే విలువ ఉండదు. లక్షాధికారి రూపాయికి ఓ విలువ ఉంటుంది. పేదవాడి రూపాయికి మరో విలువ ఉంటుంది. అలాగే కష్టపడి సంపాదించుకునే రూపాయికి ఓ విలువ ఉంటుంది. ఉచితంగా వచ్చే రూపాయికి అసలు విలువ ఉండదు. ఎందుకంటే ఆ రూపాయి సంపాదన కష్టం తెలియనప్పుడు దాన్ని దుర్వినియోగం చేయడమే ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దళిత బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల సాయం చేస్తోంది. హుజూరాబాద్ లో దళిత కుటుంబాలన్నింటికీ పంచేశారు. ఇతర చోట్ల కూడా అమలు చేస్తున్నారు. నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున రూ. పది లక్షలు పంచుతున్నారు. అయితే స్వయం ఉపాధి కల్పిస్తున్నామని చెప్పుకోవచ్చు కానీ అదంతా ఉచితంగానే ఇస్తున్నారు. వాటితో ఆ కుటుంబాలు బాగుపడుతున్నాయని ప్రచారం చేసుకోవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది చాలా చేటు చేసుకుంది. ఆ విషయం ఎవరికైనా సులువుగా అర్థమైపోతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ముందూ వెనుకా ఆలోచించుకండా అప్పులు చేసి రూ. పది లక్షలు పంచేస్తోంది. త్వరలో ఇతర వర్గాలకూ పంచుతానంటోంది.
రైతు బంధు పేరుతో ఎకరానికి రూ. పది వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇదందా భూ యజమానులకే. ఈ విడతకు దాదాపుగా రూ. ఏడున్నర వేల కోట్లు జమ చేసింది. అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లోనూ రైతులకు ఈ సొమ్ము జమ చేశారు. కానీ ఈ సాయం పొందిన వారిలో నిజమైన రైతులు ఎంత మంది? తెలంగాణలో భూమి ఉన్న రైతుల్లో వ్యవసాయం చేస్తున్న వారు సగం మంది కూడా ఉండరని ప్రభుత్వ వర్గాలే చెబుతూంటాయి. భూమిని ఎక్కువ మంది కౌలుకు ఇచ్చుకున్నారు . నిజంగా రైతులకు సాయం చేయడం మంచిదే కానీ. రైతుల పేరుతో సాయం తీసుకుంటున్న వారి సంగతేంటి? ప్రభుత్వం అప్పులు చేసి మరీ వారికి ఎందుకు నగదు బదిలీ చేయాలి? రైతు బంధులో ఏటా రెండు విడతలుగా పంపిణీ చేస్తున్న పధ్నాలుగు వేల కోట్లలో సగం రైతులు కాని వారి ఖాతాల్లోనే చేరుతున్నాయనేది రుజువు చేయాల్సిన అవసరం అంశం. అప్పులు చేసి భూములు అమ్మి మరీ ఇలా చేయడం ఎందుకు?
సంక్షేమం అంటే ఓటు బ్యాంక్ అని రాజకీయ పార్టీల భావన. ప్రజలకు డబ్బులిచ్చేస్తే ఓట్లు వేస్తారనే భావన ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. మూడో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా అందుకే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి బంధు పథకాలను అమలు చేస్తున్నారు. కానీ దీని వల్ల ఎంత మేలు జరుగుతుందో చెప్పడం కష్టం . దీనికి హుజూరాబాదే సాక్ష్యం. ఎందుకంటే ప్రజలకు రూపాయి ఇస్తే పది రూపాయలు కోరుకుంటారు. పది ఇస్తే వంద కోరుకుంటారు. ఈ ఆశ అనంతం. ఈ ఆశను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి. అందు కోసం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన పని లేదు. దురదృష్టవశాత్తూ తెలంగాణలో అదే జరుగుతోంది.