మునుగోడు ఉప ఎన్నిక ఖ‌ర్చు ఎంతో తెలుసా ?

By KTV Telugu On 13 November, 2022
image

ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలనేది ఎన్నికల సంఘం పరిమితి పెట్టింది. కానీ ఆ పరిమితికి మించి కొన్ని వందల రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తారనేది అందిరికీ తెలుసు.
ఇటీవ‌ల జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోరులో అన్ని పార్టీలూ క‌లిపి సుమారు 627 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టాయ‌ని అంచ‌నా వేస్తోంది ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ ఈ ఉప ఎన్నిక‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వ శక్తులు ఒడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం అత్యధికంగా ఖర్చు పెట్టినట్లు రికార్డులకు ఎక్కింది. ఆ రికార్డును మునుగోడు ఉప ఎన్నిక బ్రేక్‌ చేసింది.

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా చేసిన రాజీనామాతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక కోసం వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖర్చు చేస్తారనే అంచనాలు మొద‌టి నుంచే ఉన్నాయి. మునుగోడులో క‌నీసం రెండు ల‌క్ష‌ల ఓట్లు ఉంటే ఒక్కో ఓటుకు అన్ని పార్టీలూ క‌లిపి ముప్పై వేల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేసినట్లు మొదట అంచనా వేశారు. ఆ లెక్కన ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది అనుకున్నారు. అయితే ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అంచ‌నాల ప్ర‌కారం మునుగోడులో అన్ని పార్టీలూ క‌లిపి దాదాపు 627 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాయి. ఓటుకు స‌గ‌టున 9 వేల రూపాయ‌లు ఇచ్చిన‌ట్టుగా ఈ సంస్థ అంచ‌నా వేసింది. దాదాపు 75 శాతం ఓట‌ర్ల‌కు ఈ సొమ్ములు అందాయ‌ని త‌మ అధ్య‌య‌న వివ‌రాల‌ను అందించింది.

మరోవైపు నెలరోజులుగా మునుగోడులో మ‌ద్యం ఏరులై పారింది. దాదాపు మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు మ‌ద్యం పంప‌కాలే జ‌రిగాయని కూడా ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అంచ‌నా వేసింది. ఇవికాకుండా అన్ని పార్టీలు భారీ ఎత్తున ర్యాలీలు ఎన్నిక‌ల ప్ర‌చారాలు నిర్వ‌హించాయి. వీటికి వంద కోట్ల రూపాయ‌ల పైనే ఖ‌ర్చు అయి ఉంటుంద‌ని, ఒక్కో ర్యాలీకి రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు అనుకున్నా అన్ని పార్టీలకు కలిపి యాభై ర్యాలీల వ‌ర‌కూ జ‌రిగి ఉంటాయి, ఈ లెక్కన వాటికి 125 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చయి ఉంటుందని అంచ‌నా వేసింది. మొత్తానికి మునుగోడు ఖ‌ర్చు 627 కోట్ల రూపాయ‌ల‌ని ఈ సంస్థ లెక్క‌గ‌ట్టింది.