కాంగ్రెస్ -వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీల మధ్య డీల్ ఎక్కడ చెడింది? కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం అవుతుందంటూ జరిగిన ప్రచారానికి భిన్నంగా వ్యవహారాలు నడవడానికి కారణం ఏంటి? తెలంగాణాలో మొత్తం 119 నియోజక వర్గాల్లోనూ అభ్యర్ధులను నిలబెతామని వై.ఎస్.షర్మిల ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణాలో రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.టి.పి. ప్రభావం ఏమేరకు ఉంటుంది? అసలు షర్మిల పార్టీ తరపున పోటీ చేయడానికి ఎన్ని నియోజక వర్గాల్లో అభ్యర్ధులు దొరుకుతారు అన్నది కూడా ప్రశ్నే.
తెలంగాణాలో వై.ఎస్.ఆర్. సంక్షేమ పాలన తీసుకురావాలన్న లక్ష్యంతో దివంగత వై.ఎస్.ఆర. తనయ వై.ఎస్. షర్మిల రెండేళ్ల క్రితం వై.ఎస్.ఆర్.తెలంగాణా పార్టీని స్థాపించారు. ఆ వెంటనే పాదయాత్ర కూడా చేపట్టారు. ఆ పాదయాత్రకు స్పందనకూడా బానే వచ్చింది.
బి.ఆర్.ఎస్. ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ వచ్చారు షర్మిల. కొద్ది నెలల క్రితమే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో వై.ఎస్. షర్మిల బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ ను కలిసి శుభాకాంక్షలు వ్యక్తం చేశారు. అప్పుడే ఆమె కాంగ్రెస్ లో చేరతారని..ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తారని ప్రచారం జరిగింది.
కొద్ది వారాల క్రితం షర్మిల ఢిల్లీ వెళ్లి టెన్ జన్ పథ్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అది రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరహాలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారని మళ్లీ ప్రచారం ఊపందుకుంది. దానికి బదులుగా షర్మిలకు కర్నాటక కోటాలో రాజ్యసభ సీటు ఇస్తారని ఒక ప్రచారం..కాదు కాదు ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారని మరో ప్రచారం జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు నియోజక వర్గంపై మంచి పట్టు ఉంది.
వై.ఎస్.షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న వార్తలు రాగానే తెలంగాణా కాంగ్రెస్ లో వై.ఎస్. వ్యతిరేక వర్గీయులు ఆమె రాకను వ్యతిరేకించారు.
షర్మిల కాంగ్రెస్ లోకి రావాలనుకుంటే పోయి ఆంధ్ర ప్రదేశ్ లో చేరాలి తప్ప తెలంగాణాలో ఆమె చేరిక వద్దే వద్దు అని వారు నినదించారు. తెలంగాణా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా షర్మిలను తెలంగాణా కాంగ్రెస్ లో చేర్చుకోవడం మంచిది కాదని సూచించారు. ఆమెను తీసుకుంటే.. బి.ఆర్.ఎస్. అధినేతకు బ్రహ్మాస్త్రాన్ని అందించినట్లు అవుతుందని రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
తాను చేరితే తెలంగాణా కాంగ్రెస్ లోనే చేరతానని ఏపీ లో రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని షర్మిల కాంగ్రెస్ అధినాయకత్వానికి క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కచ్చితంగా తెలంగాణా నుంచే పోటీ చేస్తానని..అది కూడా పాలేరు సీటే కావాలని షర్మిల పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది. దానికి కాంగ్రెస్ హై కమాండ్ ఒప్పుకుందా లేదా ? అన్నది మాత్రం బయటకు రాలేదు. రేపో మాపో కాంగ్రెస్ తొలి జాబితాలో షర్మిల పేరు కనిపిస్తుందని ఆమె అనుచర గణం అనుకుంటోన్న తరుణంలో హఠాత్తుగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో మొత్తం 119 నియోజక వర్గాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని షర్మిల ప్రకటించడం సంచలనం అయ్యింది. తాను పాలేరు నుండి పోటీ చేస్తానన్న షర్మిల తన తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్ లు కూడా పోటీ చేయాలని చాలా మంది అడుగుతున్నారని వీలును బట్టి ఆ విషయంపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు.
పాలేరు తో పాటు మరో నియోజక వర్గం నుంచి కూడా పోటీచేయాలని షర్మిల భావిస్తున్నారు. ఇక మిగతా నియోజక వర్గాల్లో ఆసక్తి కలిగిన నాయకులు పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆమె పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదన్న భావనతో ఉన్నానని షర్మిల అన్నారు. తెలంగాణాలో దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డికి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ఆ ఓటు బ్యాంకు కోసమే షర్మిలను కాంగ్రెస్ హై కమాండ్ చర్చలకు పిలిపించి ఉండచ్చని అందరూ అనుకున్నారు. అయితే చివరి నిముషంలో కాంగ్రెస్ తో డీల్ ఖరారు కాకపోవడంతో షర్మిల ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చిందని అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…