గంగుల చూపు అటా ఇటా?

By KTV Telugu On 11 July, 2024
image

KTV TELUGU :-

కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ఇబ్బంది పడుతున్నారట. అధికారం అండ అవసరం కావటంతో కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతున్నారంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఆయన మాత్రం నేను పార్టీ మారడంలేదని గట్టిగా చెబుతున్నారు. కాని రాష్ట్రంలో జంప్ జిలానీల కాలం నడుస్తోంది గనుక ఆయన మాటలు ఎవరూ నమ్మడంలేదు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం.

కరీంగనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు తెలియనివారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరూ ఉండరు. వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికై జిల్లాలో ఎవరూ సాధించని ఘనతను గంగుల సాధించారు. గులాబీ బాస్ కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన కమలాకర్ ఇపుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. జిల్లాలో ఆయన సన్నిహితులు, మిత్రులు అంతా కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులు అనుభవిస్తున్నారు. గంగుల కమలాకర్‌ రాజకీయ ప్రత్యర్థి, కుటుంబానికి సన్నిహితుడు అయిన బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర మంత్రి అయ్యారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి అయ్యారు. కాని తాను మాత్రం ప్రతిపక్షంలో ఉండటం కొంచెం ఇబ్బందిగా ఫీలవుతున్నారనే టాక్ నడుస్తోంది. గంగుల గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, ఆయన సన్నిహితుడు, సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నా.. ఎవ్వరితో సంబంధం లేకుండా…బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాను తలపెట్టిన మానేరు రివర్  ఫ్రంట్ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నారు.

నియోజకవర్గంలో పనులన్నీ ప్రభుత్వం ద్వారా గంగుల చేయించుకోగలుగుతుండటంతో కరీంనగర్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతున్నారంటూ ఈ మధ్య ప్రచారం మరింతగా ఊపందుకుంది. అయితే, గంగులపై గ్రానైట్ కంపెనీకి సంబంధించి ఐటీ కేసులు ఉండటంతోనే ఆయన కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు చూస్తున్నారనే వాదనా వినిపిస్తోంది.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజకీయ ప్రత్యర్థే కాని..కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారా కమలం గూటికి చేరే వీలుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తానెక్కడికి వెళ్లడం లేదని పదే పదే చెబుతున్నా పార్టీ మారుతున్నట్టు మీడియా ప్రచారం చేస్తోందని గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆగస్ట్ నుంచి తమ నిరసనలతో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టుగా కూడా గంగుల ప్రకటించారు.

ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ కూడా తాము కారు దిగుతున్నట్లు చెప్పలేదు. పైగా ఫిరాయిస్తున్నట్లు లీకులిచ్చి..తాము ఖండిస్తున్నారు. ఆ తర్వాత పార్టీ మారిపోతున్నారు. కొన్నాళ్ళుగా జరుగుతున్న తంతు ఇదే. మరి గంగుల కమలాకార్ దారెటు అనేది మరికొద్ది రోజులాగితే స్పష్టత వస్తుందంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి