ఆ ఛాన్స్ ఎవరికో.. కేసీఆర్ కు కత్తిమీద సాము

By KTV Telugu On 1 May, 2023
image

కౌశిక్ రెడ్డి వ్యవహారంలో రచ్చ జరగడంతో కేసీఆర్ ఇప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో ఆచి తూచి అడుగులు వేయబోతున్నారు. పోయిన సారి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ తమిళిసై నిలుపుదల చేయడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. అనర్హులకు అవకాశాలిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ సారి అలాంటి చర్చకు తావు లేకుండా చూసుకోవాలని గులాబీ దళపతి డిసైడయ్యారు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నియమించాలన్న టెన్షన్ కూడా కేసీఆర్ కు తప్పడం లేదు. ఎందుకంటే ఇదీ ఎన్నికల సంవత్సరం. ఎవరికీ కోపం రాకుండా చూసుకోవాలి. అసంతృప్తి పరులను తమ వైపు తిప్పుకునేందుకు రెండు ప్రత్యర్థి పార్టీలు ఎదురు చూస్తున్నాయి. పైగా ఒక సారి ఎమ్మెల్సీ ఇస్తే వారితో పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనం కలగాలి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వారికి ఎమ్మెల్సీ నామినేషన్ ఇవ్వాలి. అందుకే ఇప్పుడు తెలంగాణ సీఎం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎవరూ అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో ఊపందుకుంది. మే 27 తో గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సంబంధించి త్వరలో క్యాబినెట్ సమావేశం కానుంది. అనంతరం అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి రాజేశ్వరరావు. ముస్లిం మైనార్టీ నుంచి ఫారుక్ హుస్సేన్ మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో రిటైరవుతున్న ఇద్దరికీ మరోసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కూడా కేసీఆర్ కు కత్తిమీద సామే అవుతోంది. సామాజిక సమీకరణాలను సంతృప్తి పరచడంతో పాటు గవర్నర్ వెంటనే ఆమోదించేలా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో గత అనుభవానే పునరావృతమవుతాయి. నిజానికి వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారు. ఈసారి విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వారికి యువకులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట.పైగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లపై బిఆర్ఎస్ లో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. బిఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది.

బిఆర్ఎస్వీ ప్రెసిడెంట్ గా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు హుజూరాబాద్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు. తాజాగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి గెల్లు శ్రీనివాస్ కు ఇచ్చారు. దీంతో ఇప్పుడు విద్యార్థి సంఘం నుంచి ప్రస్తుతం బిఆర్ఎస్వీ లో యాక్టివ్ గా పని చేస్తున్న తుంగబాలు పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో విద్యార్థి నేతగా ఉండి ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్న రాజారాం యాదవ్ చిరుమల్ల రాకేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో మరో సీటును రాజకీయ నేపథ్యం ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విద్యావేత్త పార్టీ సీనియర్ నేత పిఎల్ శ్రీనివాస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ లో ఒకరికి ఛాన్స్ రావచ్చని అంటున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఉద్యమకాలంలో ఆయన పార్టీకి అండగా ఉన్నారు. టీఎస్పీఎస్సీని ఎలాంటి వివాదాలు లేకుండా నడిపించారు. మరోవైపు పార్టీలో చేరిన చాలామంది నేతలకు సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారు. దీంతో వారంతా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. మరి ఎవరికి ఇచ్చినా తమిళిసై ఎలా స్పందిస్తారో చూడాలి.