తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై మధ్య కొద్దిరోజుల నుంచి కొనసాగుతున్న ఘర్షణ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని గవర్నర్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు కూడా చేస్తున్నారు. బీఆర్‌ఎస్ మంత్రులు ఇతర నేతలు కూడా తమిళిసైని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పది బిల్లులను ఆమోదించకుండా తనవద్దే అట్టిపెట్టుకోవడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. వెంటనే బిల్లులను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటీషన్ దాఖలు చేసారు. సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రిట్ పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. సీఎస్ తనపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు గవర్నర్ తమిళిసై. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరే ఉందని సీఎస్ శాంతికుమారిపై విమర్శలు కురిపించారు.
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అధికారికంగా రాజ్‌భవన్‌ని సందర్శించడానికి మీకు సమయం దొరకలేదు. ప్రోటోకాల్ పాటించడం లేదు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నా ఢిల్లీ కంటే రాజ్‌భవన్ మీకు సమీపంలో ఉంది అని ట్వీట్ చేశారు. స్నేహపూర్వక చర్చల ద్వారానే బిల్లులు ఆమోదం పొందుతాయని గవర్నర్ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన పని లేకుండా రాజ్‌భవన్‌కు వచ్చి తనతో మాట్లాడితే సమస్య పరిష్కారం అయిపోతుందని గవర్నర్ ట్వీట్ సారాంశం. అందుకే ఢిల్లీలో ఉన్న సుప్రీం కోర్టు కంటే రాజ్‌భవ్ దగ్గర అని తమిళిసై ట్వీట్ చేశారని భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసం కోసం గవర్నర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని తమిళిసై యధాతధంగా చదవటం తో విభేదాలు సమసిపోయినట్లే అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ప్రభుత్వం గవర్నర్‌పై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు గవర్నర్ చీఫ్ సెక్రటరీపై చేసిన ట్వీట్లతో ఇది మరో మలుపు తిరిగింది. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ సీఎస్ శాంతి కుమారిని రాజ్ భవన్ కు పంపిస్తారా లేకపోతే సుప్రీం కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గవర్నర్‌పై సీఎస్ దాఖలు చేసిన పిటీషన్ ను హోలీ సెలవుల తరువాత విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.