కేసీఆర్‌కి క్లారిటీ వచ్చేసింది. గవర్నర్‌కి ఆదేశాలిచ్చే పరిధి తనకు లేదని హైకోర్టుచెప్పేసింది. రెండు పక్షాలు చర్చించుకుని వివాదానికి ముగింపు పలకాలని సూచించింది. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంగడప తొక్కినా ఇలాంటి సూచనే వచ్చేదేమో. ఇగోల సంగతెలా ఉన్నా సభామర్యాద పాటిస్తే సరిపోయేదానికి కోర్టులదాకా వెళ్లడమే విచిత్రం. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ మొదట అనుమతి ఇవ్వకపోవటంతో ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గవర్నర్ లేకుండానే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కావడంతోనే పరిస్థితి ఇంతదాకా వచ్చింది.
హైకోర్టు ధర్మాసనం సూచనతో రెండు పక్షాల మధ్య రాజీ కుదిరింది. ఇదేదో ముందే పరస్పరం మాట్లాడుకుని ఉంటే గౌరవంగా ఉండేది. గవర్నర్‌కి వ్యతిరేకంగా ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై తామెలా విచారణ చేపట్టగలమని ధర్మాసనం ప్రశ్నించింది. గవర్నర్ విధుల్లో జోక్యం తన పరిధిలోకి రాదని చెప్పేసింది. ఈ వివాదంలోకి న్యాయవ్యవస్థని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించింది. ఏ వ్యవస్థ అయినా పరస్పర గౌరవంతో ముందుకు సాగాలన్న హైకోర్టు సూచన నూటికి నూరుపాళ్లు నిజం. గవర్నర్ వ్యవస్థ ఉన్నన్నాళ్లూ కొన్ని మర్యాదలు పాటించాల్సిందే. ఎవరి పరిధి ఏమిటన్నది చర్చించుకుంటూ పంతాలకు పోతే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుంది. అందుకే సున్నితమైన ఈ అంశంలో హైకోర్టు తాను చెప్పాల్సింది తాను చెప్పేసింది.
రెండు పక్షాలు చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలన్న హైకోర్టు సూచనతో ప్రభుత్వం కూడా ఓ మెట్టుదిగింది. అటు గవర్నర్ కూడా వివాదాన్ని మరింత సాగదీసేందుకు సిద్ధంగా లేరు. గణతంత్ర వేడుకలపై హైకోర్టు ఆదేశాలతో కంగుతిన్న కేసీఆర్ సర్కారు బడ్జెట్ సమావేశాలపై రాజ్‌భవన్‌తో రాజీకి రాక తప్పలేదు. ఇష్టం లేకపోయినా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అంగీకరించింది. కోర్టు సూచనతో వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేయగానే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. దీంతో ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ సమ్మతించారు. ప్రభుత్వ ఆహ్వానంతో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
బెట్టుకు పోవడమెందుకు మళ్లీ మెట్టు దిగడమెందుకు. ఇదేదో ముందే చేసుంటే ఇంతదూరమొచ్చేదా. ఈ రాజీ ప్రతిపాదన ఈ అసెంబ్లీ సమావేశాలవరకేనా లేకపోతే రాజ్‌భవన్-ప్రగతిభవన్ మధ్య ఇకపై దూరం తగ్గిపోతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే గవర్నర్ విషయంలో పదేపదే ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. గవర్నర్ కూడా బహిరంగంగానే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. తమిళనాడులా వివాదం ముదరకుండా చూసుకోవాలంటే ప్రభుత్వమే సర్దుకుపోవాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ ఆ పనిచేస్తారా. ఈ రాజీ కేవలం బడ్జెట్‌కే పరిమితమంటారా. కిందపడ్డా తనదే పైచేయి అంటారుకాబట్టి ఆయన ఏమన్నాచేయగలరు.