రాజకీయ కురువృద్ధులు వారసులపై దృష్టి పెట్టారు. నాయకత్వాన్ని పిల్లలకు అప్పగించి తప్పుకుందామనుకుంటున్నారు. ఎన్నికల నాటికి చుట్టుపక్కల నియోజకవర్గాలపై పట్టు పెంచుకోవాలని పిల్లలకు నూరిపోస్తున్నారు. అందుకోసం పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కొడుకులు కూతుళ్ల కోసం ఆరాట పడుతున్న కన్నవారి జాబితా రోజురోజుకు పెరుగుతోంది.
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లో వారసత్వ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాము అస్త్ర సన్యాసం చేసి పిల్లల్ని నాయకులుగా ప్రకటించాలన్న కోరిక చాలా మందిలో పెరిగిపోతోంది. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా మూడు సార్లు ఎంపీగా సేవలందించిన గుత్తా తెలంగాణ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో కొడుకు అమిత్‌రెడ్డిని డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి కావాలనే చిరకాల వాంఛ ఉన్నప్పటికీ అది నెరవేరడం లేదు. అదే సమయంలో వయసు పైబడుతుండడంతో కొడుకు అమిత్‌రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
గుత్తా మెమోరియల్ ట్రస్ట్ పేరుతో అమిత్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాని మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ప్రజల్లో మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యూత్ ఇమేజ్ పెంచుకునేందుకు కానిస్టేబుల్ అభ్యర్థులకు పోషకాహారం సైతం అందించారు. దీంతోపాటు గుత్తా అమిత్‌రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా బర్త్ డే వేడుకలు నిర్వహించడంతోపాటు పలు దేవాలయాల్లో గుత్తా ఫ్యాన్స్ పూజలు చేశారు. రక్తదానం అన్నదానం చేసి పలు చోట్ల ప్రచార ఫ్లెక్సీలతో హోరెత్తించారు. ఆయా కార్యక్రమాల ద్వారా సుఖేందర్ రెడ్డి తన కొడుకు అమిత్‌రెడ్డిని ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
కొడుకు అమిత్‌ను అసెంబ్లీకి పంపేందుకు గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆయనకు పట్టున్న నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో ఏదో చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని చెప్పడం గుత్తాను కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ సిట్టింగుల ప్రకటనలో ఏమైనా మార్పులు జరిగితే అవకాశం ఉంటే కలిసి వస్తుందని సుఖేందర్‌రెడ్డి ఆశ పడుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకుంటే గతంలో తాను పోటీ చేసిన నల్గొండ నుంచి ఎంపీగానైనా బరిలో దించాలని చూస్తున్నట్టు గుత్తా సన్నిహితుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ లో టఫ్ ఫైట్ ఉంది. అన్ని నియోజవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులున్నారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ నేతల్లో జోష్ పెరిగింది. సిట్టింగులకు టికెట్లు లేవు అని ఒక్క మాట వినిపిస్తే ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ పదుల సంఖ్యలో ఆశావహులు బయలుదేరుతారు. పైగా నల్గగొండ సంపన్న జిల్లాగా చెప్పుకోవాలి. గెలుపు కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు వెనుకాడని నేతలు అక్కడున్నారు. వారందరినీ తట్టుకుని అమిత్ రెడ్డి పార్టీ టికెట్ పొందాలి. సమర్థుడైన రాజకీయ నాయకుడిగా తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉన్న పేరును ఆయన ఉపయోగించుకోవాలి. తనకంటూ ఆయనకు ఒక ఇమేజ్ సిద్ధం కాలేదు. అందుకే అమిత్ రెడ్డి రాజకీయ అరంగేట్రం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ చేతుల్లో ఉందని చెప్పకతప్పదు. టికెట్ ఇస్తే మాత్రం గెలవడం కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఎందుకంటే సుఖేందర్ రెడ్డి ఖర్చుకు వెనుకాడే నాయకుడు కాదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాజకీయ నాయకుల్లో ఆయనకు మంచి పేరు ఉంది. తన కొడుకు కోసం ఆయన ఎంతైనా ఖర్చు పెడతారు.