కేసీఆర్ బయటకు రారు.. హరీష్ దున్నుకుంటారు.. !

By KTV Telugu On 25 September, 2024
image

KTV TELUGU :-

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఏడాది తర్వాత భారత రాష్ట్ర సమితిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పార్టీ సుప్రీం లీడర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో చాలా మంది నేతలు జారిపోతున్నారు. బీఆర్ఎస్ లో ఉండి ప్రయోజనం లేదనుకుని అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఉన్నవాళ్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దిశానిర్దేశం చేసే పెద్దాయన పట్టించుకోకపోవడంతో ఇక తాము చెప్పిందే వేదం అన్నట్లుగా కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ లీడర్ హరీష్ రావుకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యం పెరుగుతోంది…

రెండు నెలలుగా హరీష్ రావు..పార్టీలో అందరి కంటే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నారు. పార్టీలో ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ…ఇతరులను కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది నేతలు హైదరాబాద్ లోనూ, సిద్దిపేటలోనూ హరీష్ రావును కలుసుకుని తమ సంఘీభావం తెలుపుతున్నారు. ఆయనతో మాట్లాడేందుకు, సలహాలు తీసుకునేందుకు వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ హరీష్ రావు దగ్గర అటెండెన్స్ వేసుకుంటున్నారు.పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికంటే ఎక్కువగా హరీష్ రావును టార్గెట్ చేయడంతో ఆయనకు కష్టపడకుండానే పబ్లిసిటీ వస్తోంది.క్రమంగా పార్టీ కేడర్ పై హరీష్ రావు పట్టు పెంచుకుంటున్నారు..

ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే హరీష్ రావు, కేటీఆర్ మధ్య చిన్న గొడవ జరిగినట్లు చెబుతారు. అది చినికి చినికి అంతర్గత సంఘర్షణగా మారింది. దానితో ఎవరికి వారు తమ పట్టును పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హరీష్ రావు కేడర్ బలాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతూ వస్తున్నారు. మరో పక్క కేటీఆర్….ఒక ఇంటలెక్చువల్ తరహాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు, నిరసనలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు నేతలు లీక్ చేస్తున్న సమాచారం ఆధారంగా ఆయన రేవంత్ పై ఆరోపణలు సంధిస్తున్నారు. రేవంత్ పై వ్యక్తిగత కక్షతో ఆయన మాట్లాడుతున్నట్లుగా కూడా అనిపిస్తోంది….

ఉద్యమకాలం నుంచి హరీష్ రావు పార్టీలో ఉన్నారు. కేసీఆర్ వెంట నీడలా ఉండేవారు. పార్టీ అధినేత ఆమరణ దీక్ష చేసినప్పుడు కూడా ఏర్పాట్లన్నీ చూసినదీ హరీష్ రావేనని చెప్పాలి. కేటీఆర్ కాస్త లేట్ గానే ఎంటరయ్యారు. కేసీఆర్ కుమారుడు కావడంతో ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రిగా ఆయన సేవలు ప్రశంసించదగినవేనని చెప్పక తప్పదు. అయితే మాస్ లీడర్ ఎవరంటే మాత్రం అదీ హరీష్ రావు అనే చెప్పాల్సి వచ్చింది. ఒక్క సారి కార్యకర్తను కలిశారంటే ఎప్పటికీ ఆయన పేరును మరిచిపోరు. సిద్దిపేట నియోజకవర్గంలో పది పన్నెండు వేల మందిని పేరు గుర్తుపెట్టుకుని మరీ.. పేరు పెట్టి పిలిచే నాయకుడు ఆయన. దానితో ఆటోమెటిగ్గా హరీష్ ప్రజల మనిషిగా మారిపోయారు. మరో పక్క కేడర్ కు కేటీఆర్ అందుబాటులో ఉండరని, ఎవ్వరినీ దగ్గరకు రానివ్వరని చెబుతారు..

లిక్కర్ స్కాంలో అరెస్టయిన కవిత.. బెయిల్ పై విడుదలైన తర్వాత తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్య కారణాలతో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానితో రాజకీయాలు మొత్తం కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా సాగుతున్నాయి. ఇంతకాలం పార్టీలో కీలకంగా అన్ని పనులు చేస్తున్నప్పటికీ కేసీఆర్ పిల్లలు తనను దూరం పెట్టారన్న అసంతృప్తి హరీష్ రావులో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అవకాశం వచ్చిందే తడవుగా దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. త్వరలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి