తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నట్లుగా మారిపోయాయి రాజీకీయాలు. నాయకులకు సహనం అనేది లేకుండా పోయింది. తన ప్రత్యర్థులను నోటికి ఎంతొస్తే అంత మాట అనడానికి వెనకాడడం లేదు. తిట్లు, బూతులు, శాపనార్థాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఈమధ్య ఏపీలో పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ వైసీపీ నాయకులను ఘోరమైన బూతులు తిట్టి తాను కూడా ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు. అసలు తిట్లు రాని వాడు రాజకీయాల్లో పనికిరాడు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ మాట్లాడుతూ కొందరు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, వారి తిట్లను తాను పట్టించుకోనని అన్నారు. తాను 22 ఏళ్లుగా అనేక రకాలుగా తిట్లు తింటూనే ఉన్నానని తెలిపారు. తిట్లను తాను న్యూట్రీషన్‌గా మార్చుకుంటానని. రోజుకు 2 నుంచి 3 కిలోల తిట్లు తింటానని సెటైర్లు వేశారు.
ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని చెప్పారు మోది. తనను తిడితేనే రైతులు బాగుపడతారంటే తిట్లు తినడానికి తాను సిద్ధమని చెప్పారు. ఈమధ్య సీఎం కేసీఆర్ ప్రధానిపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. దేశానికి, రాష్ట్రానికి ఏం చేయాలో చెప్పమంటే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవటమేంటని కౌంటర్ వేశారు.
ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అంటున్నారని, అలాగైతే తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్టే తిట్లు సీఎం కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయని ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు హరీశ్ రావు. తిట్ల విషయంలో అన్ని పార్టీలు ఒకటే అనేది సామాన్యుల అభిప్రాయం.