రేవంత్ ని టార్గెట్ చేసిన హరీష్

By KTV Telugu On 2 October, 2023
image

KTV TELUGU :-

తెలంగాణాలో కాంగ్రెస్ ఒకపక్క ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది. మరో పక్క  కాంగ్రెస్ పై  విపక్షాలతో పాటు స్వపక్షంలోని కొందరు నేతలూ దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవి కొత్త కాదు. వందేళ్లు పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడుదుడుకులు చూసింది. ఎన్నో రాజకీయ విన్యాసాలను  చూసింది. ప్రస్తుతం తెలంగాణాలోనూ కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి విపక్షాలు చేసే కుట్రలను తట్టుకునే  సత్తా తమకి ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకుని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకటి రెండు వారాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావచ్చని అనుకుంటున్నారు. అన్ని పార్టీలు సమర సన్నాహాలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ మొత్తం అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసేసింది. కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టిక్కెట్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. బీజేపీ కూడా పోటీ చేసే దమ్మున్న అభ్యర్థులను వెతుకుతోంది. కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల్లో  టికెట్ల కోసం ఆశావహులు చాలా పెద్ద సంఖ్యలోనే బారులు తీరి మరీ దరఖాస్తులు సమర్పించుకున్నారు.  ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ ప్రచారం స్టార్ట్‌ అయింది.

అసలే రేవంత్‌ అంటే కాంగ్రెస్‌లోనే చాలామందికి పడదు. మరోవైపు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఒక రేంజ్‌లో విమర్శలు చేశారు. టీ.కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్లకు పది కోట్లు, ఐదు ఎకరాల భూమి తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలు తనవి కావని కాంగ్రెస్ నేతలే రేవంత్‌ మీద ఆరోపణలు చేస్తున్నారని హరీష్‌ చెప్పారు.తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించడాన్ని కాంగ్రెస్‌లోని సీనియర్లు తీవ్రంగా అడ్డుకున్నారు. అయితే హైకమాండ్‌ ఆయనకే మద్దతిచ్చింది. అదే సమయంలో మాణిక్కం ఠాగూర్‌ పాతిక కోట్లు తీసుకుని రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ సీనియర్ల నుంచి వెల్లువెత్తాయి.

కొన్నాళ్ళకు అంతా చల్లబడినా రేవంత్‌ అంటే వ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదు. పైకి బాగానే కనిపిస్తున్నా రేవంత్‌ ఆధిపత్య ధోరణిని కాంగ్రెస్ సీనియర్లు ఎక్కడికక్కడ అడ్డుకుంటూనే ఉన్నారు. పీసీసీ చీఫ్‌ పదవిని కొనుక్కున్న రేవంత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లను అమ్ముకోవడం పెద్ద వింతేమీ కాదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డికి రాజకీయ జీవితంలో ఎన్నడూ రాని అవకాశం ఇప్పుడు వచ్చింది. తనవారికి టిక్కెట్లు ఇప్పించుకునే అవకాశం, రికమెండ్ చేసే అవకాశం అరుదుగా వస్తుంది. కాంగ్రెస్‌లోని సీనియర్లందరినీ తోసిరాజని ముందుకు దూసుకువచ్చిన రేవంత్‌రెడ్డి విచ్చలవిడిగా టిక్కెట్ల హామీ ఇచ్చి ఆస్తులు పోగేసుకుంటున్నాడనే ఆరోపణలు పార్టీలోనుంచే వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో కొందరు  నేతలు బి.ఆర్.ఎస్. తరపున కోవర్టులుగా పనిచేస్తున్నారని గతంలోనే  విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు చేసింది కూడా కాంగ్రెస్ నేతలే. ఆ నేతలే ఇపుడు రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి ఈ ప్రచారం మొదలు పెట్టి ఉంటారని అంటున్నారు. రేవంత్ రెడ్డి  పిసిసి అధ్యక్షుడు అయ్యాక కొన్ని  సమస్యలు వచ్చినప్పటికీ ఇపుడు కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణాలో  రేసు గుర్రంలా పరుగులు పెడుతోంది.  రేవంత్ రెడ్డి సారధ్యంలో  రేపటి ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని  రాజకీయ విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు.

చాలా మంది సీనియర్లతో విబేధాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మొత్తం మీద పార్టీని బానే ముందుకు నడిపిస్తున్నారు.  దానికి హై కమాండ్  అమలు చేసిన ఫార్ములా కూడా  కారణం కావచ్చు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే  రాకతోనే సీనియర్లను ఏకతాటిపైకి తెచ్చే మహాయజ్ఞం ఓ కొలిక్కి వచ్చింది. కోమటి రెడ్డి వెంకట రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి  కలిసి మెలిసి కార్యక్రమాలు చేపట్టేలా చేయడంలో ఠాక్రే విజయ వంతం అయ్యారు. అదే సమయంలో కర్నాటక లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆ గాలి ఇటు వైపు వచ్చి కాంగ్రెస్ లో జోష్ పెంచింది. అది ఒక విధంగా రేవంత్ అదృష్టమనే చెప్పాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి