థంబ్-ప్రజలు ఎవరికి హుజూర్ అంటారు?

By KTV Telugu On 19 October, 2023
image

KTV TELUGU :-

రానున్న ఎన్నికల్లో  అగ్ర శ్రేణి నేతల భవితవ్యాన్ని తేల్చే  కొద్ది పాటి నియోజక వర్గాల్లో  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఒకటి. గులాబీ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబరు టూగా వెలిగి.. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన  స్టార్ పొలిటీషియన్ ఈటల రాజేందర్  బిజెపిలో చేరి అక్కడా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇప్పటివరకూ  ఈ నియోజక వర్గంలో ఏ ఎన్నికైనా ఆయనదే విజయం. ఎన్నికలు, ఉపఎన్నికలు కలిపి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన ఘనత ఈటల రాజేందర్‌ది. గత ఉపఎన్నికల్లో తన ధిక్కారస్వరం.. అధికారపార్టీ తనపై పెట్టిన ఫోకస్.. ప్రజల నుంచి ఆయనకు లభించిన సానుభూతి వంటివి ఆయన్ను గెలిపించాయి. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉందా? ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి కావాలా? ఈటల కావాలా ? అని అధికారపక్షం ప్రజల్ని ప్రశ్నిస్తోంది. మరి హుజూరాబాద్ బాద్ షా ఎవరు కాబోతున్నారు ?

గులాబీబాస్ కేసీఆర్ కు సుదీర్ఘకాలం పాటు అండగా ఉండి.. పార్టీలో నంబర్ టూగా ఎదిగిన ఈటల రాజేందర్‌ రాజకీయ ప్రయాణం అనుకోని మలుపులు తిరిగింది. పార్టీ అధినేతతో వచ్చిన తేడాలు ఇద్దరి మధ్య దూరం పెంచాయి. దాంతో మంత్రి పదవి పోయింది. ఆ అవమానాన్ని భరించలేక గులాబీపార్టీని వీడారు. కారు దిగిన వెంటనే ఈటల కమలంలో చేరి కాషాయకండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తో కొద్దికాలానికే విభేదాలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీలో రెండోస్థానం వరకూ ఎదిగిన తనకు..జాతీయపార్టీలో దక్కే ప్రాధాన్యత దృష్ట్యా బీజేపీలో చేరిన ఈటల చాలాకాలం నారాజ్ గానే కనిపించారు.

మాజీ మంత్రిగా… హుజురాబాద్ లో అధికార బీఆర్ఎస్ ఎన్ని వ్యూహాలు రచించినా ఎదురొడ్డి నిల్చి గెల్చిన ఈటలకు సముచిత స్థానం ఇవ్వాలన్న ఆలోచనతో.. అధిష్ఠానం ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ను చేసింది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కూడా కరీంనగర్ జిల్లాను..ముఖ్యంగా తన నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉండే ఈటల.. ఇప్పుడు హుజూరాబాద్ లో ఎప్పుడో తప్ప కనిపించడం లేదు. ఆయనకున్న పదవి బిజీ కావొచ్చు.. లేక, హుజూరాబాద్ పై పట్టు కోల్పోతున్నానన్న భావనే కావచ్చు.. లేక, ఆయనే చెప్పినట్టు కేసీఆర్ పై పోటీ చేయడంపై ఫోకస్ కావచ్చు.. కారణం ఏదైతేనేం  ఈటల మాత్రం హుజూరాబాద్ కు దూరమయ్యారు. కేసీయార్ పై గజ్వెల్ లో పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

హుజూరాబాద్ లో బీజేపీ తరపున ఈటలే మళ్లీ బరిలో ఉంటే..ఇప్పటికే క్రికెటర్ నుంచి పొలిటీషియన్ గా రూపాంతరం చెంది.. గతంలో రెండో స్థానంలో నిల్చిన గులాబీ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డితో ఈటలకు ఈసారి టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిల్చినా.. టాక్ మాత్రం మళ్లీ ఈటల, కౌశిక్ రెడ్డి మధ్యనే వార్  అని బలంగా వినిపిస్తోంది. మరి ఈ టాక్ ను మించి గత ఉప ఎన్నికల సానుభూతితో బల్మూరి వెంకట్ కాస్త ముందుకెళ్తారా అనేది చూడాలి.

హుజూరాబాద్ అభివృద్ధి విషయానికి వస్తే.. హుజూరాబాద్- పరకాల రోడ్డు, హుజూరాబాద్-మానకొండూర్ రోడ్ల వంటివెన్నో అభివృద్ధి చేసినా… డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినా.. మోడల్ స్కూల్స్ తీసుకొచ్చినా..ఆశించిన స్థాయిలో ఈటల అభివృద్ధి చేయలేకపోయారనే వాదనను అధికార బీఆర్ఎస్ తో పాటు.. కాంగ్రెస్ కూడా జనంలో చర్చకు పెట్టింది. జమ్మికుంట వంటి భారీ పత్తి మార్కెట్ ఉన్న చోట జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్స్ ఏర్పాటు విషయం.. పత్తి అనుబంధ రంగాల పారిశ్రామికాభివృద్ధి వంటి పలు అంశాలను పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో అభివృద్ధి కావాలా.. ఈటల కావాలా అనే నినాదాన్ని భుజానికెత్తుకుంది అధికార బీఆర్ఎస్ పక్షం.

బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ, కౌశిక్ రెడ్డి.. అధికార హోదాలతో బరిలో గిరి గీస్తే… జస్ట్ ఓ యంగ్ లీడర్ గా ఉస్మానియా బ్రాక్ డ్రాప్ యువరక్తంతో మళ్లీ బల్మూరి వెంకటే వస్తారా.. లేక, ఇంకెవరైనా ఉంటారా.. వాళ్ల ఫైట్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డీ కూడా ప్రారంభంలో వివాదాస్పదంగా వ్యవహిరించినా.. ఇప్పుడు పూర్తి సమన్వయంతో మెచ్యూర్డ్ గా ముందుకెళ్తుండటంతో.. అధికార బీఆర్ఎస్ కూ ఈసారి అవకాశాలూ లేకపోలేదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి