కొత్త సంవత్సరం మొదటి రోజునే తాగి వాహనం నడిపిన వారికి షాక్ ఇచ్చారు తెలంగాణ రవాణా శాఖ అధికారులు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కినవారిపై కఠిన చర్యలు చేపట్టింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన వారి లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు అధికారులు వారికి భారీగా జరిమానా విధించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి విధించే జరిమానాను రవాణా శాఖ ఇటీవలే రూ.10 వేలకు పెంచింది. 2022 సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,819 మంది వాహనదారుల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు.
ఒక్క హైదరాబాద్ లోనే 4,109 లైసెన్సులు క్యాన్సిల్ చేస్తే కొత్త సంవత్సరం మొదటి రోజునే హైదరాబాద్‌లో 3,220 లైసెన్సులు రద్దు చేయడం విశేషం. తాగి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు ముందునుంచే వాహనదారులను హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 31 నుంచి రాత్రిపూట హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతం చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించిన మందుబాబులకు నోటీసులు ఇచ్చి వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.