హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరో కీలక బాధ్యత

By KTV Telugu On 4 September, 2024
image

KTV TELUGU :-

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం సీఎం రేవంత్‌ రెడ్డి హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మరో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్‌ను నియమిస్తారని సమాచారం. కాగా, ఇప్పటివరకు ఈ బాధ్యతలను హెచ్‌ఎండీఏ కమిషనర్‌ నిర్వహిస్తున్నారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు మరో కీలక బాధ్యత అప్పగించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టూ హెచ్‌ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో విస్తరించి ఉన్న చెరువుల పరిరక్షణ కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయగా.. దీనికి ఆయన్ను ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. రూల్స్‌కు భిన్నంగా ఉన్న కట్టడాలను నిర్ధాక్ష్యిణంగా కూల్చేస్తున్నారు. నగరంలో రోజుకొక చోట హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నాయి. చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లు ఆక్రమించిన చేపట్టిన కట్టడాలను కూల్చేశారు. ఇప్పటికే వందల నోటీసులు కూడా జారీ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం హైడ్రా ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఉన్న చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏలో పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా.. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్‌కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు హైడ్రాతోపాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను కూడా రంగనాథ్‌కే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతల అప్పగింతపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

హెచ్‌ఎండీఏలోని ఏడు జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవడం ద్వారా ఆక్రమణలకు గురి కాకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ, నోటిఫికేషన్‌ పూర్తి చేయాలని ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో చెరువులు ఉండగా.. ఆయా జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందులో భాగంగా హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యతలను కూడా రంగనాథ్‌కే అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లోని చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ, నోటిఫికేషన్‌ వెంటనే పూర్తి చేయాలని కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు.

నవంబరు 1 లోగా అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో మెుత్తం 3,500 చెరువులు ఉండగా…ఇప్పటివరకు 265 చెరువులను నోటిఫై చేసినట్లు చెప్పారు. కాగా, హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు కూడా రంగనాథ్‌కే అప్పగించనున్నారనే సమాచారంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి