హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ , కిషన్ రెడ్డి ఏమన్నారంటే….

By KTV Telugu On 28 September, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతుంది కొత్తగా మరింతమంది ఉద్యోగులను కూడా నియమించుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది వందల మందికి నోటీసులు కూడా జారీ చేసింది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ పేట్ వంటి మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ప్రజల నుండి తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా మరికొందరు సీఎం రేవంత్ రెడ్డి ధైర్యానికి మారుపేరని అక్రమ కట్టడాలను కూల్చివేయకుండా ఎలా ఊరుకుంటారని మెచ్చుకుంటున్నారు. కాగా కల్వకుంట్ల తారక రామారావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ

మేము నిర్మిస్తే మీరు కూల్చివేస్తున్నారు మాది నిర్మాణం. మీది విధ్వంసం, లక్షల నిర్మాణాలు మావి లక్షల కూల్చివేతలు మీవి. మూసీ నది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ లక్ష డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పుడు కనపడుతున్నాయా. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్ధాలు అనడానికి ఇదే మరో సాక్ష్యం అసలు ఇల్లే కట్టలేదన్నారు ,ప్రజలను మభ్యపెట్టాం అన్నారు. మరి రాత్రికి రాత్రి లక్ష ఇండ్లు ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి. మీ టేబుల్ ముందు పెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లెక్కలు చూసి మతి పోతుందా,? కేసీఆర్ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజమని తెలిసి మింగుడు పడడం లేదా? మీ జూటా మాటలు, మీకుట్రలు, దిమాక్ తక్కువ పనుల డామేజ్ కంట్రోల్ కు ఇవాళ కెసిఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయి. మీ నాలుకలు తాటి మట్టలు కాకుంటే ఇంకోసారి అబద్ధాలు ఆడకండి అంటూ ట్వీట్ చేశారు.

కేంద్ర బొగ్గుగనుల శాఖా మంత్రి జి కిషన్ రెడ్డి కూడా స్పందిస్తూ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసిలు ఇచ్చిన అనుమతులు తప్పని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. ఒక సంస్థ అనుమతులిస్తే, కొత్తగా మరో సంస్థను ఏర్పాటు చేసి అక్రమం అంటూ కూలగొట్టడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పాలనలో అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు ఏ ప్రభుత్వాలు అయినా పేదలకు ఇండ్లు, రోడ్లు భవనాలు బ్యారేజీలు బ్రిడ్జిలు ఆసుపత్రులు విద్యాసంస్థలను నిర్మిస్తాయని ఈ సర్కారు హైడ్రా పేట్ తో నిర్మాణాలను తొలగిస్తూ ఏకపక్షంగా వెళుతుంది అని తప్పు పట్టారు. పేదల ఆందోళనను ఆవేదనను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకోవడం లేదని తప్పు పట్టారు

ఆక్రమణలు అక్రమ నిర్మాణాలను మేము సమర్థించము, కానీ వాటిపై తీసుకునే చర్యలు న్యాయబద్ధంగా ఉండాలి. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల విషయం ఆలోచించాలని తప్పుడు లేఅవుట్లతో మభ్యపెట్టి ఫ్లాట్లు అమ్మిన వారిని కూడా బాధ్యులను చేసేలా కఠిన చట్టాలను రూపొందించాలన్నారు

ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చడానికి సిద్ధమైన ప్రదేశాల్లో కోట్లు ఖర్చు చేసి రోడ్లు వీధి దీపాలు తాగునీరు డ్రైనేజీ విద్యుత్తు కనెక్షన్లు కమ్యూనిటీ హాళ్ళు ,చివరికి ఇంటి నెంబర్లను కూడా ఇచ్చిందని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దశాబ్దాలుగా జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ ల ద్వారా పన్నులు తీసుకుంటూ హఠాత్తుగా అక్రమం అంటే పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి అని నిలదీశారు. కొన్నిచోట్ల అన్ని అనుమతులు ఉన్న భవనాలను కూడా నేలమట్టం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని అన్నారు

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి