తెలంగాణ రాజకీయాలు వచ్చే రెండు మూడు నెలల్లో ఎవరూ ఊహించనన్ని మార్పులకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుగా మూడు పార్టీల మధ్య పోరు కాస్తా ముఖాముఖి పోరుగా మారినా ఆశ్చర్యం లేదు. దానికి తగ్గట్లుగా సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులకు స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే అదే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేయడానికి మొహమాట పడుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది కానీ… ఈ స్కాం విషయంలో ఆమె ప్రమేయం ఎప్పటికప్పుడు బయట పెట్టడానికి అవసరమైన ప్రతీ సాక్ష్యాన్ని వెలుగులోకి పంపుతున్నారు. ముఖ్యంగా ప్రజలకు అర్థమయ్యే సాక్ష్యాల్ని వెలుగులోకి వచ్చేలా చేస్తున్నారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రశ్నిస్తున్నారు. కాలు ఫ్రాక్చర్ కారణంగా కవిత ప్రస్తుతానికి అందుబాటులో లేరు కానీ ఆమెను కూడా విచారణకు పిలిచి ఉండేవారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇవాళ కాకపోతే రేపైనా కవిత అరెస్ట్ తప్పదని జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ పరిణామం తర్వాత తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయే చాన్స్ ఉంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమార్తె ఎమ్మెల్సీ అయిన కవితను అరెస్ట్ చేస్తే కామ్‌గా కూర్చునే చాన్స్ ఉండదు. ఇప్పటి వరకూ ఆయన ఈ విషయంలో అండర్ ప్లే చేస్తూ ఉండవచ్చు అరెస్ట్ అంటూ జరిగితే రాజకీయంగా ఏం చేయాలో ఓ బ్లూప్రింట్ రెడీ చేసుకుని ఉంటారు. దాన్ని అమలు చేయడం ప్రారంభిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయి. కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ నేతృత్వంలో మోదీపై పోరాటానికి కలిసి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న విషయాన్ని పక్కన పెట్టి ముందుగా బీజేపీని ఓడించడం లక్ష్యంగా కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమితో కలిస్తే ఇక్కడ తెలంగాణ వచ్చే రాజకీయ మార్పులు ఎంత డైనమిక్ గా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. జాతీయ స్థాయిలో కలిసి పని చేసి రాష్ట్ర స్థాయిలో పొట్లాడుకుంటామంటే ప్రజల్లో మైనస్ అవుతుంది. అది బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మైనస్ అవుతుంది. ఈ విషయాన్ని చెప్పి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పని చేసేలా ఓ వేదిక సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల కోసం కాంగ్రెస్ కూడా అనుమతించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
అలాంటి పరిస్థితి వస్తుందని ఇప్పటికే అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్లు పొత్తుల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. కానీ టీ పీసీసీ చీఫ్ మాత్రం పొత్తుల ప్రసక్తే లేదంటున్నారు. కానీ ఇటీవల ఆయన కూడా మాట మార్చారు. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నంత కాలం పొత్తులు ఉండవంటున్నారు. అంటే రేవంత్ రెడ్డికి కూడా జరుగుతున్న పరిణామాలపై అవగాహన ఏర్పడిందని అనుకోవచ్చు. దీనికి కారణం ఉంది రేవంత్ రెడ్డి రాజకీయంగా ఉత్సాహంగా పోరాడుతున్నారు కానీ పొత్తు చర్చల కారణంగా ఆయన రానురాను బలహీనపడుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆర్థిక శక్తిని సమీకరించుకోవడం ఆయనకు కష్టంగా ఉంది. ఆర్థిక సాయం చేసే వారు ఉన్నా తీసుకునే మార్గాలు కూడా టైట్ చేస్తారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఏం జరిగిందో రేవంత్ రెడ్డికి గుర్తు ఉంది.
పొత్తు అంటూ అంటే తాను చీఫ్‌గా ఉండనని చెబుతున్నారు కానీ పొత్తు ఉండదనే మాటలను మాత్రం ఆయన చెప్పడం తగ్గించారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిపోతారని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డికి మరో చాన్స్ లేదు. ఎన్నికలు దగ్గర పడ్డాయి కొత్త పార్టీ అనే ఆలోచన చేస్తే ఆయన రాజకీయ జీవితం చిందర వందర అవుతుంది. అలాగని బీజేపీలో చేరలేరు టీడీపీకి వెనక్కి వెళ్లలేరు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ బీఆర్ఎస్తో పొత్తు తప్పదు అని స్పష్టం చేస్తే హైకమాండ్ నిర్ణయం అని సర్దుకుపోవడం తప్ప రేవంత్ రెడ్డి చేయగలిగిందేమీ లేదు.
కవిత అరెస్ట్ తర్వాత రాజకీయాలు ఇలా మారిపోతూ వస్తూంటే ఇక బీజేపీ ఊరుకుంటుందా ఖచ్చితంగా పంజా విసురుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముఖ్య నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ పొత్తుతో ఎఫెక్ట్ అయ్యేవాళ్లు బీజేపీకి క్యూకడతారు. అదే సమయమంలో కొంత మంది బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీకి వరుస కడతారు. ఇలాంటి ఎఫెక్ట్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. బీజేపీకి హైప్ వచ్చింది కానీ అభ్యర్థులు లేరు. బలమైన అభ్యర్థుల కోసం ఆ పార్టీ ఎదురు చూస్తూ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు సన్నిహితమవుతాయో అప్పుడు బీజేపీ లక్ష్యం నెరవేరుతుంది. కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతుంది. అంటే తెలంగాణ రాజకీయాలు ముఖాముఖిగా మారిపోతాయి. బీజేపీ కోరుకుంటున్నది ఇదే.