కేసీఆర్ మూడో సారి గెలిస్తే !

By KTV Telugu On 10 August, 2023
image

KTV Telugu ;-

తెలంగాణ సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నారు. గతం కంటే సీట్లు పెంచుకుంటామని ధీమాగా చెబుతున్నారు. ప్రపంచంలో మరే రాష్ట్రం… దేశం కూడా ఎదగనంత వేగంగా తెలంగాణ ఎదిగిందని కేసీఆర్ నమ్మకం. దానికి తగ్గట్లుగా ఆయన లెక్కలు చెబుతున్నారు. మరి మరోసారి గెలిచి కేసీఆర్ ఏం చేస్తారు ? ఏం చేయగలుగుతారు ? అంతా చేసేశామని చెప్పుకుంటున్నందున .. గెలిచిన తర్వాత చేయగలిగేది ఏముంటుంది ?

అధికారంలో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీకి గండం యాంటీ ఇన్‌కంబెన్సీ. అంటే అధికార వ్యతిరేకత. ఈ రోజుల్లో పాలకుల్ని పదేళ్ల పాటు భరించడం అంటే మామూలు విషయం కాదు. రాజకీయ పార్టీలన్నీ ఏది జరిగినా అంతా తమ వల్లే అని చెప్పుకోవడానికి అలవాటు ప డిపోయాయి. అలా చెప్పుకోవడం వల్ల చెడు జరిగినా అది వారికే దక్కుతోంది. చివరికి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి పనితీరుని నిందించే పరిస్థితి వచ్చింది. ఇంతగా రాజకీయాలు ముఖ్యమంత్రి కేంద్రంగా సెంట్రలైజ్ అయిపోయాయి. కేసీఆర్ తొమ్మిదేళ్లకుపైగా సీఎంగా ఉన్నారు. ప్రజల్లో ఉండే ఇలాంటి వ్యతిరేకతను అధిగమించడానికి కేసీఆర్ ఫీల్ గుడ్ అనే భావన తీసుకు వచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అంతా బాగుందని.. తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెబుతున్నారు.

అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం గురించి గొప్పగా చెప్పారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 3 లక్షల 12 వేలు ఉందని చెబుతున్నారు. అంటే ఓ కుటుంబంలో పద్దెనిమిది ఏళ్లు దాటిన వాళ్లు ముగ్గురు ఉంటే ఆ కుటుంబ ఆదాయం ఏడాదికి పది లక్షలు ఉన్నట్లే. మహా నగరాలుఉన్న రాష్ట్రాల్ని తలదన్ని ఎక్కువ మొత్తంలో తలసరి ఆదాయం ఎక్కువ అనేది నిజమన్నారు. కేసీఆర్ ఇది ఎందుకు చెప్పారంటే.. తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందారని.. ఉదాహరణగా చెప్పడమే. అదీ కూడా తెలంగాణ తీసుకు వచ్చి తొమ్మిదేళ్ల పరిపాలనలో ఈ ఘనత సాధింంచామని.. ప్రజల బతుకుల్ని మార్చాలని చెప్పుకోవడమే.

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను విస్తరించడానికి కేసీఆర్ అక్కడ పర్యటిస్తున్నారు. అక్కడ కూడా ఆయన చేసే ప్రసంగాలు సారాంశం ఒక్కటే. తొమ్మిదేళ్లలో తెలంగాణ బంగారు మయం అయింది.. మహారాష్ట్ర ఎందుకు కాలేదనే. కేసీఆర్.. తెలంగాణలో సమస్యలు ఉన్నాయని అసలు అంగీకరించరు. పదేళ్ల అధికారం తర్వాత కూడా సమస్యలు ఉన్నాయని అంగీకరిస్తే… ప్రజా వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతుంది. అందుకే… తెలంగాణను అన్ని విధాలుగా ముందంజలో నిలిచేలా చేశామని చెబుతూ ఉంటారు.

నిజానికి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నట్లుగా. చెబుతున్నట్లుగా తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు ఎవరూ ఊహించని విధంగా పెరిగితే… ప్రతీ కుటుంబం. .. ఏటా పది లక్షల వరకూ ఆదాయం పొందుతూ ఉన్నట్లయితే.. లక్షల రూపాయలు పంచి పెట్టే బంధు పథకాలను ఎందుకు విరివిగా ప్రకటిస్తున్నారు. ఒక్క దళిత బంధు మినహా మిగతా అన్ని పథకాలకూ అర్హతలు చూస్తున్నారు. ఇలా చూస్తున్నా లక్షల కుటుంబాలు లబ్దిదారులుగా అర్హత పొందుతున్నారు. మరి వీరి జీవన ప్రమాణాలు తొమ్మిదేళ్లలో ఎందుకు పెరగలేదు. బీసీ కులాలకు ఇస్తున్న బీసీ బంధు పథకానికి చాలా ఆంక్షలు పెట్టారు. కులవృత్తి చేసుకుంటున్న వారికే.. అదీ కూడా కొన్ని కులాల వారికే ఇస్తమన్నారు. అయినా ఐదున్నర లక్షల కుటుంబాలు దరఖాస్తు చేస్తున్నాయి . ఇక కల్యాణమస్తు దగ్గర్నుంచి ప్రతీ పథకానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లక్షల సంఖ్యలో పథకాలకు అర్హత పొందుతూనే ఉన్నాయి. మరి వీరందరికీ ఎందుకు బంగారం తెలంగాణ ప్రయోజనాలు పొందలేకపోయారన్నది అసలు ప్రశ్న.

కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణ అభివృద్ధి చెందిపోయిందనుకుందాం… ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనుకందాం.. మరి కేసీఆర్ మూడో సారి గెలిచి ఏం చేస్తారు ? ఆయన చేయడానికి ఏముంటుంది ?

తెలంగాణ సీఎం కేసీఆర్ మూడో సారి గెలుస్తారని కొంత మంది అంచనాలు వేస్తున్నారు. కొంత మంది అంత తేలిక కాదని అంటున్నారు. మూడో సారి అధికారం ఇవ్వాలా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ కేసీఆర్ మూడో సారి గెలిస్తే.. గత రెండు విడుతలుగా చేసినట్లుగా పరిపాలన చేయగలరా అన్నది అసలు ప్రశ్న. ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నట్లుగా సంక్షేమ పథకాలు ఇవ్వగలరా అంటే.. చెప్పడం కష్టం. ఎందుకంటే.. కేసీఆర్ గత తొమ్మిదేళ్ల పరిపాలనలో చేసిన అప్పులు గుదిబండగా మారాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్షన్నర కోట్ల వరకూ అప్పు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏటా పదమూడున్నర వేల కోట్ల కిస్తీలు కట్టాలి.. ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మోటర్లను ఆడిస్తే ఐదు వేల కోట్ల కరెంట్ బిల్లు కట్టాలి. అంటే.. కాళేశ్వరం కోసమే బడ్జెట్‌లో పది శాతం వరకూ వెచ్చించాల్సి ఉంటుంది.

ఇక ఇతర అప్పుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఆశ కల్పించడానికి భూములను ఇష్టానుసారంగా అమ్మేసి వేల కోట్ల రూపాయలు పోగేసి.. ప్రజలకు నగదు బదిలీ చేయవచ్చు కానీ.. ఈ భూములు తర్వాత అమ్ముకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడే తెగనమ్మేస్తున్నారు. మళ్లీ ఇలాంటి భూములు అమ్మాలంటే.. భూసేకరణ చేయాల్సిందే. ఫార్మా సిటీకోసం చేస్తున్న భూసేకరణ విషయంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఎంత ఆదాయం ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం మాత్రం అసాధ్యం అవుతుంది. కేసీఆర్ చేపట్టిన పథకాలు చిన్నా చితకలవి కాదు. ఏకంగా లక్షలు ప్రజల ఖాతాల్లోకి బదిలీ చేస్తానని చెబుతున్నారు. ప్రతి దళిత కుటుంబానికి అర్హత అనే మాట వినిపించకుండా పది లక్షలు ఇస్తానని చెబుతున్నారు. హుజూరాబాద్‌లో తప్ప ఇక ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకూ మంద మంది లబ్దిదారులు కూడా లేరు. ఇలా ఒక్క ఏడాది కాదు… ఐదేళ్ల పాటు అందరికీ పంచినా.. రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. ఇక రైతు బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అంటూ లక్షల్లో నగదు బదిలీ పథకాలు ఉండనే ఉన్నాయి. ఇవి కాకుండా అసలైన సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది. ఎలా చూసినా… పథకాల అమలుకు ఏటా కనీసం 70 నుంచి లక్ష కోట్ల వరకూ కావాలి. ఎప్పటికప్పుడు కొర్రీలు పెట్టుకుని .. హామీలను మర్చిపోయినట్లుగా నటిస్తూ… ఉంటే మాత్రం అవసరం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేది ఇదే. రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చేసింది అదే. అందుకే ఎన్నికలకు ముందు ఆ హామీలను అమలు చేస్తున్నారు. అప్పటికీ నిరుద్యోగ భృతి హామీ గురించి చాలా సార్లు ప్రకటించినా ఇప్పటికి మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.

తెలంగాణలో కేసీఆర్ మూడో సారి అధికారంలోకి వస్తే రాజకీయం ఏమీ మారదు. ఎప్పట్లాగే కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ మధ్య చక్కర్లు కొడుతూ ఉంటారు. ఆయన తన వారసుడిగా కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసి.. తాను కుదిరితే జాతీయ రాజకీయాలు చేసుకోవచ్చు. అంతే కానీ.. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి దాకా చేయని.. ఇక ముందు చేయాల్సింది ఉందనేది.. ఏదయినా ఉందని బీఆర్ఎస్ వర్గాలు కానీ కేసీఆర్ కానీ చెప్పుకోవడం లేదు. అంటే… కేసీఆర్ హ్యాట్రిక్ వల్ల… ఆయన తెలంగాణ ప్రజలకు కొత్తగా చేసేది ఏమీ ఉండదు… కానీ కేసీఆర్ కు మాత్రం జాతీయ రాజకీయాల్లో రెడ్ కార్పెట్ అవుతుంది. అంతకు మించి ఈ సారి తెలంగాణ ఎన్నికల వల్ల పెద్ద తేడా ఉండదనేది రాజకీయవిశ్లేషకుల అంచనా.

కేసీఆర్ మూడో సారి గెలవడానికి ఫీల్ గుడ్ భావనను పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యల్లో ఉన్న ప్రజలకు ఇలాంటి ప్రచారం పుండు మీద కారం చెల్లినట్లవుతుంది. కేసీఆర్ నిజంగానే బతుకుల్ని మార్చారనుకుంటే ప్రజలు అండగా ఉంటారు.. లేదంటే… కేసీఆర్ ప్రచారం రివర్స్‌లో బీఆర్ఎస్‌కు ఎదురు తంతుంది. చివరికి బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి