రైజింగ్ స్టార్స్ జోలికి వెళ్లకూడదంటారు. వాళ్లు ఇబ్బందికర వ్యాఖ్యలు చేసినా మౌనంగా ఉండాలంటారు. రాజకీయాల్లో కూడా ఆ సూత్రం వర్తిస్తుంది. కొన్ని సవాళ్లను వినీ విననట్లుగా ఊరుకుంటే మంచిదన్న సంగతి గ్రహించాలి. టీఆర్ఎస్ నేతలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అలా ఊరుకోలేకపోతున్నారు. మాటకు మాట సమాధానం చెబుతున్నామని అనుకుని..చివరకు అభాసుపాలయ్యే దుస్థితిని తెచ్చుకుంటున్నారు….
రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.ఎలా చూసుకున్నా అది ఒక రికార్డే అవుతుంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాజకీయాల్లో రైజింగ్ స్టార్. ఆయన ఎక్కడికి వెళ్లినా లక్షలకొద్దీ జనం వస్తున్నారు. ఆయన చెప్పిన ప్రతీ మాటకు కేరింతలు కొడుతున్నారు. రేవంత్ కూడా విపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలనైతే ఓ ఆటాడుకుంటున్నారు. పైగా ఇప్పుడు రేవంత్ ను ఏమైన అంటే జనం ఊరుకోరు. రేవంత్ మాట్లాడిందే కరెక్టు అని జనం విశ్వసిస్తున్న వేళ ఆయనతో మాటకుమాట దిగడం మంచిది కూడా కాదు. ఐనా బీఆర్ఎస్ నేతలకు ఆ సంగతి తెలిసి రావడం లేదు. రోజు ఏదోటి అని, మళ్లీ అనిపించుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఒక పాయింటు పట్టుకుని జీడిపాకం లాగా సాగదీసుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఉండడమే తప్ప.. ప్రభుత్వాన్ని నిర్దిష్టంగా విమర్శించాలని, దారితప్పుతోంటే గైడ్ చేయాలనే ప్రయత్నం ప్రతిపక్షంలో కనిపించడం లేదు. రుణ మాఫీ విషయంలో ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి పైచేయిగా నిలుస్తున్నారు.
రేవంత్ రెడ్డితో పెట్టుకోవడమంటే కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. ఆ సంగతి బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా హరీష్ రావు ఎందుకలా అసహనానికి లోనవుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ ఇస్తున్న కౌంటర్ అటాక్ తో హరీష్ ఉక్కిరి బిక్కిరి కావడమే కాదు… బీఆర్ఎస్ ను కూడా ఇరకాటంలో పెడుతున్నారు…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రైతురుణ మాఫీ చేస్తాం అని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. గెలిచిన తర్వాత.. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని హామీలను ఒక్కటొక్కటిగా కార్యరూపంలోకి తెస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం కావొచ్చు.. 200 యూనిట్లు దాటని వారికి ఉచిత విద్యుత్తు కావొచ్చు.. ఇలా రకరకాల పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి.
రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఇంకా కార్యరూపంలోకి రాలేదు.రుణ మాఫీ అమలు చేసేలోగా ఎన్నికల కోడ్ వచ్చిందని, ఎన్నికల ముగిసిన తర్వాత.. ఆగస్టు 15 లోగా రుణ మాఫీ పూర్తి చేస్తాం అని సెలవిచ్చారు.నిజానికి జూన్ 4 నాటికి ఎన్నికల పర్వం మొత్తం ముగిసిపోతుండగా.. పాత హామీని అమలు చేయడానికి కోడ్ నెపం పెట్టి ఆగస్టు 15 దాకా రేవంత్ ఎందుకు టైం అడిగారనేది అర్థంకాని ప్రశ్న. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఆగస్టు 15లోగా అమలు చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ ను నిలదీశారు. ఆయన దానికి జవాబిస్తూ అమలుచేస్తే హరీష్, కేసీఆర్, కేటీఆర్ రాజీనామాచేస్తారా? అని సవాలు విసిరారు. హరీష్ రావు ఇప్పుడు రేవంత్ ట్రాప్ లో పడిపోయారు. అమర వీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేస్తావా అంటూ సవాలు విసరబోయారు. ఆహా పడ్డాడ్రా ట్రాప్ లో అని రేవంత్ అనుకున్నారు. రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకో రుణమాఫీ అమలు జరిగిన వెంటనే సమర్పించడానికి వీలుంటుందని రేవంత్ హెచ్చరించేశారు.పైగా దళితుడికి సీఎం పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పారని పాత విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్..తన ప్రత్యర్థులను మరింత ఇరకాటంలో పెట్టారు…
ఆగస్టు 15లోగా అమలు చేస్తే.. హరీష్ రాజీనామా చేసేసి.. ఈ ఒత్తిడులు లేని ప్రశాంత జీవితం గడపొచ్చు. అమలు చేయకపోతే.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే అని గల్లా పట్టుకుని నిలదీయవచ్చు.కాకపోతే ఈ రెండు జరుగుతాయా అంటే ఇప్పుడే చెప్పలేము. ప్రస్తుతానికి రైజింగ్ లో ఉన్న రేవంత్ తో పెట్టుకుంటే మాత్రం కొరివితో తలగోక్కున్నట్లే అవుతుంది. జాగ్రత్త బీఆర్ఎస్….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…