నాగార్జునసాగర్ సీటు మీద కమలం పార్టీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కారు, హస్తం పార్టీలకు ధీటైన అభ్యర్థిని బరిలో దించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రెండు ప్రత్యర్థి పార్టీలు యువనేతలకే ఈసారి ఛాన్స్ ఇవ్వబోతున్నాయి. ఆ తరహాలోనే తాను కూడా యువనేతనే పోటీలో దించడానికి ప్లాన్ చేసింది. ఇంతకీ ఆ యువనేత ఎవరు? వాచ్ దిస్ స్టోరీ..
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కమలం పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ గట్టి అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు..ఇకముందు జరగబోయేది మరో ఎత్తు అనే రీతిగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కారు, కాంగ్రెస్ పార్టీలను తట్టుకుని నిలబడగలిగే అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది కమలం పార్టీ. అయితే నాగార్జునసాగర్‌లో సరైన నాయకులు లేకపోవడంతో ఇతర పార్టీల నేతలకు గేలం వేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డిని లాగాలనుకున్నా సాధ్యం కాలేదు. మరో ఇద్దరు నాయకుల కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూనే కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు కమలనాథులు.బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్ మరోసారి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి రంగంలోకి దిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జానారెడ్డి ఇద్దరు కుమారులు టికెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వడం ఇంచుమించు ఖాయమే అంటున్నారు. ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా యువ శక్తితో ఉరకలు వేసే అవకాశాలున్నాయంటున్నారు.
కాంగ్రెస్, బి.ఆర్.ఎస్.ల నుంచి బరిలోకి దిగబోయే యువనేతలకు ధీటుగా ఉండే మరో యువనేతను రంగంలో దించాలని కమలం పార్టీ యోచిస్తోంది.. గతంలో టికెట్ హామీతో కాషాయ కండువా కప్పుకున్న రిక్కల ఇంద్రసేనారెడ్డి కూడా తనకిచ్చిన హామీని రాష్ట్ర నాయకత్వం దగ్గర పదే పదే గుర్తు చేస్తున్నారట. రాష్ట్ర స్థాయి నేతలు కూడా రిక్కల విషయంలో సానుకూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో నియోజవకర్గంలో ఇంద్రసేనారెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓవైపు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తూనే తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలతో ఆ పార్టీ నేతల్ని కూడా కలిసి మద్దతు కోరుతున్నారట.
ఇక రిక్కలతో పాటు చెన్ను వెంకటనారాయణ రెడ్డి అనే మరో నేత కూడా టికెట్ ఇస్తే పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట. గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రవినాయక్ ప్రస్తుతం యాక్టివ్‌గా లేరని చెబుతున్నారు. ఉప ఎన్నికలు ముగిసిన కొంతకాలం తర్వాతినుంచి రవినాయక్ సైలెంట్ అయిపోయారని పార్టీ కేడరే చర్చించుకుంటోంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదిత కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అయితే పార్టీ మాత్రం ఈసారి పక్కా ప్రణాళికతో ఉంది.
ఎన్నికల్లో పోటీ చేశాం అన్నట్లు కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చి నాగార్జునా సాగర్‌లో పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తోంది. అంగబలం, అర్థబలం ఉన్న నేతకే టికెట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం రిక్కలకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.ఏదో పోటీలో ఉన్నామని అనుకునేవారు కాకుండా…సీరియస్‌గా ఎంతైనా ఖర్చు పెట్టగలవారికే సాగర్ టిక్కెట్ ఇచ్చేందుకు కమలం నేతలు నిర్ణయించుకున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…